logo

ఢీ సీసీబీ

ల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) అవిశ్వాసం అంశం ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాసలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

Published : 13 Jun 2024 06:29 IST

అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్, భారాసల దృష్టి
కోరం లేక వాయిదా పడిన బోర్డు సమావేశం

కర్ణాటకలో శిబిరంలో ఉన్న డీసీసీబీ డైరెక్టర్లు

ఈనాడు, నల్గొండ: నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (ఎన్‌డీసీసీబీ) అవిశ్వాసం అంశం ఉమ్మడి జిల్లాలోని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష భారాసలకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. ప్రస్తుతం భారాసకు చెందిన గొంగిడి మహేందర్‌రెడ్డి ఛైర్మన్‌గా కొనసాగుతుండగా.. ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టి పదవీ నుంచి దింపాలని, ఛైర్మన్‌ పీఠం ఆశిస్తున్న కాంగ్రెస్‌ పార్టీకి చెందిన డైరెక్టర్‌ కుంభం శ్రీనివాస్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బోర్డులో 19 మంది డైరెక్టర్లు ఉండగా.. 14 మంది డైరెక్టర్ల సంతకంతో కూడిన అవిశ్వాస తీర్మాన ప్రతిని కుంభం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సహకార శాఖ అధికారికి అందజేశారు. దీంతో ఈ నెల 28న ఓటింగ్‌ నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కుంభం శ్రీనివాస్‌రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి సన్నిహితుడు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు రాజగోపాల్‌రెడ్డి పలువురు భారాస డైరెక్టర్లతో మాట్లాడి అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడుతున్నారు. మంత్రి కోమటిరెడ్డి అమెరికా పర్యటనలో ఉండటంతో ఆయన వచ్చాక దీనిపై కాంగ్రెస్‌ నాయకులందరితో మాట్లాడనున్నారని తెలిసింది. సహకార సంఘాల సొసైటీలు ఎక్కువగా హుజూర్‌నగర్, కోదాడ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లోనే ఉండటంతో మంత్రి ఉత్తమ్‌తో పాటు సీనియర్‌ నేత జానారెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారోనన్న చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో సాగుతోంది. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని నోటీసులు ఇచ్చినప్పటికీ మహేందర్‌రెడ్డి బుధవారం బోర్డు సమావేశం (మేనేజింగ్‌ కమిటీ -ఎంసీ) నిర్వహించేందుకు నిర్ణయించారు. ఈ సమావేశానికి తనతో కలిపి కేవలం ముగ్గురు డైరెక్టర్లు మాత్రమే హాజరుకావడంతో కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశారు. అవిశ్వాసం తీర్మానం పెట్టినా ఎంసీ సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని కాంగ్రెస్‌ డైరెక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

గొంగిడి ధీమా..!

ఛైర్మన్‌ పదవీపై కాంగ్రెస్, భారాస నాయకులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తం 19 మందిలో ప్రస్తుతం 14 మంది కాంగ్రెస్‌ డైరెక్టర్‌ కుంభం ఆధ్వర్యంలో శిబిరంలో ఉన్నారు. వారు వివిధ రాష్ట్రాల్లో విహార యాత్రలు చేసి ఈ నెల 28వ తేదీ నాటికి నల్గొండకు చేరుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు గొంగిడి సైతం శిబిరంలో ఉన్న వారిలో ఐదుగురు డైరెక్టర్లు తనకు మద్దతిస్తారని.. లేదంటే ఓటింగ్‌లో పాల్గొనకుండా, అవిశ్వాసం వీగిపోయేలా చూస్తారనే ధీమాలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన వద్ద నలుగురు డైరెక్టర్లు ఉండగా.. మరో ఐదుగురు మద్దతిస్తే అవిశ్వాసం వీగిపోతుంది. అవిశ్వాసం నెగ్గాలంటే 14 మంది డైరెక్టర్లు తీర్మానానికి మద్దతివ్వాలి. అయితే ఓటింగ్‌ నాటికి భారాస మద్దతుతో నెగ్గిన వారు పునరాలోచన చేసి తనకు మద్దతుగా నిలుస్తారని మహేందర్‌రెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు.

బ్యాంకు ప్రతిష్ఠ పెంచాను

అప్పుల్లో ఉన్న బ్యాంకును లాభాల్లోకి తీసుకువచ్చి, బ్యాంకు ప్రతిష్ఠను పెంచాం. సింగిల్‌విండో డైరెక్టరు, ఛైర్మన్, డీసీసీబీ డైరెక్టరుగా, డీసీసీబీ ఛైర్మన్, టెస్కాబ్‌ వైస్‌ ఛైర్మన్‌గా.. నాలుగు దశాబ్దాలుగా సహకార రంగంలో ఉన్నాను. భారాస హయాంలో జరిగిన బ్యాంకు అభివృద్ధి గురించి ప్రస్తుత డైరెక్టర్లందరికీ తెలుసు. శిబిరంలో ఉన్న భారాసకు చెందిన డైరెక్టర్లలో సగం మంది నాకే మద్దతిస్తారనుకుంటున్నా. అవిశ్వాస తీర్మానం వీగిపోతుంది.

గొంగిడి మహేందర్‌రెడ్డి, డీసీసీబీ ఛైర్మన్‌

ఛైర్మన్‌ పీఠం కైవసం చేసుకుంటాం

మొత్తం 19 మంది డైరెక్టర్లలో 14 మంది ఛైర్మన్‌కు వ్యతిరేకంగా ఉన్నారు. నైతికంగా ఆయన పదవీలో కొనసాగే అర్హత లేదు. తక్షణం పదవీకి రాజీనామా చేయాలి. ఈ నెల 28న జరిగే ఓటింగ్‌లో ఆయనకు వ్యతిరేకంగా ఓటేసి ఛైర్మన్‌ పీఠం కాంగ్రెస్‌ పార్టీ కైవసం చేసుకుంటుంది.

 కుంభం శ్రీనివాస్‌రెడ్డి, డైరెక్టర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని