logo

మిషన్‌ భగీరథ నీళ్లొస్తున్నాయా?

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1740 గ్రామ పంచాయతీలు, 18 పురపాలికల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా తీరును పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది.

Published : 17 Jun 2024 06:24 IST

ఇంటింటా కొనసాగుతున్న సర్వే

చౌటుప్పల్‌ మండలంలో ఇంటింటి సర్వేను పర్యవేక్షిస్తున్న ప్రత్యేకాధికారి రాజేశ్వర్‌రెడ్డి

చౌటుప్పల్, న్యూస్‌టుడే: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 1740 గ్రామ పంచాయతీలు, 18 పురపాలికల్లో మిషన్‌ భగీరథ నీటి సరఫరా తీరును పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వే నిర్వహిస్తోంది. ఇందులో ఈ పథకం అధికారుల ప్రమేయం లేకుండా పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తుండటం విశేషం. అధికారులు, పంచాయతీ సిబ్బంది క్షేత్రస్థాయిలో ఇంటింటికీ తిరుగుతూ.. ఇళ్లల్లో నల్లాలు ఏర్పాటు చేశారా? ప్రకటించిన ప్రకారం భగీరథ నీళ్లు వస్తున్నాయా? తదితర వివరాలను సేకరిస్తున్నారు.

భగీరథ లక్ష్యమిదే

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని వేల మందిని ఫ్లోరోసిస్‌ వ్యాధిగ్రస్థులుగా, జీవచ్ఛవాలుగా మార్చిన ఫ్లోరైడ్‌ నీటి నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు గత ప్రభుత్వం ‘మిషన్‌ భగీరథ’ పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 0.80, పట్టణ ప్రాంతాల్లో 2 శాతం చొప్పున 2048 నాటికి పెరగనున్న జనాభా, పరిశ్రమల నీటి అవసరాలకు అనుగుణంగా ఈ పథకాన్ని రూపొందించారు. గత ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు రూ.50 వేల కోట్లు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రూ.5800 కోట్లు వెచ్చించి మిషన్‌ భగీరథను అమలు చేసింది. ఫ్లోరైడ్‌ నీటి సమస్య పరిష్కరించామని, రాష్ట్రంలో కొత్తగా ఒక్క ఫ్లోరైడ్‌ కేసు కూడా నమోదు కాలేదని కొన్ని నెలల క్రితం లోక్‌సభలో ప్రకటించడం ఈ పథకం విజయవంతమైందనడానికి నిదర్శనమని అప్పటి ప్రభుత్వం వెల్లడించింది. 

పథకం పురుడు పోసుకుంది ఇక్కడే

దేశంలోనే అత్యధిక ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతంగా గుర్తింపు పొందిన మునుగోడు నియోజకవర్గంలోనే మిషన్‌ భగీరథ పథకం పురుడు పోసుకుంది. 2015 జూన్‌ 8న అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ చౌటుప్పల్‌లో శంకుస్థాపన చేసి మిషన్‌ భగీరథ పైలాన్‌ను ఆవిష్కరించారు. ప్రతి మనిషికి రోజూ గ్రామీణ ప్రాంతాల్లో 100 లీటర్లు, పురపాలికల్లో 135 లీటర్లు చొప్పున, పది శాతం నీళ్లను పరిశ్రమలకు పంపిణీ చేయడమే లక్ష్యంగా మిషన్‌ భగీరథను రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గానికి కృష్ణా జలాలు తీసుకురావడానికి నాగార్జునసాగర్‌ నుంచి ఏకేబీఆర్‌ ద్వారా నాంపల్లి మండలంలోని ట్రీట్‌మెంట్‌ ప్లాంటు వరకు ప్రత్యేకంగా పైపులైను వేశారు. మొత్తం 329 గ్రామాల్లోని 78,601 ఇళ్లల్లో ఏర్పాటు చేసిన నల్లాల ద్వారా శుద్ధజలాలు అందించడానికి మొత్తం రూ.848.66 కోట్లు ఖర్చయినట్టు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది.

సేకరిస్తున్న వివరాలివి..

యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్న పంచాయతీ కార్యదర్శి

మిషన్‌ భగీరథ కోసం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో చరవాణిలో వివరాలు నమోదు చేస్తున్నారు. జిల్లా, మండలం, ఆవాసం, కుటుంబ యజమాని పేరుతో సహా అందులో నమోదై ఉన్నాయి. నల్లా ఉందా? రోజుకు మనిషికి వంద లీటర్లు చొప్పున నీళ్లు వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తున్నారు? అనే వివరాలను నమోదు చేసి ఇంటి ఎదుట నిలబెట్టి వివరాలు చెప్పిన వారితోపాటు నల్లా ఫొటో, చరవాణి నెంబరు సహా అప్‌లోడ్‌ చేస్తున్నారు. యాప్‌లో కుటుంబం పేరు నమోదై లేనట్లయితే కొత్తగా నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు.

80 శాతం పూర్తి

అప్పారావు, జడ్పీ సీఈవో, సూర్యాపేట

మిషన్‌ భగీరథ నీటి సరఫరా తీరుపై జిల్లాలో పకడ్బందీగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. ఇప్పటికే 80 శాతం పూర్తి చేశాం. చిన్న మండలాల్లో వంద శాతం పూర్తయ్యింది. ట్యాబ్‌పై అవగాహన ఉన్న పంచాయతీ కార్యదర్శులు, మల్టీపర్పస్‌ వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలకు శిక్షణ నిర్వహించి సర్వే చేయిస్తున్నాం. మిషన్‌ భగీరథ కనెక్షన్‌ లేనట్లయితే త్వరలో ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని