logo

పారాహుషార్‌..!

పుట్టుకతోనే పోలియో మహమ్మారి సోకింది. అయినా తన సంకల్పాన్ని గెలిపించుకున్నాడీ యువకుడు. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కించుకున్నాడు.

Updated : 14 Jun 2024 05:48 IST

మేళ్లచెరువు, హుజూర్‌నగర్, న్యూస్‌టుడే: పుట్టుకతోనే పోలియో మహమ్మారి సోకింది. అయినా తన సంకల్పాన్ని గెలిపించుకున్నాడీ యువకుడు. జాతీయ స్థాయిలోనూ గుర్తింపు దక్కించుకున్నాడు. చిన్నతనం నుంచి చదువుల్లో రాణిస్తూనే.. యుక్త వయసొచ్చేసరికి తనకిష్టమైన ఆటల్లో ప్రతిభ చాటాడు. నేటి పారా వాలీబాల్‌ భారత జట్టులో ఒకడిగా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. అతడే మేళ్లచెరువు మండలం కందిబండ వాసి, రాగుల మంగయ్య, వెంకమ్మల కుమారుడు రాగుల నరేష్‌ యాదవ్‌. 

పతకాల సాధనలో..

దివ్యాంగుడినని నరేష్‌ ఏనాడూ కుంగిపోలేదు. చిన్నతనం నుంచే చదువుల్లో తోటి విద్యార్థులతో పోటీ పడుతూనే ఆటలపైనా ఆసక్తి కనబరిచేవారు. ఇంటర్, ఇంజినీరింగ్‌ చదివే రోజుల్లో వచ్చిన అవకాశాల్ని వదులుకోలేదు. లక్ష్యంపైనే గురిపెట్టారు. అథ్లెటిక్స్‌లో పాల్గొంటూనే.. తనకిష్టమైన పారా వాలీబాల్‌ పోటీల్లో సత్తాచాటి భారత జట్టులో స్థానం సంపాదించారు. అలా 2014లో బెంగళూరులో జరిగిన 5వ జాతీయ స్థాయి స్టాండింగ్‌ వాలీబాల్‌ పోటీల్లో పాల్గొన్నారు. జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలకపాత్ర వహించారు.

  • 2015లో కొయంబత్తూరులో జరిగిన 5వ జాతీయ స్థాయి సిట్టింగ్‌ వాలీబాల్‌ పోటీల్లో తెలంగాణ రాష్ట్ర జట్టుకు మళ్లీ కాంస్యం అందించారు.
  • 2015, 2016, 2017 సంవత్సరాల్లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వరసగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ స్పోర్ట్స్‌మెన్‌ అవార్డులను నాటి మంత్రుల చేతులమీదుగా పొందారు.
  • 2017లో జాతీయ స్థాయిలో జయపురలో సీనియర్‌ సిట్టింగ్‌ పారా వాలీబాల్‌ పోటీల్లో సత్తా చాటారు.
  • శ్రీలంక, థాయ్‌లాండ్‌ తదితర దేశాల జట్లపై జట్టు ఆధిపత్యం చాటడంలో ముఖ్య భూమిక ఆయనదే.
  • తాజాగా 2024లోనూ చైనాలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పారా బీచ్‌ వాలీబాల్‌ పోటీల్లో భారత జట్టు తరఫున నరేష్‌ ఆడారు. ఈ పోటీల్లో జట్టు ద్వితీయ స్థానం సాధించింది. 

లక్ష్యం ముందు ఓడిన వైకల్యం 

- నరేష్‌ యాదవ్‌ 

లక్ష్యం ముందు వైకల్యం దిగతుడుపేనన్నది నా స్వానుభవం. చిన్నతనంలో రాని అవకాశాలను పెద్దయ్యాక అందుకోవడం నా అదృష్టం. ఇందులో నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, దాతల సహకారం మరువలేనిది. నా ప్రతిభతో టెలికాం శాఖలో ఉద్యోగం లభించింది. అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సాధించాలన్న తపనతోనే ఆట నేర్చుకున్నా. ఆడుతున్నా. ప్రశంసలందుకుంటున్నా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు