logo

నాలుగేళ్ల కష్టం.. 30 ఏళ్లపాటు ప్రతిఫలం

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంటల సాగుకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. పంట చేతికందే సమయంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురుస్తుండటంతో ఆశలు ఆవిరవుతున్నాయి.

Updated : 14 Jun 2024 05:50 IST

ప్రభుత్వ రాయితీతో పెరుగుతున్న ఆయిల్‌పామ్‌ సాగు
రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే

మ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంటల సాగుకు రైతన్నలు నానా తంటాలు పడుతున్నారు. పంట చేతికందే సమయంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన కురుస్తుండటంతో ఆశలు ఆవిరవుతున్నాయి. అడవిపందులు, నెమళ్లు, కోతులు, కొండముచ్చులు, తదితర జంతువులను నుంచి పైరును రక్షించుకోవడానికి కర్షకులు పగలు, రాత్రి కాపలా కాయాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు గత ప్రభుత్వం సమృద్ధిగా నీటి వసతి కలిగిన రైతులకు రాయితీతో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించడానికి ముందుకు తెచ్చింది. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 4,215 మంది రైతులు 16,034 ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేస్తున్నారు.

అంతర పంటలతో అదనపు ఆదాయం

గత నాలుగేళ్ల క్రితం కేవలం పదుల ఎకరాల్లోనే సాగైన ఆయిల్‌పామ్‌ తోటలు ప్రస్తుతం వేల ఎకరాల విస్తీర్ణానికి చేరుకున్నాయి. ఇందుకు ఉద్యాన శాఖ అధికారులు తగిన ప్రచారంతోపాటు రైతులకు అవగాహన కల్పించడటమే కారణం. ఒక్క యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 2021-22లో 1,428 ఎకరాలు, 22-23లో 1,903 ఎకరాల్లో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 300 ఎకరాలపైగా ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టినట్లు సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. మొత్తంగా సుమారు 900 మంది రైతులు 3,631 ఎకరాల్లో ఈ తోటల సాగు చేపట్టడం విశేషం. వీటిల్లో అంతర పంటగా బొప్పాయి, దోస, అరటి, బంతి, ఇతర కూరగాయలు పండిస్తూ ఆర్థికంగా తమ అవసరాలు తీర్చుకుంటున్నారు.

పెరగనున్న సాగు.. 

ఆయిల్‌పామ్‌ సాగు మొదలుపెట్టిన నాలుగేళ్ల తరువాత ఎకరాకు 15 నుంచి 20 టన్నుల దిగుబడి వస్తుంది. అప్పటి వరకు వేచిచూడకుండా కొందరు రైతులు సంప్రదాయ పంటలవైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెటింగ్‌ సహా దిగుబడికి సంబంధించి లాభదాయకమైన విధానాలపై మరింత అవగాహన కల్పిస్తే సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో సుమారు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్‌ కర్మాగారం వచ్చే సంవత్సరం పూర్తికానుంది. ఆ కర్మాగారం అందుబాటులోకి వస్తే పొరుగు జిల్లాలైన యాదాద్రి భువనగిరి, జనగామ, నల్గొండల్లో ఆయిల్‌పామ్‌ సాగు వైపు ఎక్కువ మంది రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది.


ఉపయోగాలు ఇవీ.. 

యిల్‌పామ్‌ మొక్క నాటి.. నాలుగేళ్ల సంరక్షణ తర్వాత నుంచి కాపు మొదలై 30 సంవత్సరాల వరకు నిరంతరాయంగా దిగుబడి ఉంటుంది. ఇతర పంటలతో పోలిస్తే తెగుళ్లు, చీడపీడల బెడద కొంతవరకే ఉంటుంది. వడగళ్ల వాన, తుపాను తదితర ప్రకృతి వైపరిత్యాలను సమర్థంగా ఎదుర్కొంటుంది. కోతులు, అడవిపందుల బెడద అసలే ఉండదు. ముఖ్యంగా కూలీల అవసరం చాలా తక్కువగా ఉంటుంది. ఇతర పంటల మాదిరిగా ధాన్యాన్ని ఆరబెట్టడం, తూర్పార బట్టడం ఉండకపోవగా, గెలలు కోసిన వెంటనే నేరుగా ఫ్యాక్టరీకే పంపవచ్చు. మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా కూరగాయలు, వాణిజ్య పంటలు పండించి అదనపు ఆదాయం పొందవచ్చు. 


రైతులకు బహుళ ప్రయోజనకరం 

-ప్రవీణ్‌కుమార్, ఆయిల్‌ఫెడ్‌ జిల్లా సమన్వయకర్త, యాదాద్రి 

తొంభై శాతం రాయితీ లభించే ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులు బహుళ ప్రయోజనం పొందవచ్చు. ఇదివరకే నాటుకున్న మొక్కలకు ఈ వర్షాకాలం సీజన్‌లో గొంగళి పురుగు, ఆకుతేలు సోకే అవకాశం ఉండనున్నందున ముందస్తుగా రైతులు క్లోరిపైరిపాస్‌ 1.5 ఎంఎల్‌ లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఆయిల్‌పామ్‌ మొక్కలకు ఏడాది అనంతరం పుష్పగుచ్ఛాలు వస్తాయి. వాటిని తక్షణమే తొలగించాలి. కొత్తగా సాగు, ఇతర సందేహాలకు రైతులు 99854 16417కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని