logo

కథలకు పట్టంకట్టి.. పరిశోధనలో గెలిచి

వారంతా నిరుపేద కుటుంబానికి చెందినవారే. తమ కుటుంబంలో ఎలాంటి ఉన్నత విద్యావంతులు లేకున్నా తామూ చదువులో ఉన్నతంగా రాణించాలని సంకల్పించుకున్నారు.

Updated : 17 Jun 2024 05:58 IST

వివాహం అనంతరం డాక్టరేట్‌ సాధించిన మహిళలు

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: వారంతా నిరుపేద కుటుంబానికి చెందినవారే. తమ కుటుంబంలో ఎలాంటి ఉన్నత విద్యావంతులు లేకున్నా తామూ చదువులో ఉన్నతంగా రాణించాలని సంకల్పించుకున్నారు. పరిస్థితులు అనుకూలించకున్నా.. ఆర్థిక స్థితిగతులు తోడులేకున్నా.. మొక్కవోని ధైర్యం.. పట్టుదలతో ముందుకు సాగారు. వివాహం అనంతరం ఇంటిపట్టునే ఉండకుండా.. చదువులో ఉన్నతంగా రాణించారు. ఫలితంగా ఆయా అంశాల్లో డాక్టరేట్‌ పట్టాను పొంది సమాజంలో తామేంటో రుజువు చేసుకున్నారు. నేటి యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచే మహిళా‘మణులు’ పరిచయమే ఈ కథనం.

చదువంటే ఇష్టం కారణంగానే..

ఉన్నతాధికారుల అభినందనలు అందుకుంటున్న స్వప్న

మెదక్‌ జిల్లా గజ్వేల్‌కు చెందిన సిరినేని స్వప్న ఇంటర్‌ పూర్తి కాగానే గుండాలకు చెందిన ఉపాధ్యాయుడు బాశెట్టి విష్ణుతో వివాహం జరిగింది. వివాహనంతరం స్వప్నకు చదువుపై ఉన్న ఆసక్తిని భర్త గమనించి ఉన్నత చదువులకు ప్రోత్సహించారు. డిగ్రీ చదివించారు. ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న గౌరవం కారణంగా నల్గొండలోని ఆల్‌ అజీజీయా కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యూకేషన్‌లో బీఈడీని కూడా పూర్తి చేశారు. ఆ వెంటనే మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎమ్మెస్సీ బోటనీ చదివారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘పొలెన్‌ అనాలసిస్‌ అండ్‌ టాగ్జనమిక్‌ స్టడీ ఆఫ్‌ పోయేసి ఫ్యామిలీ ఇన్‌ అనంతగిరి హిల్స్, వికారాబాద్‌ డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్, ఇండియా’ అంశంపై అల్లం విజయభాస్కర్‌రెడ్డి గైడ్‌ టీచర్‌ సహకారంతో ఇటీవలనే డాక్టరేట్‌ను పూర్తి చేశారు. 2009లోనే డిగ్రీ కళాశాల లెక్చరర్‌గా ఉద్యోగం పొంది గజ్వేల్, సిద్దిపేట, నారాయణపేట, నల్గొండ మహిళా డిగ్రీ కళాశాలలో విధుల్లో చేరారు. ప్రస్తుతం డిప్యూటేషన్‌పై సిద్దిపేట మహిళా డిగ్రీ కళాశాలలో పని చేస్తున్నారు. కేవలం చదువుపై ఇష్టమే తనను ఇంత ఉన్నత స్థానానికి చేర్చిందని స్వప్న వివరించారు.

తెలుగు భాషపై మక్కువతో.. 

 శీలం రమాదేవి రచించిన ‘డా.వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవి కథలు, విశ్లేషణ’ పుస్తకం ముఖచిత్రం 

రాజపేట మండలం సోమారం గ్రామానికి చెందిన శీలం రమాదేవికి పిన్నవయసు నుంచి చదువంటే ప్రాణం. తెలుగు భాష అంటే అమితమైన ఇష్టం. ఆ ఇష్టమే ఈవిడను వివాహానంతరం కూడా ఉన్నత చదువుల వైపు అడుగులు వేయించింది. ఇంటర్‌ చదువుతున్న క్రమంలోనే చంద్రారెడ్డితో వివాహం జరిగింది. భర్త సహకారంతో డిగ్రీ, పీడీసీ, పీజీ తెలుగులో పూర్తి చేశారు. ప్రముఖ రచయితలు ‘డా.వాసిరెడ్డి సీతాదేవి, అబ్బూరి ఛాయాదేవి కథలు, విశ్లేషణ’ అంశంపై రూపొందించిన పుస్తకానికి ఓయూ నుంచి 2006లోనే డాక్టరేట్‌ పట్టా పొందారు. సదరు పుస్తకం గత 2018లో కవి నందిని సిధారెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. తెలుగు భాషపై మమకారంతో గత 22 ఏళ్లుగా హైదరాబాద్‌ ప్రాంతంలో ప్రైవేటు పాఠశాల, కళాశాలల్లో అధ్యాపక వృత్తిని సైతం చేపట్టారు. పిల్లలిద్దరూ ఇతర దేశాల్లో స్థిరపడినందున ప్రస్తుతం స్వగ్రామంలో భర్త చంద్రారెడ్డితో కలిసి నిత్యం వ్యవసాయ పనులు చేసుకుంటూనే పుస్తక పఠనం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని