logo

తీరని వారధి కష్టాలు

వానాకాలం వచ్చిందంటే జిల్లాలోని పలుచోట్ల వాగులపై ఉన్న లోలెవల్‌ కాజ్‌వేలు ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షాలకు వరద పోటెత్తి రోజుల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది.

Updated : 18 Jun 2024 05:47 IST

ఆలేరు, న్యూస్‌టుడే

వానాకాలం వచ్చిందంటే జిల్లాలోని పలుచోట్ల వాగులపై ఉన్న లోలెవల్‌ కాజ్‌వేలు ప్రమాదకరంగా మారుతున్నాయి. వర్షాలకు వరద పోటెత్తి రోజుల తరబడి రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. అత్యవసరమైతే కిలోమీటర్ల దూరం అదనంగా ప్రయాణించాల్సి వస్తోంది. ఈ సమస్య జిల్లాలోని చాలా ప్రాంతాల్లో నెలకొన్నప్పటికీ ఆలేరు నియోజకవర్గ పరిధిలో అధికంగా ఉంది. హైలెవల్‌ వంతెనల నిర్మాణాలకు పూర్తిస్థాయిలో నిధులు మంజూరు కావడం లేదు. కొన్నిచోట్ల మంజూరైనప్పటికీ పనులు మొదలు పెట్టలేదు.. మరికొన్ని చోట్ల మొదలైన పనులు పూర్తి కావడంలేదు. ఏటా వర్షాకాలంలో నెలకొంటున్న వారధుల కష్టాలను శాశ్వతంగా తొలగించేందుకు సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టిని సారించాలని ప్రజలు కోరుతున్నారు.

సమస్యలివి..

  • గుండాల మండలంలో గత ఏడాది భారీ వర్షాలకు కొట్టుకుపోయిన నూనెగూడెం వంతెన పనులు ఇప్పటికీ మొదలు పెట్టలేదు. 
  • రాజపేట మండలంలోని పారుపల్లి వాగుపై కల్వర్టు వరద ఉధ్రృ తికి కొట్టుకుపోయింది. వంతెన నిర్మాణానికి రూ.12.06 కోట్లు మంజూరయ్యాయి,. టెండర్లు పూర్తయినప్పటికీ పనులు దలు కాలేదు. 
  • రాజపేట మండలం బేగంపేట, చల్లూరు వాగులపై కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. నిధులు మంజూరు చేయడంతో టెండర్లు ఖరారయ్యాయి. పనులు వదిలేశారు.
  • ఆలేరు-సిద్దిపేట మార్గంలో కొలనుపాక పెద్దవాగుపై లోలెవల్‌ కాజ్‌వే స్థానంలో వంతెన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. పనులు మాత్రం మొదలు పెట్టలేదు. 
  • కొలనుపాకలో పీతాంబరం వాగు వంతెనపై వరద పొంగితే రాకపోకలు నిలిచిపోతున్నాయి.
  • ఆలేరు-మోటకొండూరు మార్గంలో ఆలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో, బహద్దూరుపేట సమీపంలో గల కాజ్‌వేలపై వరద సమయంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. హైలెవల్‌ వంతెనలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నప్పటికీ పట్టింపు లేకుండా పోయింది.
  • మోటకొండూరు మండలం కాటేపల్లి, ముత్తిరెెడ్డిగూడెం మధ్య మంజూరైన వంతెన పనులు మూడేళ్లు దాటినా పూర్తికాలేదు.
  • బొమ్మలరామారం మండలం మునిరాబాద్, బండకాడిపల్లి గ్రామల మధ్య గల శామీర్‌పేట వాగుపై వంతెన నిర్మాణానికి 2022లో రూ.6.5 కోట్లు మంజూరయ్యాయి. పనులు మాత్రం ప్రారంభం కాలేదు.

పనులు ప్రారంభిస్తాం 

- బిల్యానాయక్, డీఈ, ఆర్‌అండ్‌బీ, ఆలేరు

ఆలేరు సబ్‌ డివిజన్‌ పరిధిలో వంతెనల నిర్మాణాలకు సంబంధించి కొన్ని పనులు జరుగుతున్నాయి. ఇంకొన్నింటి పనులు ప్రారంభం కావాల్సి ఉంది. కొలనుపాక పెద్దవాగుపై లోలెవల్‌ కాజ్‌వే వద్ద చేపట్టాల్సిన వంతెన నిర్మాణానికి సంబంధించి టెండరు ఖరారు కావాల్సి ఉంది. రాజపేట మండలంలో చేపట్టిన కొన్ని పనులు ప్రగతిలో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వాటికి సంబంధించిన పనులు త్వరితగతిన మొదలు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని