logo

ఊరచెర్వు.. ఆక్రమణలకు నెలవు

సుమారు 800 ఎకరాలకు సాగు నీరందించే కొండ్రపోల్‌ ఊరచెర్వు ఆక్రమణకు గురైంది. పలుమార్లు హద్దులు గుర్తింపునకు అధికారులు గతంలో యత్నించినప్పటికీ ఆక్రమణదారుల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. 

Published : 14 Jun 2024 02:30 IST

50 ఎకరాలకు పైగా కబ్జా

దామరచర్ల, న్యూస్‌టుడే: సుమారు 800 ఎకరాలకు సాగు నీరందించే కొండ్రపోల్‌ ఊరచెర్వు ఆక్రమణకు గురైంది. పలుమార్లు హద్దులు గుర్తింపునకు అధికారులు గతంలో యత్నించినప్పటికీ ఆక్రమణదారుల ఒత్తిళ్లకు తలొగ్గక తప్పలేదు. 

శిఖంలో పంటల సాగు

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలో కొండ్రపోల్‌ పైభాగాన ఊరచెర్వు ఉంది. 177.30 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ చెరువుకు వర్షాకాలం రాగానే 20 కిలోమీటర్ల పరిధిలోగల పరివాహక ప్రాంతం నుంచి వరద వస్తుంది. సాగర్‌ వృథా జలాలు చెరువులోకి వస్తుండటంతో రైతులకు వరప్రదాయినిగా మారింది. చెరువు ప్రధాన తూము, అలుగు ద్వారా 800 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ చెరువు ప్రస్తుతం 50 ఎకరాలు పైగా ఆక్రమణకు గురైనట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పైభాగాన శిఖం భూములకు ఆనుకుని చర్లతండా, పర్తునాయక్‌తండాకు చెందిన రైతుల భూములున్నాయి. వీరు శిఖం భూమిని తమ భూములుగా పేర్కొంటూ వరి పొలాలు సాగుచేస్తున్నారు. కొందరు చెరువులో బావులు, బోర్లు వేసి నీటిని విద్యుత్తు మోటార్లతో పైపులైను ద్వారా తరలిస్తున్నారు. 

ఒత్తిళ్లదే పైచేయి

మిషన్‌ కాకతీయ పథకంలో ఈ చెరువును మినీ ట్యాంక్‌బండుగా మార్చేందుకు సుమారు రూ.1.15 కోట్లు మంజూరు కాగా పనులు అసంపూర్తిగా ఉన్నాయి. చెర్వు ముందు ప్రాంతంలో పూడిక తీశారు. శిఖం వద్ద తవ్వలేదు. పనుల్లో భాగంగా చెరువు అలుగును రెండు అడుగులు కిందికి నిర్మాణం చేసినట్లు ఆరోపణలున్నాయి. అలుగు ఎత్తుగా ఉన్నట్లయితే శిఖం భూములు నీట మునిగి సాగుకు యోగ్యంగా ఉండవని అధికారులు, గుత్తేదారుపై ఒత్తిడి చేసి తగ్గించినట్లు తెలుస్తోంది. ఫలితంగా చెరువు నీరు తొందరగా ఖాళీ అవుతున్నట్లు పలువురు రైతులు పేర్కొంటున్నారు.


హద్దులు విస్మరించిన అధికారులు

రాష్ట్రం ఏర్పడిన తదుపరి నీటిపారుదల, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆయా చెరువు శిఖం భూములపై హద్దులు గుర్తించి సిమెంటు దిమ్మెలు నిర్మించారు. కానీ, ఊరచెర్వుకు నేటి వరకు హద్దులు గుర్తించకపోవడం గమనార్హం. పలుమార్లు సంబంధిత అధికారులు ప్రయత్నాలు చేయగా ఆక్రమణదారుల ఒత్తిళ్ల ఫలితంగా పనులు ముందుకు సాగలేదు. ఇటీవల కొండ్రపోల్‌ గ్రామస్థులు మూకుమ్మడిగా జిల్లా పాలనాధికారిని కలిసి చెరువు ఆక్రమణపై ఫిర్యాదు చేసి పరిరక్షించాల్సిందిగా విన్నవించుకున్నారు. 


ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం

-జనార్దన్, డీఈ, నీటిపారుదల శాఖ

చెరువు ఆక్రమణకు గురైనట్లు మా దృష్టికి వచ్చింది. రెవెన్యూ అధికారులతో కలిసి సంయుక్త సర్వే చేసి, హద్దురాళ్లను ఏర్పాటు చేస్తాం. శిఖం భూముల ఆక్రమణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని