logo

ఆరుద్రపైనే ఆశలు

నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. మృగశిర కార్తెకంటే ముందే నైరుతి పలకరిస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో వానాకాలం సాగుపై రైతులు ఆశ పడ్డారు.

Published : 18 Jun 2024 04:53 IST

గరిడేపల్లి, న్యూస్‌టుడే: నైరుతి రుతుపవనాలు దోబూచులాడుతున్నాయి. మృగశిర కార్తెకంటే ముందే నైరుతి పలకరిస్తుందని వాతావరణ శాఖ చెప్పడంతో వానాకాలం సాగుపై రైతులు ఆశ పడ్డారు. రెండు రోజులు మురిపించిన వానలు ముఖం చాటేశాయి. ప్రధానంగా మెట్టపంటలు (పత్తి, పెసర, కంది వంటివి) సాగు చేసే రైతులు పూర్తిగా వర్షాధారంపైనే వేస్తుంటారు. కొంతమంది నైరుతి రాకపై నమ్మకంతో పత్తి విత్తుకున్నారు. ఇపుడు వర్షాలు లేకపోవడంతో మొలక రాక దిగాలు చెందుతున్నారు. 

సాగని నారుమడుల దున్నకం

మే నుంచి వాతావరణ శాఖ ముందస్తుగా నైరుతి రుతు పవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని చెబుతూ వస్తుంది. కానీ, వాస్తవ పరిస్థితికి భిన్నంగా వర్షాలు, ఎండలు ఉంటున్నాయి. సాధారణంగా మృగశిర కార్తెలో కురిసిన వర్షానికి మెట్ట ప్రాంత రైతులు విత్తనాలు వేసుకుంటారు. ముఖ్యంగా పత్తి, పెసర, కంది, పచ్చిరొట్ట పైర్ల విత్తనాలు చల్లుకోవడం, విత్తుకోవడం చేస్తుంటారు. ఈసారి ఇప్పటి వరకు ఆ దిశగా పనులు సాగడం లేదు. సాగర్‌ ఎడమ కాల్వ ఆయకట్టులో రైతులు ఆరుద్ర ఆరంభం కాగానే నార్లు పోసుకుంటారు. ఉమ్మడి జిల్లా పరిధిలో సాగర్‌ ఎడమ కాల్వ కింద 3.70 లక్షల ఎకరాలు (ఎత్తిపోతలతో కలిపి) ఉండగా 60 శాతం మంది రైతులు ఆరుద్రలోనే నార్లు పోస్తారు. ఎందుకంటే ప్రస్తుతం రైతులు 80 శాతం మంది సన్నరకాల వరి వంగడాలు సాగు చేస్తున్నారు. అందులోనూ స్వల్పకాలిక వరి వంగడాలు అంటే 120-125 రోజుల కాలవ్యవధి ఉన్న పంటలు వేసుకుంటున్నారు. నవంబరు మొదటి వారంలో వానాకాలం కోతలు పూర్తయి యాసంగికి నార్లు పోసుకునేలా ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. అందుకు అనుగుణంగా మృగశిర, ఆరుద్రలో వర్షాలు పడితే బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు పెరిగి నీటి లభ్యతతో విద్యుత్తు మోటార్ల సాయంతో ముందస్తుగా నాట్లు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు సరైన వర్షం పడకపోవడంతో ముందస్తుగా నారుమడులు దున్నడం కష్టంగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

పెసలు బహుబాగు

వానాకాలంలో పెసలు సాగు చేయడం వల్ల రెండు రకాల ప్రయోజనం ఉంటుందని అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఈనెల మొదటి వారంలో, లేదంటే 15 లోగా పెసలు చల్లుకుంటే వర్షాలు, సాగర్‌ నీరు ఆలస్యమైనా ఆగస్టు రెండో వారంలో (60-65 రోజుల్లో) పంట చేతికి వస్తుందని, ఎకరానికి కనీసం నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చని అధికారులు సూచిస్తున్నారు. అందుకే నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు వేయి ఎకరాలకు పైగా, సూర్యాపేట జిల్లాలో 3 వేల ఎకరాల్లో పెసర చల్లుకున్నట్లు జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్‌రెడ్డి వివరించారు. వర్షాలు పుష్కలంగా ఉంటే నల్గొండ జిల్లాలో 30 వేల ఎకరాలకు పైగా పెసర సాగు ఉంటుందని అధికారులు తెలిపారు. సరైన సమయంలో వానలు కురవకపోవడంతో అన్ని పంటలపై ప్రభావం చూపుతోందని, ఇప్పటికే పత్తి విత్తుకున్న రైతులు వర్షాలు లేక పత్తి మొలక రాక ఇబ్బంది పడుతున్నారని నల్గొండ జిల్లా వ్యవసాయాధికారి శ్రవణ్‌కుమార్‌ పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని