logo

ఆకాశవీధిలో.. లెఫ్టినెంట్‌ అరవింద్‌

మారుమూల గిరిజనతండాలో అట్టడుగు పేద కుటుంబంలో జన్మించాడు. 21 ఏళ్లకు నేవీ సబ్‌ లెఫ్టినెంట్, 24 ఏళ్లకు ఇండియన్‌ నేవీ పైలట్‌లో లెఫ్టినెంట్‌ హోదా సాధించారు..

Updated : 17 Jun 2024 05:57 IST

నేవీ పైలట్‌గా గిరిజన బిడ్డ   

హైదరాబాద్‌ దుండిగల్‌లో శనివారం ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరి ద్వారా వింగ్స్‌ అందుకున్న అనంతరం తల్లి బుజ్జితో అరవింద్‌ చౌహాన్‌

దేవరకొండ, న్యూస్‌టుడే: మారుమూల గిరిజనతండాలో అట్టడుగు పేద కుటుంబంలో జన్మించాడు. 21 ఏళ్లకు నేవీ సబ్‌ లెఫ్టినెంట్, 24 ఏళ్లకు ఇండియన్‌ నేవీ పైలట్‌లో లెఫ్టినెంట్‌ హోదా సాధించారు.. దేవరకొండ మండలం సీతారాంతండాకు చెందిన కొర్ర అరవింద్‌ చౌహాన్‌. హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌లో శనివారం ఇండియన్‌ నేవీ పైలట్‌గా ఉత్తీర్ణత సాధించి ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌.చౌదరి చేతుల మీదుగా పైలట్‌ వింగ్స్‌ అందుకున్న సందర్భంగా ‘న్యూస్‌టుడే’ కథనం.

 11 ఏళ్లకే తండ్రి దూరమైనా..

తండాకు చెందిన కొర్ర కుమార్, బుజ్జి దంపతుల ప్రథమ కుమారుడు అరవింద్‌ చౌహాన్‌. 11 ఏళ్ల వయస్సులోనే తండ్రిని కోల్పోయినా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా 2013లో ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో విజయనగరం జిల్లాలోని సైనిక్‌ స్కూల్‌లో సీటు సాధించారు. అక్కడ కఠోరమైన విద్యాభ్యాసం, శిక్షణ అనంతరం 2016 సెప్టెంబర్‌లో నిర్వహించిన నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ పరీక్షను ఆరు లక్షల మంది రాయగా.. అరవింద్‌ చౌహాన్‌ 175వ ర్యాంకు సాధించాడు. నాలుగు వేల మందిని ఇంటర్వ్యూకు పిలిచారు. 300 మంది ఎంపికయితే అందులో చౌహాన్‌ నేవీలో అర్హత సాధించారు. అనంతరం శిక్షణ పొందుతూనే పుణెెలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. అనంతరం ఇండియన్‌ నావల్‌ అకాడమీ కేరళలో ఏడాది పాటు శిక్షణ తీసుకున్నారు. 2021 మే 29న ఇండియన్‌ నేవీలో గ్రూప్‌-1 స్థాయి గల సబ్‌ లెఫ్టినెంట్‌గా కేరళ రాష్ట్రం కొచ్చిలో ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌లో ఉద్యోగానికి ఎంపికయ్యారు. భారత రాష్ట్రపతి నౌకాదళంలో పోస్టింగ్‌ ఇస్తూ ఉత్తర్వులు అందుకున్నారు. అంతటితో ఆగకుండా 2023న హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఇండియన్‌ నేవీ విమానయానంలో స్పెషల్‌ బ్రాంచ్‌లో ఉత్తీర్ణత సాధించి 2024 జూన్‌ 15న ఎయిర్‌ చీఫ్‌ మాస్టర్‌ వీఆర్‌ చౌదరి చేతుల మీదుగా లెఫ్టినెంట్‌ హోదా స్వీకరించి ఇండియన్‌ నేవీ పైలట్‌గా ఉద్యోగం సాధించారు. కృషి, పట్టుదలకు ఆత్మవిశ్వాసం తోడైతే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు.

గర్వంగా ఉంది : కొర్ర అరవింద్‌ చౌహాన్‌

దుండిగల్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో ఇండియన్‌ నేవీ పైలట్‌గా లెఫ్టినెంట్‌ హోదా సాధించినందుకు గర్వంగా ఉంది. చాలామంది డాక్టర్, ఇంజినీరింగ్, ఇతర విభాగాల్లోకి వెళ్తున్నారు. అలా కాకుండా దేశ రక్షణ శాఖలైన వాయు, జల, ఆర్మీ విభాగంలో చేరేందుకు ముందుకు రావాలి. అందుకే నా వంతు సామాజిక బాధ్యతగా పాఠశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్పించాలని నిర్ణయించా.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని