logo

సంఘర్షణలు వదిలేద్దాం

అప్పటి వరకు ఆప్యాయంగా పలకరించుకునే సామాజిక మాధ్యమ గ్రూప్‌లో ఉన్నట్టుండి ఏదో ఒక పోస్టు అంతరాన్ని సృష్టిస్తోంది.

Published : 14 Jun 2024 02:10 IST

సామాజిక మర్యాద పాటిద్దాం
నాంపల్లి, న్యూస్‌టుడే

  • నాంపల్లి మండలానికి చెందిన ఓ యువకుడు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓ ప్రజాప్రతినిధికి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమంలో పోస్టు చేశాడు. ఈ పోస్టు వివాదాస్పదంగా మారడంతో ఆ యువకుడిపై కేసు నమోదైంది.
  • నల్గొండ జిల్లాకు చెందిన ఓ పాఠశాల పూర్వ విద్యార్థుల వాట్సాప్‌ గ్రూపులో ఇద్దరు మిత్రుల మధ్య ఆర్థిక స్థితిగతులపై జరిగిన చర్చ తీవ్ర వివాదానికి కారణమైంది. తోటి మిత్రుల సంయమనంతో సమస్య సద్దుమణిగినప్పటికీ కొందరు మిత్రులు గ్రూపు నుంచి వైదొలిగారు.
  • నల్గొండ జిల్లాలోని ఓ మండలంలో ఏడాది క్రితం రెండు ఉద్యోగ సంఘాల మధ్య సామాజిక మాధ్యమంలో జరిగిన విమర్శల యుద్ధం వివాదాస్పదంగా మారింది. రెండు సంఘాల నాయకులు ఓ ఒప్పందానికి వచ్చినప్పటికీ ఇరువర్గాలు చేసుకున్న విమర్శల తాలూకు మరకలు ఇంకా మిగిలే ఉన్నాయి.

ప్పటి వరకు ఆప్యాయంగా పలకరించుకునే సామాజిక మాధ్యమ గ్రూప్‌లో ఉన్నట్టుండి ఏదో ఒక పోస్టు అంతరాన్ని సృష్టిస్తోంది. ఆత్మీయులుగా మెలిగే వారిని శత్రువుగా మార్చేస్తుంది. వ్యక్తిగత వైరాలకు దారితీస్తోంది. కొత్త పరిచయాలు అటుంచితే.. బాల్యమిత్రులు, సహోద్యోగులుగా ఉన్నవారు సైతం సామాజిక మాధ్యమ పోస్టుల ప్రభావంతో దూరమవుతున్నట్లు ఉమ్మడి జిల్లాలో పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. సామాజిక మాధ్యమ పోస్టులను తదేకంగా ఫాలో కాకుండా.. చూసిన వాటిపైనా సానుకూల దృక్పథంతో వ్యవహరించడమే మేలన్నది నిపుణుల సూచన.

అనాలోచిత సందేశాలతో మనోవేదన..

ప్రస్తుత డిజిటల్‌ యుగంలో ప్రతి ఒక్కరికీ స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాలు మరింత చేరువయ్యాయి. ఇదే సమయంలో స్మార్ట్‌ఫోన్లపై గడిపే సమయం పెరుగుతూ వస్తోంది. మరి కొందరికి వ్యసనంగా మారుతోంది. కొత్త పరిచయం, బాల్య స్నేహం, ఇరుగు పొరుగు, బంధుత్వం, సహోద్యోగులు.. ఇలా ఎవరైనా మాటామంతికి నేడు సామాజిక మాధ్యమాలే వేదికలయ్యాయి. సొంతంగా పోస్టులు చేయొచ్చు. ఒక్కసారి సున్నితమైన అంశాలు చర్చనీయాంశంగా మారి అవతలివైపు వారి మనోవేదనకు కారణమవుతున్నాయి. వ్యతిరేక సందేశాలను పదేపదే తలచుకొని భావోద్వేగాలపై నియంత్రణ కోల్పోతున్న వారు ఎందరో ఉన్నారు. ‘సామాజిక మాధ్యమాల’ సందేశాలపై గంటల తరబడి ఆలోచించి తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్న వారూ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై అనవసరంగా ఇలా స్పందించారు. అలా అనుకున్నారు.. అనే ప్రతికూల ఆలోచనలు తగ్గించుకోవడం మేలు. ఎవరు.. ఏ విధంగా స్పందించినా సరదాగా, తేలిగ్గా తీసుకోవాలనేది మానసిక వైద్యుల సూచన. 


గ్రూప్‌ అడ్మిన్లూ.. బాధ్యత గుర్తెరగాలి

  • తమ సందేశాలతో ఇతరులెవరైనా నొచ్చుకుంటే నేరుగా ఫోన్‌ చేసి అసలు ఉద్దేశాలను చెప్పడాన్నే ‘సామాజిక’ మర్యాదగా భావించాలి. అవసరమైతే క్షమాపణలు చెప్పి అవతలి వ్యక్తిని సమాధానపరిచే హుందాతనం నేటి ‘సామాజిక మాధ్యమ’ వినియోగదారులకు ఎంతో అవసరం. అలాంటప్పుడే స్నేహ బంధాలు, పరిచయాలు పటిష్ఠంగా ఉంటాయి. 
  • వివాదాస్పదంగా వ్యవహరించే సభ్యులను గ్రూప్‌ అడ్మిన్లు హెచ్చరించాలి. నియమాలు అతిక్రమిస్తే వారిని తొలగించాలి. 
  • ప్రస్తుత సమాజంలో భావోద్వేగాలపై నియంత్రణ అవతలి వారిని సానుకూల ధోరణితో చూసే దృష్టి కోణం నిత్యం ప్రశాంతతను కలిగిస్తుంది.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని