logo

మళ్లీ ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా ప్రజాపాలన కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లోక్‌సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్‌ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

Updated : 18 Jun 2024 05:48 IST

ఉమ్మడి జిల్లాలో ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్‌టుడే

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల అమలులో భాగంగా ప్రజాపాలన కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. లోక్‌సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్‌ కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కోడ్‌ ముగియడంతో తాజాగా ప్రజాపాలన కేంద్రాలను అధికారులు పునఃప్రారంభించారు. వీటిల్లో ప్రధానంగా గృహజ్యోతి(జీరో విద్యుత్తు బిల్లు), రూ.500లకే వంట గ్యాస్‌ పథకాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో, ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తులు అందించగా.. లబ్ధిదారుల పొరపాట్లతో పాటు ఆన్‌లైన్‌ చేసే సమయంలో రేషన్‌కార్డు, గ్యాస్‌ నెంబర్లు తప్పుగా నమోదయ్యాయి. దీంతో పథకాలు వర్తించక లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. వీటిని పునఃపరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంది. మండల కేంద్రాల్లోని ఎంపీడీవో, పురపాలిక కార్యాలయాల్లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరిస్తోంది. వాటిని వెంటనే పరిశీలించి పథకాలు వర్తింపజేసేందుకు అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. 

గ్యాస్‌ రాయితీకే ఎక్కువ..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 73 మండలాలు, 19 మున్సిపాలిటీల్లో ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్నచిన్న పొరపాట్ల కారణంగా సున్నా విద్యుత్తు బిల్లు, వంట గ్యాస్‌ రాయితీ పథకాలు అందని  లబ్ధిదారులు తాజాగా దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటిలో అత్యధికంగా రూ.500 గ్యాస్‌ రాయితీ పథకానికి వస్తున్నాయి. గతంలో ఈకేవైసీ చేసుకున్న తర్వాతే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించడంతో అర్జీలు తక్కువగా వచ్చాయి. తాజాగా ఈకేవైసీ పూర్తయిన వారు ఎక్కువగా దరఖాస్తు చేసుకుంటుండటంతో వాటి సంఖ్య పెరుగుతోంది.


ఆన్‌లైన్‌లో నమోదు

మ్మడి జిల్లాలో గతసారి నిర్వహించిన ప్రజాపాలనలో దరఖాస్తుల ఆన్‌లైన్‌ నమోదుకు సమయం తక్కువగా ఉండటంతో ఇష్టానుసారంగా చేశారు. దీంతో రేషన్‌ కార్డు, గ్యాస్‌ నెంబర్లు తప్పుగా నమోదయ్యాయి. విద్యుత్తు మీటర్ల నెంబర్లు, గుర్తింపు సంఖ్యలో తేడాలు ఉండటంతో వీటిని సరి చేసుకోవడానికి వీలు కల్పించారు. ఈసారి ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో ఒకటికి రెండుసార్లు సరిచూసుకొని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని