logo

వరి విత్తనంపై డీలర్ల పెత్తనం

వర్షాకాలంలో వరి సాగు చేయడానికి రైతులు ఓ వైపు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రైవేటు కంపెనీలు బ్రాండ్‌ల పేరిట ధరలను పెంచేశాయి.

Published : 17 Jun 2024 06:24 IST

రూ.100 నుంచి 120 వరకు పెంచి విక్రయాలు

వరి విత్తనాలు

నల్గొండ గ్రామీణం: న్యూస్‌టుడే: వర్షాకాలంలో వరి సాగు చేయడానికి రైతులు ఓ వైపు నారు మడులను సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో ప్రైవేటు కంపెనీలు బ్రాండ్‌ల పేరిట ధరలను పెంచేశాయి. 25, 30 కిలోల బస్తాల సర్టిఫైడ్‌ వరి విత్తనాలను అదనంగా రూ.100 నుంచి రూ.120కి విక్రయిస్తున్నా పట్టించుకునే వారు కరవు. పత్తి మినహా మిగతా పంటల విత్తనాల విక్రయాలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో సంబంధిత దుకాణాల యజమానులు ధరలు పెంచి అమ్ముతున్నారు. ప్రభుత్వ రాయితీ కూడా లేకపోవడం, వెలలు పెంచడంతో అన్నదాతలపై ఆదనపు భారం పడుతోంది.

 రైతులపై రూ.10 కోట్ల భారం

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్నదాతలు అత్యధికంగా వరి సాగు చేస్తున్నారు. ప్రస్తుత వానాకాలంలో సుమారు 10 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇందుకు 2,67,219 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని కూడా లెక్కలు వేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని విత్తన కంపెనీలు గతేడాది కంటే ప్రస్తుత సీజన్‌లో సర్టిఫైడ్‌ విత్తనాల ధరలను పెంచాయి. ఏటా ఆయా కంపెనీలు వెలలను పెంచి తమపై ఆర్థిక భారం మోపుతున్నాయని రైతులు వాపోతున్నారు. ఈ లెక్కన చూస్తే పెరిగిన ధరల కారణంగా ఉమ్మడి జిల్లా రైతులపై రూ.10 కోట్ల అదనపు భారం పడుతోంది. రైతుల వద్ద ఎక్కువ వెలకు విత్తన ధాన్యం కొనుగోలు చేయాల్సి వచ్చినందుకే ధరలు పెంచాల్సి వచ్చిందని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతుండటం విశేషం.

రాయితీ లేక..

గతంలో అన్ని రకాల విత్తనాలను 50 శాతం రాయితీపై అందించిన ప్రభుత్వం కొన్నేళ్లుగా జనుము, జీలుగ(పచ్చిరొట్ట) విత్తనాలను మాత్రమే పంపిణీ చేస్తోంది. దీంతో రైతులు ప్రైవేటు డీలర్ల వద్ద విత్తనాలను పూర్తి ధరకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని వివిధ సీడ్‌ కంపెనీలు బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్, ఎంటీయూ, కేఎన్‌ఎం, ఐఆర్, జేజేఎల్‌ తదితర రకాలకు ఇష్టారీతిన ధరలు పెంచి ప్రైవేటు డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు.

చర్యలు తీసుకుంటాం

పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, నల్గొండ

ప్రైవేటు కంపెనీలు వరి విత్తనాల ధరలు పెంచినట్లు తెలిసింది. రైతులు ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు తీసుకుంటాం. విత్తనాలు కొనుగోలు చేసిన అన్నదాతలు తప్పనిసరిగా రసీదు తీసుకొని పంట పూర్తయ్యే వరకు భద్రపరచాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని