logo

మేల్కొనకుంటే తప్పవు కడగండ్లు

వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచి.. పంట భూములను సారవంతంగా మార్చాలనే సంకల్పంతో గత ప్రభుత్వం 2015లో మిషన్‌ కాకతీయ పథకాన్ని తీసుకువచ్చింది.

Updated : 17 Jun 2024 06:09 IST

మునుగోడు మండలం గూడపూర్‌ చెరువుకట్టపై ఏపుగా పెరిగిన ముళ్ల పొదలు 

నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్‌టుడే: వాన నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలు పెంచి.. పంట భూములను సారవంతంగా మార్చాలనే సంకల్పంతో గత ప్రభుత్వం 2015లో మిషన్‌ కాకతీయ పథకాన్ని తీసుకువచ్చింది. ఉమ్మడి జిల్లాలో గత నాలుగేళ్లుగా చెరువులు, కుంటలపై పర్యవేక్షణ కొరవడటంతో అవి శిథిలావస్థకు చేరాయి. మిషన్‌ కాకతీయ పథకం కింద సాగు నీటి వనరులను రూ.వందల కోట్లతో అభివృద్ధి చేసినా.. నీటి పారుదల, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో కొన్ని చెరువులు కబ్జాకు గురయ్యాయి. మరికొన్నింటిలో నీరు నిలిచే పరిస్థితి లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో గత పది రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో వాటిలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కానీ, తూములు శిథిలావస్థకు చేరడంతో నీరంతా వృథాగా పోతోంది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అసంపూర్తిగా పనులు.. 

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,456 చెరువులున్నాయి. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా నాలుగు విడతల్లో 3,362 చెరువులను రూ.1,220 కోట్లతో అభివృద్ధి చేశారు. అధికారుల ప్రణాళిక లేమి కారణంగా ఆ నిధులు బూడిదలో పోసిన పన్నీరులా మారాయి. కొన్ని ప్రాంతాల్లో నాలుగో విడతలో చేపట్టిన పనులు అసంపూర్తిగా వదిలేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చెరువుల్లో పూడికతీతతోనే మమ అనిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువులు అభివృద్ధి నోచుకోలేదు. ఆ తర్వాత చిన్ననీటి పారుదలశాఖను భారీ నీటిపారుదలశాఖలో విలీనం చేయడంతో చెరువుల అభివృద్ధి, నిర్వహణపై అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి. 

2.50 లక్షల ఎకరాల్లో సాగుపై అయోమయం

మిషన్‌ కాకతీయ పథకం కింద అభివృద్ధికి నోచుకోని 1,094 చెరువులు, కుంటలు పరిస్థితి అధ్వానంగా మారింది. వాటి నిర్వహణకు నిధులు కేటాయించడం లేదు. దీంతో చెరువు కట్టలు బలహీనంగా మారాయి. వాటిపై ముళ్లపొదలు ఏపుగా పెరిగి.. చెట్ల వేర్లు కట్టలోకి వెళ్లి రివిటుమెంటును ధ్వంసం చేస్తున్నాయి. దీంతో గండ్లు పడే అవకాశం ఉంది. మరో పక్క వాగులపై నిర్మించిన కత్వల ద్వారా వరద నీటిని చెరువులకు మళ్లించేందుకు అనుసంధానించే రాచ కాల్వలు కూడా పూడికతో నిండిపోయాయి. నీటిపారుదల అధికారులు ఇప్పటికైనా మేల్కొనకపోతే ఉమ్మడి జిల్లాలో చెరువులు, కుంటల మీద ఆధారపడిన సుమారు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.

 మరమ్మతులపై ప్రత్యేక దృష్టి

అజయ్‌కుమార్, సీఈ, నీటిపారుదలశాఖ

చెరువులు, కుంటల మరమ్మతులపై ప్రత్యేకంగా దృష్టి సారించాం. అభివృద్ధి చేయాల్సిన చెరువులపై ప్రతిపాదనలు పంపించాలని ఈఈలకు ఆదేశాలు జారీ చేశాం. ఎక్కడైన సమస్యలుంటే రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలి. క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమున్న చోట యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని