logo

చేనేత సంఘాల ఎన్నికలకు ముహూర్తమెప్పుడో..?

చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించడంతో కార్మికులు హర్షం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల సభ్యులు నూతన పాలక వర్గాలను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు.

Published : 18 Jun 2024 04:59 IST

మంత్రి తుమ్మల తాజా ప్రకటనతో కార్మికుల్లో ఆశలు
చౌటుప్పల్, న్యూస్‌టుడే

చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల ప్రకటించడంతో కార్మికులు హర్షం ప్రకటిస్తున్నారు. ఆ సంఘాల సభ్యులు నూతన పాలక వర్గాలను ఎన్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. కొత్తగా ఓటు నమోదుకు అవకాశమివ్వాలని కోరుతున్నారు. నూతన పాలకవర్గాలు ఎన్నికైతే సహకార సంఘాలకు జవసత్వాలు వస్తాయని, చేతినిండా పని దొరుకుతుందని చేనేత కార్మికులు ఆశిస్తున్నారు. 

చేనేత, మరమగ్గాలు, ఉన్ని పారిశ్రామిక సహకార సంఘాల పాలకవర్గాలకు 2013 ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించారు. ఈ పాలకవర్గాల పదవీకాలం అయిదేళ్లే. 2018లో కాలపరిమితి ముగియగానే ఎన్నికలు నిర్వహించకుండా ఆరేళ్లుగా ప్రభుత్వం వారినే పర్సన్‌ ఇన్‌ఛార్జిలుగా కొనసాగిస్తోంది. దీంతో సంఘాల నిర్వహణ అస్తవ్యస్తమైంది. కార్మికులు నేసిన వస్త్రాల అమ్మకాలు నిలిచిపోయాయి. చేనేత కార్మికులకు పని కల్పించడం లేదు. అప్పుల భారం పెరిగి చాలా సంఘాలు మూతబడ్డాయి. చేనేత, సిల్క్, ఉన్ని, మరమగ్గాల సహకార సంఘాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 85 ఉన్నాయి. ‘ఒక్కరి కోసం అందరు- అందరి కోసం ఒక్కరు’ అనే సహకార స్ఫూర్తితో నెలకొల్పిన ఈ సహకార సంఘాలకు సమర్థమైన, పట్టుదల, అంకితభావం, దార్శనికత గల పాలకవర్గాలను ఎన్నికునే అవకాశం కల్పించాలని, సంఘాలకు తగినన్ని నిధులు మంజూరు చేయాలని చేనేత కార్మికులు కోరుతున్నారు. చేనేత, జౌళిశాఖ ఏడీ ద్వారక్‌నాథ్‌ను వివరణ కోరగా, చేనేత సహకార సంఘాలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని