logo

ప్రైవేటుకే మొగ్గు!

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చదివేలా ప్రోత్సహించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Published : 14 Jun 2024 02:05 IST

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో సరిపడా చేరని విద్యార్థులు
సూర్యాపేట పట్టణం, న్యూస్‌టుడే

ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులు చదివేలా ప్రోత్సహించాలని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ఇళ్ల వద్దకు వెళ్లి సర్కారు కళాశాలల్లో ఉండే సౌకర్యాలు, వసతులు, చదువు, ఆటలు, ఇతర అంశాల్లో ప్రోత్సహించే విధానాన్ని వివరిస్తున్నారు. అయినా సర్కారు కళాశాలల్లో చేర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ఎక్కువగా పట్టణ ప్రాంతాల్లోని ప్రైవేటు కళాశాలల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితాల్లో మంచి ర్యాంకులు వస్తున్న కళాశాలల్లో చేర్పించేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించడంలో అధ్యాపకులు విఫలం అవుతున్నారు. ఇంటింటికీ తిరిగి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆయా కళాశాలల వైపు దృష్టి మరల్చడం కత్తిమీద సాములా మారింది. ఆగస్టు చివరి వరకు ప్రవేశాలకు గడవు ఉండగా.. అప్పటి వరకైనా ప్రవేశాల సంఖ్య పెంచాలని అధికారులు ప్రయత్నాలు తీవ్రం చేశారు.

ఏడు కళాశాలల్లో అంతంతే!

జిల్లా వ్యాప్తంగా ఏడు ప్రభుత్వ, 30 వరకు ప్రైవేటు కళాశాలలున్నాయి. ఏడింటిలోనూ నేటికీ సుమారు 300 మంది ప్రవేశాలు పొందారు. ఇప్పటి వరకు ఒక్కో కళాశాలలో 200-300 వరకు చేరేలా చూడాల్సిన అధ్యాపకులు మొత్తం 300 మందిని మాత్రమే చేర్చడం గమనార్హం. గడువు పూర్తయ్యే వరకు ఒక్కో కళాశాలల్లో 400-500 చొప్పున మొత్తం నాలుగు వేల మంది విద్యార్థులు ప్రవేశం పొందేలా చూడాల్సి ఉంది. అడ్మిషన్ల ప్రక్రియ మొదలై 15 రోజులు కావొస్తున్నా.. చేరిన వారు మాత్రం చాలా తక్కువ. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రైవేటు కళాశాలల్లో మాత్రం ఇప్పటికే సుమారు మూడు వేల మంది వరకు ప్రవేశాలు పొందడం విశేషం.

ప్రచార వేటలో అధ్యాపకులు

జిల్లాలోని ఏడు ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థులను చేర్పించడంపై అధ్యాపకులు దృష్టి సారిస్తున్నారు. పదో తరగతి పూర్తయిన వారి వివరాలు తెలుసుకుని నేరుగా వారి ఇంటికి వెళ్లి ప్రభుత్వ కళాశాలల ప్రత్యేకతలు తెలిపి ఆహ్వానిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం ప్రత్యేక దృష్టి సారించి ఉత్తీర్ణత శాతం పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తూ.. ఆయా విధానాలను తల్లిదండ్రులకు వివరిస్తూ కళాశాలల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారు. గడువు పూర్తయ్యే వరకు ప్రభుత్వ లక్ష్యాన్ని చేరేందుకు కృషి చేస్తున్నారు.


వేగంగా ప్రవేశాల పెంపు

- కృష్ణయ్య, డీఐఈవో, సూర్యాపేట 

విద్యార్థులను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించేలా సన్నాహాలు చేస్తున్నాం. అధ్యాపకులు ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం విద్యార్థుల ఇంటికి నేరుగా వెళ్తున్నారు. వేగంగా ప్రవేశాల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు