logo

మార్పులకు శ్రీకారం

నిరంతర పర్యవేక్షణ.. వసతుల కల్పనపై శ్రద్ధ.. విధుల నిర్వహణలో ఉద్యోగులకు అవగాహన కల్పించే పర్వాలు అమలైతే భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది.

Updated : 14 Jun 2024 05:48 IST

యాదాద్రీశుడి క్షేత్రంలో భక్తులకు అనుగుణంగా ఏర్పాట్లు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: నిరంతర పర్యవేక్షణ.. వసతుల కల్పనపై శ్రద్ధ.. విధుల నిర్వహణలో ఉద్యోగులకు అవగాహన కల్పించే పర్వాలు అమలైతే భక్తులకు ఎంతో మేలు జరుగుతుంది. యాదాద్రి క్షేత్రంలో మార్పులు తెచ్చేందుకు ఆలయ ఈవో భాస్కర్‌రావు నిత్యం భక్తులను కలుస్తూ సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఆలయ సమస్యలపై నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

కట్టూబొట్టుతో షురూ

మన సంస్కృతికి దర్పణం, మార్గదర్శకమైన దేవాలయంలో సంప్రదాయ విధానాల అమలుకు పంచనారసింహుల మహాదివ్య క్షేత్రం తెరతీసింది. కట్టూ, బొట్టుతో ఆలయాలకు రావాలన్న నిబంధనల అమలు చర్యలు దశాబ్దాలుగా అటకెక్కాయి. 90 రోజుల క్రితం రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎ.భాస్కర్‌రావు ఈ ఆలయ ఈవోగా బాధ్యతలు చేపట్టి సమస్యల పరిష్కారం, ఆచారాల అమలు పట్ల ప్రత్యేక దృష్టి సారించారు. సంప్రదాయ వస్త్రధారణతో భక్తులు దైవారాధనల్లో పాల్గొనే విధానానికి ఈ క్షేత్ర పాలకుడైన హనుమజ్జయంతి రోజే శ్రీకారం చుట్టారు.

ప్లాస్టిక్‌ నిషేధం

పర్యావరణానికి ముప్పు కలగకుండా, ప్లాస్టిక్‌ వినియోగాన్ని నిషేధిస్తూ, అమలుకు చర్యలు చేపట్టారు. ఎప్పటికపుప్పడు భక్తులకు అందించే సేవల మెరుగు కోసం విభాగాల ఇన్‌ఛార్జిలతో సమీక్షలు చేపడుతున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌ల ద్వారా ఆలయంలో కొనసాగే నిత్య కైంకర్యాల ప్రదర్శన కల్పించారు. ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవల బుకింగ్, శివాలయ ప్రాంగణంలో ప్రసాదాల విక్రయ టికెట్‌ కౌంటర్ల ఏర్పాట్లు, కొండపైన బస్‌స్టేషన్‌లో రద్దీ రోజుల్లో ప్రసాదాల విక్రయాలు, సమాచార కేంద్రం, దర్శనం కాంప్లెక్స్‌లో ఏసీ వసతి మెరుగు, ఉచిత బస్సులపై ప్రత్యేక దృష్టి, మొబైల్‌ వద్దు-వాకీ టాకీలే ముద్దు అంటూ, మొబైల్‌ ఫోన్లను ఆలయంలోకి నిషేధించారు. వాటికి బదులు విభాగాల ఇన్‌ఛార్జిలకు వాకీటాకీలను సమకూర్చారు. నిరంతర పర్యవేక్షణ కొనసాగింపు, ప్రసాదాల తయారీలో నాణ్యత, మహిళా భక్తులకు మరుగుదొడ్లు, స్థానికులకు శని, మంగళవారాల్లో దర్శనం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం మొక్కు తీర్చుకునే భక్తుల కోసం సదరు మండపంలో కూలర్ల ఏర్పాటు, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొండపైన సాంస్కృతిక కార్యక్రమాల పునరుద్ధరణ, తాత్కాలిక సంగీత భవనం ఏర్పాటు, స్వామి చెంత నిద్ర మొక్కును తీర్చుకునేందుకు ప్రత్యేక డార్మిటరీ హాల్‌ ఏర్పాటు జరిగింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు