logo

ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి మృతి

రాత్రివేళ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని తుమ్మలపల్లి గ్రామం సమీపంలో ఆదివారం జరిగింది.

Published : 17 Jun 2024 06:21 IST

ఉపేందర్‌

మోతె, న్యూస్‌టుడే: రాత్రివేళ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని తుమ్మలపల్లి గ్రామం సమీపంలో ఆదివారం జరిగింది. ఎస్సై యాదవేందర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన మంద ఉపేందర్‌(32) సుతారి పని చేస్తూ జీవిస్తుండేవారు. మామిళ్లగూడెం నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా గ్రామ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. ఎదురుగా ఒక్క లైటుతో వచ్చిన ఇసుక ట్రాక్టర్‌ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో వాహనం నడుపుతున్న ఉపేందర్‌ తల ట్రాక్టర్‌ ఇంజిన్‌కు తగిలి ఛిద్రమైంది. ద్విచక్ర వాహనంపై ఉన్న అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి ఎగిరి పక్కకు పడటంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఢీకొట్టిన ట్రాక్టర్‌ ఆపకుండా వెళ్లిపోయినట్లు స్థానికులు తెలిపారు. మండలంలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ సమీప గ్రామంలో ఇసుక పోసి వెళుతూ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. వాహనాన్ని గుర్తించేందుకు సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, నాలుగేళ్ల లోపు వయసున్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మృతదేహాన్ని మరణోత్తర పరీక్షల నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని