logo

బడి పండగ మొదలాయె

కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇన్నాళ్లు సెలవుల్లో సేదదీరిన విద్యార్థులు బుధవారం బడిబాట పట్టారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యాసంస్థలను తోరణాలు, గాలిబుడగలు, రంగురంగుల కాగితాలతో అలంకరించారు.

Published : 13 Jun 2024 06:32 IST

తొలిరోజు 65 శాతానికిపైగా విద్యార్థులు హాజరు

నల్గొండలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు పాఠ్య
పుస్తకాలు అందజేస్తున్న కలెక్టర్‌ దాసరి హరిచందన

నల్గొండ విద్యావిభాగం, న్యూస్‌టుడే: కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. ఇన్నాళ్లు సెలవుల్లో సేదదీరిన విద్యార్థులు బుధవారం బడిబాట పట్టారు. పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యాసంస్థలను తోరణాలు, గాలిబుడగలు, రంగురంగుల కాగితాలతో అలంకరించారు. పలు చోట్ల ఉపాధ్యాయులు పిల్లలకు స్వాగతం పలికారు. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల పరిధిలో మొత్తం 2028 పాఠశాలలు ఉన్నాయి. వీటిల్లో ప్రభుత్వ యజమాన్యం పరిధిలో 1483 ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో కలిపి దాదాపు 2.23 లక్షల మంది విద్యార్థులు ఉండగా, ప్రభుత్వ పాఠశాలల్లో 69,161 మంది విద్యనభ్యసిస్తున్నారు. తొలిరోజు ఉపాధ్యాయులు వంద శాతం, విద్యార్థులు 65 శాతం పైగా హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.

మిర్యాలగూడ: యాద్గార్‌పల్లి పాఠశాలలో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎంఈవో బాలాజీనాయక్‌

సందడే.. సందడి

విద్యార్థులు, ఉపాధ్యాయుల రాకతో పాఠశాలల్లో పండగ వాతావరణం కనిపించింది. గ్రామాలు, మండలకేంద్రాల్లో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు తొలిరోజు విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన బడిబాటలో కలెక్టర్‌ దాసరి హరిచందన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు అందజేశారు. బడిఈడు పిల్లలందరూ పాఠశాలలో ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. బడిబాట పేరిట పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడమే కాకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలో స్వయం సహాయక మహిళా సంఘాల ద్వారా దాదాపు రెండు లక్షల దుస్తులను కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఏకరూప దుస్తులు, రాత పుస్తకాలు అందజేశారు. నకిరేకల్‌లోని బాలికల ప్రాథమిక పాఠశాల, జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆచార్య జయశంకర్‌ బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులను ఎమ్మెల్యే వేముల వీరేశం పంపిణీ చేశారు. దేవరకొండ జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలునాయక్‌ పాల్గొన్నారు. అంగన్‌వాడీలు, స్వయం సహాయక సంఘాలు, అమ్మ ఆదర్శ పాఠశాలలు బడి బయట ఉన్న పిల్లలను బడిలో చేర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి భిక్షపతి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని