logo

దారి కాచి.. దోపిడీ

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిలో దోపిడీలు, హత్యలు, దొంగతనాలు నిత్యకృత్యమవుతున్నాయి.

Published : 14 Jun 2024 02:35 IST

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిపై కొరవడిన నిఘా
పెరిగిన హత్యలు, దొంగతనాలు
ఈనాడు, నల్గొండ

నెల 9 తెల్లవారుజామున ఏపీ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న తూర్పుగోదావరి జిల్లావాసులు ప్రయాణంలో అలసిపోయి చిట్యాల మండలం పెద్దకాపర్తి వద్ద సర్వీసు రోడ్డులో కారు ఆపారు. అందులో నిద్రిస్తున్న వారిపై ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి దాడి చేశారు. ప్రయాణికుల మెడ, చేతిలోంచి సుమారు 10 తులాల మేర బంగారాన్ని అపహరించారు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.


తంలో సైబరాబాద్‌ పోలీసు పరిధి చౌటుప్పల్‌లోనూ ఇలాంటివి రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి.

హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిలో దోపిడీలు, హత్యలు, దొంగతనాలు నిత్యకృత్యమవుతున్నాయి. గత నెలన్నర రోజులుగా పలు దోపిడీలు, దొంగతనాలు ఎక్కువ కావడంతో రాత్రి పూట ఆ దారిలో ప్రయాణించే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. పార్కింగ్‌ చేసిన వాహనాల్లోంచి డీజిల్‌ దొంగతనాలు మొదలు... రహదారిపై వెళ్తున్న వాహనాలను ఆపి దారి దోపిడీలకు కొంత మంది దుండగులు పాల్పడుతున్నారు. పోలీసులు మాత్రం నేరస్థులు స్థానికులు కాదని.. దొంగతనాల్లో ఆరితేరిన వారే ఇతర ప్రాంతాల నుంచి వచ్చినట్లు నిర్ణయానికి వచ్చారు. పలు నేరాలతోపాటు ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు, వారు ఉపయోగించిన బైకులకు ఒకే పోలిక ఉంటోంది. దీంతో వారు ఎక్కడి నుంచి వచ్చారనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని ఆధారాలు సేకరించినా ఇప్పటి వరకు నిందితులను పట్టుకోలేదు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారి పనేనని స్థూలంగా అంచనా వేసిన పోలీసులు ఘటనల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.


పెట్రోలింగ్‌పై చిన్నచూపు

జాతీయ రహదారిపై ఉమ్మడి జిల్లా పరిధి ప్రారంభమయ్యే చౌటుప్పల్‌ మండలం మల్కాపురం నుంచి కోదాడ మండలం కొమరబండ వరకు పోలీసులు రాత్రి పూట నిత్యం పెట్రోలింగ్‌ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా చౌటుప్పల్, కట్టంగూరు, నార్కట్‌పల్లి, కేతేపల్లి పరిధిలోనే ఇటీవల నేరాలు జరగడం గమనార్హం. జాతీయ రహదారిపై ఉన్న పోలీసుస్టేషన్ల సిబ్బంది రాత్రి పూట పెట్రోలింగ్‌ నిర్వహించాల్సి ఉన్నా కొంత మంది విధులను నిర్లక్ష్యం చేస్తుండటంతో ఈ నేరాలు జరుగుతున్నాయన్న వాదన వినిపిస్తోంది. గత రెండు నెలల నుంచి పోలీసులు ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉండటంతో కొంత పెట్రోలింగ్‌పైనా నిర్లక్ష్యం నెలకొంది. దీంతో దోపిడీ ముఠా జులువిదిల్చి గత కొంత కాలంగా ఎక్కువగా నేరాలు చేస్తోంది. 


నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద లారీని కొంత మంది ఆపారు. డ్రైవర్‌ను తాళ్లతో కట్టేసి అతన్ని విపరీతంగా కొట్టి సుమారు రూ.22 వేల నగదు గుంజుకున్నారు. తెల్లవారుజామున కట్లను తానే విప్పేసుకున్న లారీ డ్రైవర్‌ నార్కట్ప్‌ల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇంకా ఆ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.


ఏపీ నుంచి సరకును హైదరాబాద్‌లో దిగుమతి చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో అలసిపోయి కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం వద్ద పార్కింగ్‌ స్థలంలో ఆపిన మినీ డీసీఎం డ్రైవర్‌ గత నెల 18న హత్యకు గురయ్యారు. కొందరు వ్యక్తులు ఆయన కాళ్లను కట్టేసి, గొంతు నులిమి దారుణంగా హత్య చేసి అవతలి వైపు రహదారి పక్కన పడేశారు. ఇప్పటి వరకు నిందితులను గుర్తించలేదు. 


స్తంభిస్తున్న ట్రాఫిక్‌

గుత్తేదారు కంపెనీ జీఎంఆర్‌ సైతం నిత్యం రాత్రి పూట జాతీయ రహదారిపై పెట్రోలింగ్‌ చేస్తూ.. ఏమైనా ప్రమాదాలు జరిగితే వెంటనే ట్రాఫిక్‌ సమస్య లేకుండా క్లియర్‌ చేయాల్సి ఉంటుంది. కానీ, ప్రమాదం జరిగినప్పుడు సుమారు మూడు నుంచి నాలుగు గంటల పాటు ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. దీనిపై గతంలోనూ పలువురు ప్రయాణికులు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో పాటు ట్రాఫిక్‌ పోలీసులకూ ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. పోలీసులు పెట్రోలింగ్‌ పెంచడంతో పాటు జీఎంఆర్‌ సంస్థ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తేనే నేరాలను నియంత్రించే అవకాశం ఉంటుంది.


పెట్రోలింగ్‌ పెంచాం

- చందనా దీప్తి, ఎస్పీ, నల్గొండ 

జాతీయ రహదారిపై ఇటీవల జరిగిన నేరాలు బయటి ముఠా పనులుగా గుర్తించాం. క్లూస్‌ టీం ఆధారంగా వివరాలు సేకరించాం. త్వరలోనే వారిని పట్టుకుంటాం. రాత్రి పూట జాతీయ రహదారిపైనా పెట్రోలింగ్‌ పెంచాం. నాలుగైదు రోజుల్లో అన్ని వివరాలు బయటకు వస్తాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని