logo

రుధిర దానం.. సేవా సుగంధం

సాంకేతికత ఎంత పెరిగినా కృత్రిమంగా తయారు చేయలేని వాటిల్లో రక్తం ఒకటి. ఇది మనిషి నుంచి మరొకరికి అందించాల్సిందే.

Updated : 14 Jun 2024 02:37 IST

నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవం
మోత్కూరు, న్యూస్‌టుడే

సాంకేతికత ఎంత పెరిగినా కృత్రిమంగా తయారు చేయలేని వాటిల్లో రక్తం ఒకటి. ఇది మనిషి నుంచి మరొకరికి అందించాల్సిందే. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు.. శస్త్ర చికిత్సలు, వ్యాధుల్లో రక్తహీనతతో సరైన సమయానికి రుధిర నిల్వలు అందుబాటులో లేక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రక్తదానం అంటే ప్రాణదానంతో సమానం.. ఆపదలో ఆదుకోవడానికి అయినవారే అక్కర్లేదు.. మానవత్వం ఉన్నవారు ఎవరైనా చాలు.. చాలా మంది యువత అవగాహన లేమి, ఇతర అపోహల కారణంగా ముందుకు రావడం లేదు. అందరూ ముందుకొస్తే రక్తం దొరక్కా ఎవరి ప్రాణం పోదు. నేడు ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

57 సార్లు రక్తదానం చేశా.. 
- జె.సుబ్రహ్మణ్యశర్మ, విశ్రాంత ఉపాధ్యాయుడు, బుజిలాపురం

మూడు నెలలకోసారి ఎక్కడ రక్తదాన శిబిరం నిర్వహించినా వెళ్లి ఇస్తాను. వివిధ శిబిరాల్లో ఇప్పటి వరకు 57 సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశా. 2021లో గవర్నర్‌ నుంచి అవార్డు కూడా అందుకున్నా. తోటివారికి అవగాహన కల్పిస్తూ.. మిత్రులను వెంట తీసుకెళ్లి రక్తదానం చేయిస్తున్నా.


తోటి ఉపాధ్యాయులను చైతన్యం చేస్తూ..
- టి.ఉప్పలయ్య, ఉపాధ్యాయుడు, టీఎస్‌యూటీఎఫ్‌ నాయకుడు, ఆత్మకూర్‌(ఎం)

క్తదానాన్ని ప్రోత్సహించాలన్న తలంపుతో తోటి ఉపాధ్యాయులను చైతన్యం చేస్తూ పదేళ్లుగా తమ టీఎస్‌యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటి వరకు నేను 33 సార్లు రక్తదానం చేశా. తోటి ఉపాధ్యాయులతో చేయిస్తున్నా. 


ప్రాణదానం చేశాననిపిస్తోంది
- మహ్మద్‌ అలీ, విశ్రాంత సీఆర్పీఎఫ్, మోత్కూరు
ఆర్మీలో ఉద్యోగం చేసేటప్పుడు ఏడాదికి మూడు సార్లు రక్తదానం చేసేవాడిని. ఉద్యోగ విరమణ చేసి 11 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి విధిగా మూడు నెలలకోసారి ఎక్కడ శిబిరం జరిగినా స్వచ్ఛందంగా కుటుంబ సభ్యులతో వెళ్లి రక్తమిస్తున్నా. ఇప్పటికీ 56 సార్లు చేశా.. ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేశానన్న సంతృప్తి కలుగుతోంది. 


సమాచారమిస్తే చాలు
- ఎండీ.అహ్మద్, మోత్కూరు

ఆపదలో ఉన్నవారిని రక్షించాలన్న ఉద్దేశంతో నేను, నా భార్య మహ్మద్‌ సల్మా నజియా రక్తదానం చేయడం అలవాటుగా మార్చుకున్నాం. ఎక్కడ శిబిరం నిర్వహించినా.. సమాచారం తెలిస్తే ఇద్దరం వెళ్లి రక్తదానం చేస్తాం. ఇప్పటి వరకు నేను 34 సార్లు, నా భార్య 16 సార్లు రక్తదానం చేశాం. గతేడాది గవర్నర్‌ చేతులమీదుగా అవార్డు అందుకున్నా.


పల్లెవించిన స్ఫూర్తి

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత సైతం రక్తదానంలో ముందుంటున్నారు. వారు జీవనోపాధి రీత్యా వివిధ వృత్తుల్లో కొనసాగుతూనే.. ఆపదలో ఉన్నామని ఫోన్‌ చేసిన వారికి రక్తదానం చేస్తున్నారు. నేడు ‘ప్రపంచ రక్తదాతల దినోత్సవం’ సందర్భంగా గ్రామీణ రక్తదాతలను ‘న్యూస్‌టుడే’ పలకరించింది.

స్నేహితుడి తల్లి మరణం చూసి..
-షేక్‌ నయీమ్, బీమారం, కేతేపల్లి 

ప్రస్తుతం పీజీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాను. ఇంటర్‌ చదివే రోజుల్లో నా స్నేహితుడి తల్లి రక్తం దొరక్కా మరణించడం నన్ను ఎంతో కలచివేసింది. డిగ్రీలో ఎన్‌సీసీలో చేరడం వల్ల ఇతరులకు సాయం చేయడం అలవాటయ్యింది. నాది బీ-పాజిటివ్‌ గ్రూపు. 2017 నుంచి రక్తదానం చేస్తున్నాను. ఇప్పటి వరకు నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్‌ వంటి ప్రాంతాల్లో 24 సార్లు రక్తదానం చేశాను.


అత్యవసర సమయాల్లో అనేక మందికి..
- దోమలపల్లి గోపి, నీర్నెంల, రామన్నపేట

2010 నుంచి ఇప్పటి వరకు 48 సార్లు రక్తదానం చేశాను. నాది బీ-నెగిటివ్‌ గ్రూపు రక్తం. హైదరాబాద్, భువనగిరి, నల్గొండ వంటి ప్రాంతాల్లో అనేక మందికి అత్యవసర సమయంలో రక్తదానం చేశాను. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో సైతం రక్తదానం చేశాను. మా స్నేహితులతో కలిసి సామాజిక మాధ్యమాల్లో గ్రూపులు ఏర్పాటు చేసి దాతల ఫోన్‌ నంబర్లు అందుబాటులో ఉంచుతున్నాం. 


ఇతరులను అడగడం ఎందుకని...
- రామోజు శ్రీకాంత్, బ్రాహ్మణవెల్లెంల, నార్కట్‌పల్లి 

నేను ఓ ఔషధ దుకాణంలో పని చేస్తాను. ఓ సమయంలో మా నాన్నకు రక్తం అవసరమై ఎంతో మందిని బతిమిలాడాను. అప్పుడు నా వయసు 20 ఏళ్లు. ఇతరులను అడగడం ఎందుకు నేనే రక్తం ఇస్తే సరిపోతుంది కదా అని ఏడాదిన్నర కాలంలో పది సార్లు ఇచ్చాను. నాది ఓ పాజిటివ్‌ గ్రూపు రక్తం. ఇప్పటి వరకు 34 సార్లు రక్తదానం చేశాను. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని