logo

నగదు చేతులు మారే.. మట్టి హద్దులు దాటే

ఇక్కడి చెరువు మట్టిని ఇతర జిల్లాల్లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. అనుమతులు ఉన్నాయంటూ గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు.

Published : 17 Jun 2024 06:04 IST

 అనుమతుల మాటున అక్రమంగా రవాణా

కుర్మపల్లి మహబూబ్‌సాబ్‌ కుంటలో పొక్లెయిన్లతో మట్టి తవ్వకాలు

చింతపల్లి, న్యూస్‌టుడే: ఇక్కడి చెరువు మట్టిని ఇతర జిల్లాల్లోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. అనుమతులు ఉన్నాయంటూ గుత్తేదారులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. అధిక లోడుతో నిత్యం వందలాది టిప్పర్ల రాకపోకలు కొనసాగిస్తుండటంతో బీటీ రహదారులు ధ్వంసమవుతున్నాయి. నిబంధనల ప్రకారం చెరువులో మీటరు లోతు వరకు తవ్వకాలు జరపాలి. కానీ, ఐదు మీటర్లకుపైగా తవ్వేస్తున్నా అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

మట్టి తరలింపు ఇలా..

చింతపల్లి మండలం కుర్మపల్లి గ్రామ పంచాయతీలోని చెరువు మట్టిని రంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న ఇటుక బట్టీలకు తరలించేందుకు మైనింగ్‌శాఖ నుంచి నెల రోజుల వరకు అనుమతులు తీసుకున్నారు. తక్కువ సమయం ఉండటంతో గుత్తేదారులు చెరువులో రెండు క్రేన్లు, పొక్లెయిన్లు ఏర్పాటు చేసి లారీలు, టిప్పర్ల ద్వారా అధిక మొత్తంలో మట్టిని తరలిస్తున్నారు. మట్టి తవ్వకాలు జరుగుతున్న చోట నీటి పారుదలశాఖ, మైనింగ్‌ అధికారుల పర్యవేక్షణ నిత్యం ఉండాల్సి ఉన్నా వారు అటువైపు కన్నెత్తి చూడటం లేదు.

గ్రామాభివృద్ధికి నగదు నజరానా

కుర్మపల్లిలోని మహబూబ్‌సూబ్‌ చెరువు కుంటను తవ్వేందుకు గుత్తేదారులు అధికారులతో చేతులు కలిపారనే ఆరోపణలున్నాయి. అనుమతులు తీసుకున్న భూమి పక్కనే ప్రభుత్వ స్థలం ఉండటంతో దానిపై గుత్తేదారుల కన్నేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు టిప్పర్లను అడ్డుకున్నారు. ఈ భూమిలో తవ్వకాలు జరిపితే కేసులు నమోదు చేస్తామని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు. వర్షాలు కురిస్తే మట్టి తవ్వకాలు ముందుకుసాగే అవకాశం లేదు. దీంతో గ్రామస్థులతో మాట్లాడుకొని ఎలాంటి అడ్డంకులు ఉండకూడదని గ్రామాభివృద్ధికి రూ.4 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకొని తపాలా కార్యాలయంలో నగదు జమ చేశారు. నెల రోజుల మట్టి తరలింపు కోసం రూ.4లక్షలను గ్రామానికి ఇచ్చేందుకు ముందుకు రావడం చర్చనీయాంశమైంది.

లోతు ఎక్కువ తవ్విన మాట వాస్తవమే

హన్‌మాన్‌ప్రసాద్, ఏఈ, నీటిపారుదలశాఖ

చెరువులోని మట్టిని నిబంధనల ప్రకారం కంటే అధికలోతులో తవ్వకాలు చేపట్టినట్లు మా దృష్టికి వచ్చింది. ఆ ప్రాంతాలను మట్టితో పూడ్చాలని సూచించాం. చెరువులో జరుగుతున్న తవ్వకాలను పర్యవేక్షించి నిబంధనలు ప్రకారం చేపట్టకపోతే చర్యలు తీసుకుంటాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని