logo

జులై నుంచి ఇంటిపన్నుపై వడ్డీ

పురపాలికల్లో ఇంటి పన్నుల వసూలుపై అధికారులు దృష్టి సారించారు. ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది.

Published : 17 Jun 2024 05:46 IST

సూర్యాపేటలో పన్నుదారులకు డిమాండ్‌ నోటీసులు అందజేస్తున్న పుర అధికారులు

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: పురపాలికల్లో ఇంటి పన్నుల వసూలుపై అధికారులు దృష్టి సారించారు. ఏటా మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరాన్ని పుర అధికారులు రెండు విడతలుగా విభజించారు. మొదటి అర్ధ వార్షిక సంవత్సరం జూన్‌ నెలాఖరు, రెండోది డిసెంబరు నెలాఖరు వరకు పరిగణనలోకి తీసుకొని పన్నులు వసూలు చేస్తున్నారు.

ఇంటింటికీ నోటీసుల పంపిణీ..

నల్గొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాలోని 19 పురపాలికల్లో ఆస్తి పన్నులు చెల్లించేలా అధికారులు ఎప్పటిలాగే యజమానులకు డిమాండ్‌ నోటీసులు పంపిణీ చేస్తున్నారు. పది రోజులుగా ఇంటింటా తిరుగుతూ బిల్‌ కలెక్టర్లు, సహాయకులు గృహ యజమానులకు నోటీసులు అందజేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని పురపాలికల్లో 16,549 డిమాండ్‌ నోటీసులు పన్నుదారులకు అందించారు. ముందస్తుగా ఆస్తి పన్ను చెల్లించిన వారికి ఈ నోటీసులు జారీ చేయటం లేదు.

రెండు శాతం వడ్డీ విధింపు

మొదటి అర్ధ వార్షిక సంవత్సరం ఈ నెల 30న ముగియనుంది. ఆ లోగా ఇంటి పన్ను చెల్లిస్తే వడ్డీ భారం ఉండదు. లేదంటే జులై నెల ప్రారంభం నుంచి 2శాతం వడ్డీ వసూలు చేస్తారు. ప్రతినెలా వడ్డీ పెరగనుంది. నోటీసులు అందినా, అందకపోయినా ఇంటి, అసెస్‌మెంటు నంబర్ల ఆధారంగా కార్యాలయంలోని బిల్‌ కలెక్టర్ల దగ్గర, ఆన్‌లైన్‌లో చెల్లించుకునే వీలుంది. రూ.వేలల్లో ఆస్తి పన్ను చెల్లించే వారికి రెండు శాతం వడ్డీ మరింత ఇబ్బందికరంగా మారనుంది. ముందుస్తుగా చెల్లింపులు చేసిన వారిని మినహాయిస్తే మిగతా వారంతా గడువులోగా పన్ను చెల్లించకపోతే ప్రతినెలా వడ్డీ భారం మోయాల్సి ఉంటుంది.

గడువులోగా చెల్లించండి

శ్రీనివాస్, పుర కమిషనర్, సూర్యాపేట

ఈ నెలాఖరుతో 2024-25 మొదటి అర్ధ వార్షిక సంవత్సరం ముగియనుంది. ఈలోపు పన్నుదారులు పన్నులు చెల్లించాలి. జులై నుంచి 2శాతం వడ్డీ పడుతోంది. వెంటనే స్పందించి పన్నులు చెల్లించి పుర అభివృద్ధికి సహకరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని