logo

ఆడబిడ్డలపై ఆగని వివక్ష

ఉమ్మడి జిల్లాలో బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం క్రమంగా పెరుగుతోంది. ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఎంసీహెచ్‌ (మదర్, చైల్డ్‌ హెల్త్‌) కిట్ల పంపిణీ ద్వారా సేకరించిన లెక్కల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా బాలబాలికల నిష్పత్తి సమానంగా లేకపోవడం గమనార్హం.

Published : 14 Jun 2024 02:25 IST

తగ్గుతున్న బాలికల సంఖ్య

నల్గొండ అర్బన్, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లాలో బాలబాలికల నిష్పత్తిలో వ్యత్యాసం క్రమంగా పెరుగుతోంది. ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ఎంసీహెచ్‌ (మదర్, చైల్డ్‌ హెల్త్‌) కిట్ల పంపిణీ ద్వారా సేకరించిన లెక్కల ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో ఎక్కడా బాలబాలికల నిష్పత్తి సమానంగా లేకపోవడం గమనార్హం.

గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ

ఆడపిల్లల రక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు, చట్టాలను అమలు చేస్తున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా కొంతమంది విద్యావంతులే స్కానింగ్‌ సెంటర్ల వద్ద పుట్టబోయేది ఎవరో తెలుసుకొని ఆడశిశువు అయితే గర్భంలోనే చిదిమేస్తున్నారు. దీంతో బాల, బాలికల నిష్పత్తిలో పెద్ద ఎత్తున తేడా వస్తోంది. కొన్ని ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ రూ.50-60 వేల వరకు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, ఖమ్మం, జగ్గయ్యపేట ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడి వారితో కలిసి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసుకుని చిన్న సూట్‌కేసు సామర్థ్యం ఉన్న మిషన్లను తెప్పించి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

తనిఖీల్లో లోపాలు..

లింగనిర్ధారణ చేస్తున్నట్లు ఇటీవల పలుచోట్ల బయట పడుతున్నా తనిఖీలు చేయాల్సిన అధికారులు రాజకీయ ఒత్తిడి కారణంగా ఉదాసీనత చూపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుత వైద్య, ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం నల్గొండ జిల్లాలో 88, సూర్యాపేటలో 51, యాదాద్రి భువనగిరిలో 35 స్కానింగ్‌ సెంటర్లు ఉన్నాయి. వంద మందికి పైగా స్త్ర్రీ వైద్య నిపుణులు పనిచేస్తున్నారు. 

చట్టాలు ఉన్నా ఉదాసీనం..

లింగనిర్ధారణ పరీక్షలు చేసినవారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా ఆచరణలో కనిపించడం లేదు. గతంలో పట్టుబడిన వారే మళ్లీ వేరే పేర్లతో స్కానింగ్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. వీటిపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేకంగా మార్గదర్శకాలను సిద్ధం చేసింది. పోలీసుల సహకారంతో పీసీ, పీఎన్‌డీటీ చట్టం పటిష్ఠంగా ఉండేలా చూడనుంది.


ముమ్మరంగా తనిఖీలు

-డా.కల్యాణ్‌ చక్రవర్తి, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో, నల్గొండ

జిల్లాలో స్కానింగ్‌ సెంటర్లు, ప్రసవాలు నిర్వహించే ఆసుపత్రుల్లో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నాం. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలతో నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేసేందుకు కసరత్తులు చేస్తున్నాం. మధ్యవర్తులు, పీఆర్‌వోలు లింగనిర్ధారణ పరీక్షలకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి సమాచారం తెలిసినా నేరుగా కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. స్థానిక పోలీస్‌ స్టేషన్లకు సమాచారం ఇచ్చినా చర్యలు తీసుకుంటారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని