logo

అనుమతులు మరచి...హద్దులు దాటించి

పశుసంపదను పల్లెల నుంచి నిత్యం వందల సంఖ్యలో అక్రమంగా సరిహద్దులు దాటించి వధశాలలకు తరలిస్తున్నారు. పశువుల సంఖ్య తగ్గడంతో సేంద్రియ  ఎరువుల కొరత ఏర్పడుతుంది.

Updated : 13 Jun 2024 06:41 IST

దేవరకొండ, న్యూస్‌టుడే: పశుసంపదను పల్లెల నుంచి నిత్యం వందల సంఖ్యలో అక్రమంగా సరిహద్దులు దాటించి వధశాలలకు తరలిస్తున్నారు. పశువుల సంఖ్య తగ్గడంతో సేంద్రియ  ఎరువుల కొరత ఏర్పడుతుంది. భూసారం తగ్గుతుంది. రసాయన ఎరువులతో పెరిగిన పంటలు ప్రజారోగ్యంపై పెను ప్రమాదం చూపుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నివారణ చర్యలు చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పశు సంపద తగ్గుతుండడంతో పాల ఉత్పత్తి తగ్గి నకిలీ పాల తయారీ ముఠాలు హెచ్చుమీరుతున్నాయి. దీంతో మానవాళి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడంతో చిన్నవయస్సులోనే దీర్ఘకాలిక వ్యాధులు సంక్రమిస్తున్నాయి.

అక్రమ రవాణా

ప్రస్తుతం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పశువుల అక్రమ రవాణా రాష్ట్ర హద్దులు దాటి తరలిపోతుండడంతో భవిష్యత్తు అంధకారంగా మారనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక మండలంలో సంత జరుగుతుంది. ప్రధానంగా నార్కట్‌పల్లి, కొండమల్లేపల్లి, మాల్, కట్టంగూర్‌ మండలాల్లోని సంతల్లో నుంచి కంటైనర్లలో 40 నుంచి 80 వరకు పశువులను అనుమతి లేకుండా వధశాలలకు తరలిస్తున్నారు. నిబంధనల ప్రకారం వాహనంలో ఆరు పశువులకు మించి రవాణా చేయకూడదు. వీటికి నీరు, దాణా ఏర్పాటు చేయాలి. మూడు కిలోమీటర్లకు ఒకసారి విశ్రాంతనివ్వాలి. గడ్డితో పాటు ఒక కాపలాదారు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. వీటి ఆరోగ్య స్థితిపై వైద్యుని ధ్రువీకరణ, ఎక్కడికి రవాణా చేస్తున్నారో వివరంగా చెప్పాలి. అయితే ఈ నిబంధనలేవీ ప్రస్తుతం అమలు కావడం లేదు. కొండమల్లేపల్లి చౌరస్తా మీదుగా నిత్యం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు కంటైనర్లలో పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి.

మఠంపల్లి చెక్‌పోస్టు వద్ద సూర్యాపేట మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తున్న ఈ  కంటెయినర్‌ వాహనంలో 15 పశువులు మృత్యువాతపడ్డాయి. ఇవి తమిళనాడు నుంచి ఆంధ్ర
ప్రదేశ్‌కు పెద్ద కంటెయినర్‌లో కిక్కిరిసి రవాణా జరపడంతో ఊపిరాడక మృత్యువాతపడ్డాయి.


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లా నుంచి నాలుగు కంటెయినర్లలో పశువులను హైదరాబాద్‌కు తరలిస్తుండడంతో వాటికి ఊపిరాడని పరిస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా కంటెయినర్‌లో అక్రమంగా పశువుల రవాణా చేస్తూ సరిహద్దుల వద్ద పట్టుబడ్డారు. 

నిఘా పెట్టాం

అనుమతి లేకుండా పశువులను సంత నుంచి తరలిస్తే చర్యలు తప్పవు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత ఎస్‌హెచ్‌వోలను సమన్వయం చేసుకుంటూ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇటీవల దేవరకొండ మండలం పడమటిపల్లిలో అక్రమ రవాణా చేస్తున్న పశువులను పట్టుకున్నాం. సరిహద్దుల వద్ద నిఘా పెంచాం.

గిరిబాబు, డీఎస్పీ
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని