logo

ఆలస్యమైతే విద్యుత్తు ముప్పు

రానున్న రోజుల్లో విద్యుత్తు ముప్పు తప్పేలా లేదు. వానాకాలం సాగుకు సమస్యలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సకాలంలో పరిష్కరించకపోతే రైతులు రోడ్డెక్కే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి.

Published : 18 Jun 2024 04:42 IST

గరిడేపల్లి, హుజూర్‌నగర్, న్యూస్‌టుడే

రానున్న రోజుల్లో విద్యుత్తు ముప్పు తప్పేలా లేదు. వానాకాలం సాగుకు సమస్యలు తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సకాలంలో పరిష్కరించకపోతే రైతులు రోడ్డెక్కే అవకాశం ఉంది. గతంలోనూ ఇలాంటి సందర్భాలు ఎదురయ్యాయి. జిల్లాలో మోటార్లు, ఏసీలు ఏటా రెట్టింపవుతున్నాయి. ఆ స్థాయిలో విద్యుత్తు సామర్థ్య నియంత్రికల ఏర్పాటు జరగడం లేదు. డివిజన్ల వారీగా సమస్యలు నెలకొన్నాయి. మార్చికి ముందు వేసవి ప్రత్యేక ప్రణాళికతో పట్టణాల్లో, మండల కేంద్రాల్లో అదనపు నియంత్రికల ఏర్పాటుకు కృషి చేశారు. అదే స్ఫూర్తితో వ్యవసాయ విద్యుత్తు సరఫరాకు తగిన చర్యలు ముందస్తుగా తీసుకోవాల్సిన అవసరం ఉంది.

అత్యవసరం ఇదీ

సూర్యాపేట, మునగాల, గరిడేపల్లి, పెన్‌పహాడ్, నేరేడుచర్ల మండలాల పరిధిలోని పలు ఉపకేంద్రాల సమస్యతో పాటు హుజూర్‌నగర్‌ ప్రాంతంపై లోడు తగ్గాలంటే పెన్‌పహాడ్‌లో ప్రతిపాదించిన 220/33 కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు అత్యవసరం. ఇది ఏర్పాటైతే జిల్లాలో చాలా వరకు కరెంటు సమస్య తొలగినట్లే.


అధిగమించాల్సిన కొన్ని సమస్యలు

నేరేడుచర్ల మండలంలో లోడు భారం తగ్గాలంటే పాలకవీడు మండలం మూసిఒడ్డు సింగారంలో 33/11 కేవీ ఉపకేంద్రం ఏర్పాటు చేయాలి. అప్పుడు నేరేడుచర్ల ఉపకేంద్రంలో అదనపు నియంత్రిక అవసరం ఉండదు. అలింగాపురం, పాలకవీడు, నేరేడుచర్ల ఉపకేంద్రాలపై భారం తగ్గి లోడు సమస్య తొలగిపోనుంది.

  • గరిడేపల్లి మండలంలో నిత్యం సమస్యగా మారిన గానుగబండ, కల్మల్‌చెరువు ఒకే లైను నుంచి ఇంటర్‌ లింకు లైను ఏర్పాటు చేయాల్సి ఉంది. నాలుగేళ్లుగా ఈ సమస్యతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నేటికీ పరిష్కారం కాలేదు. ఒక సబ్‌స్టేషన్‌ పరిధిలో కరెంటు పోతే రెండు ఉప కేంద్రాల్లో సరఫరా నిలిపి వేయాల్సి వస్తోంది. 
  • పొనుగోడు, గడ్డిపల్లిలో 5 ఎంవీఏ నుంచి 8 ఎంవీఏకి మార్చాలి. 
  • గరిడేపల్లిలో అదనంగా 5 ఎంవీఏ ఏర్పాటు చేయాలి.
  • మఠంపల్లి మండలం బక్కవంతులగూడెం, మునగాల మండలం బరాకత్‌గూడెం, చెన్నాయిపాలెంలలో అత్యవసరంగా సబ్‌స్టేషన్‌ల నిర్మాణం ప్రారంభించాలి. ఎప్పుడో మంజూరై టెండర్‌ పూర్తయినా పనులు చేపట్టలేదు.
  • మఠంపల్లి మండలంలోని ఎన్‌సీఎల్‌ ఫ్యాక్టరీలో ఉన్న ఉపకేంద్రాన్ని తీసి సుల్తాన్‌పుర తండా వద్ద ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇక్కడ ఆర్‌అండ్‌ఆర్‌లో ప్రభుత్వ స్థలం ఉంది. ఇది స్వాధీనం చేస్తే ఉపకేంద్రం షిఫ్టింగ్‌ చేయడానికి వీలుంటుంది. కర్మాగారంలో ఉండటం వల్ల సిమెంట్, దుమ్ము పడి వర్షం వచ్చినపుడు రాత్రి సరఫరా నిలిచిపోతోంది.
  • వేపల సింగారంలో 31.5 పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు రెండు ఏర్పాటుచేస్తే ఇబ్బందులు పోతాయి. మఠంపల్లి, రామాపురంపై లోడు భారీగా తగ్గుతుంది. 

మంత్రి దృష్టికి తీసుకెళ్లాం

-వెంకటకృష్ణయ్య, డీఈ 

విద్యుత్తు ఉపకేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ద్వారా మంజూరుకు కృషి జరుగుతోంది. టెండర్‌ పూర్తయిన సబ్‌స్టేషన్‌ల నిర్మాణం వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. వీలైనంత వరకు వానాకాలంలో సమస్య తలెత్తకుండా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని