logo

వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు

వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వై.పాపారావు తెలిపారు.

Published : 17 Jun 2024 05:40 IST

డాక్టర్‌ పాపారావు, డీఎంహెచ్‌వో 

వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టామని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ వై.పాపారావు తెలిపారు. దోమలతో డెంగీ, గన్యా, మలేరియా, బోదకాలు(ఫైలేరియా) వ్యాధులు, కలుషిత నీరు కారణంగా డయేరియా, టైఫాయిడ్, ప్లూ వ్యాధులు సోకుతాయని పేర్కొన్నారు. ప్రజలు రోగాల బారిన పడకుండా కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీజనల్‌ వ్యాధులపై జిల్లా వైద్యఆరోగ్యశాఖ, ఇతర శాఖల సమన్వయంతో చేపట్టిన చర్యల గురించి ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ఆయన వెల్లడించారు.

భువనగిరిగంజ్, న్యూస్‌టుడే 

మూసీ పరివాహక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి

జిల్లా మూసీ పరివాహక ప్రాంతాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రజలను అప్రమత్తంగా ఉంచేందుకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నాం. నీరు కలుషితం కాకుండా కాచిన నీరు తాగేలా సూచనలు చేస్తున్నాం. దోమల నివారణకు దశల వారీగా ఫాగింగ్‌ చేస్తున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చేలా సంబంధిత శాఖలతో సమన్వయం చేస్తున్నాం. గతంలో వ్యాధులు ఎక్కువగా ప్రబలిన గ్రామాలను వైద్యాధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసేలా ఆదేశించాం. అవసరమైన చోట ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేస్తాం.

సమన్వయ సమావేశంతో ముందుకు..

సీజనల్‌ వ్యాధులు సాధారణంగా వేసవి ముగిసిన తర్వాత వానాలు మొదలు కావడంతో ప్రారంభమవుతాయి. జిల్లా వైద్యఆరోగ్యశాఖతో పాటు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులతో సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యల గురించి అప్రమత్తం చేశాం. ప్రతి గ్రామంలో పంచాయతీ, రెవెన్యూ, ఆరోగ్య సిబ్బందితో కలిసి బృందాన్ని ఏర్పాటు చేశాం. నీరు కలుషితంగా కాకుండా లీకేజీలను నివారించడం, దోమలు వృద్ధి చెందకుండా ఫాగింగ్, నీటి గుంతలను పూడ్చటం, డ్రైనేజీ సమస్యలు లేకుండా వెంటనే చేయాలని ఆదేశించాం. నీటి ట్యాంకుల్లో బ్లీచింగ్, క్లోరినేషన్‌ చేసే విధంగా సూచించాం. వ్యాధుల బారిన పడ్డవారికి అన్ని పీహెచ్‌సీలలో ఔషధాలు, రోగనిర్ధారణకు కావాల్సిన కిట్లు అందుబాటులో ఉంచాం. ప్రతి కేంద్రంలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలు ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచాం. 

సొంత వైద్యం వద్దు

కలుషిత నీరు, ఆహారం వల్ల డయేరియా, టైఫాయిడ్‌ వంటి వ్యాధులు సోకుతాయి. వీటి బారిన పడ్డవారికి జ్వరం, వాంతులు, విరేచనాలు ఉంటాయి. కీటక జనిత వ్యాధులు డెంగీ, గన్యా, మలేరియాతో ఎక్కువగా జ్వరం రావడం లక్షణాలు తీవ్రంగా ఉంటాయి. ఏమాత్రం జ్వరం లక్షణాలు, నీరసంగా ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న సమయంలో వైద్యులు సూచించిన ఔషధాలతో తక్కువ సమయంలోనే పూర్తిగా కోలుకునేందుకు ఆస్కారం ఉంటుంది. సొంతంగా మాత్రలు వేసుకుని వ్యాధి ముదిరేంత వరకు తాత్సారం చేయొద్దు.

వసతి గృహాల్లో వైద్యశిబిరాలు

విద్యార్థులు సమూహంగా ఉండే వసతి గృహాలు, గురుకుల పాఠశాల సీజనల్‌ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అక్కడ రోగాలకు కారణమయ్యే వాటిపై తగు సూచనలు చేశాం. వంటశాల శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, కలుషితం నీరు లేకుండా చూసుకోవడం, వంట చేసే వారు వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించాం. వ్యాధులు ఎక్కువగా ఉన్న వసతి గృహాల్లో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి మాత్రలు అందజేసేందుకు చర్యలు చేపట్టాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని