logo

గొలుసు దుకాణాల మూసివేతకు అడుగులు

చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో గొలుసు మద్యం దుకాణాల మూసివేతకు పోలీసులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు.

Published : 17 Jun 2024 05:41 IST

పట్టుబడిన మద్యంతో ఎక్సైజ్‌ పోలీసులు

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: చౌటుప్పల్, సంస్థాన్‌ నారాయణపురం మండలాల్లో గొలుసు మద్యం దుకాణాల మూసివేతకు పోలీసులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బెల్టు దుకాణాలను మూసివేయించాలని ఎక్సైజ్, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ సైదులు, చౌటుప్పల్‌ ఏసీపీ మధుసూదన్‌రెడ్డి ఈ నెల 6న చౌటుప్పల్, నారాయణపురం పోలీసులు, రామన్నపేట ఎక్సైజ్‌ పోలీసులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. గ్రామాల వారీగా దుకాణాల లెక్కలు తీసి దాడులను ముమ్మరం చేయాలని ఆదేశించారు. నిర్వాహకులపై కేసులు నమోదు చేసి బైండోవర్‌ చేయాలని సూచించారు. ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు 64 మంది గొలుసు మద్యం దుకాణాల నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు చౌటుప్పల్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వీటిలో పురపాలికలో నమోదు చేసిన కేసులే 31 ఉన్నాయని పేర్కొన్నారు. గ్రామాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని,  ఎవరైనా మద్యం విక్రయిస్తే తమకు సమాచారం అందించాలని లేదా 100 నంబరుకు ఫోన్‌ చేసి చెప్పాలని సూచించామన్నారు. ఎక్సైజ్‌ పోలీసులు కూడా 15 మంది బెల్టు దుకాణాలపై కేసులు నమోదు చేశారు. 

పెడదారిన పడుతున్న యువత

గొలుసు దుకాణాల వల్ల ముఖ్యంగా యువత పెడదారిన పడుతోంది. గ్రామాల్లో ఘర్షణలు కూడా జరుగుతున్నాయి. 24 గంటలు గ్రామాల్లో, పట్టణాల్లో మద్యం దొరకడంతో చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. అందుకే టెండర్‌ ద్వారా మద్యం దుకాణం నడుపుతున్న నిర్వాహకులకు పోలీసులు పలు సూచనలు చేశారు. గ్రామాల్లోని గొలుసు దుకాణదారులకు మద్యం ఇవ్వకూడదని, తమ సూచనను ఉల్లంఘించి విక్రయిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. అనవసరంగా ఇబ్బందులు తెచ్చుకోవద్దని స్పష్టంచేశారు. అవసరమైతే లైసెన్సులూ రద్దు చేస్తామని హెచ్చరించారు.

సారా నిర్మూలనపై దృష్టి

సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పలు గిరిజన తండాల్లో నాటు సారా నిర్మూలనకు రామన్నపేట ఎక్సైజ్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 29 గుడుంబా కేసులు నమోదు చేసినట్టు ఎక్సైజ్‌ ఎస్సై శంకర్‌ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి.. 100 లీటర్లకు పైగా సారాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆయా కేసుల్లో నిందితులైన 62 మందిని బైండోవర్‌ చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని