logo

ఎంపీ ల్యాడ్స్‌ విడుదలకు ప్రత్యేక పోర్టల్‌

ఇప్పటి వరకు ఎంపీలకు సంబంధించిన నిధుల వ్యవహారాలు మ్యాన్‌వల్‌గా జరగగా ఇక నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో కొనసాగనున్నాయి. ఇందుకు ఈ-సాక్షి పోర్టల్‌ను రూపొందించారు.

Updated : 21 Jun 2024 06:27 IST

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: ఇప్పటి వరకు ఎంపీలకు సంబంధించిన నిధుల వ్యవహారాలు మ్యాన్‌వల్‌గా జరగగా ఇక నుంచి నేరుగా ఆన్‌లైన్‌లో కొనసాగనున్నాయి. ఇందుకు ఈ-సాక్షి పోర్టల్‌ను రూపొందించారు. దీనిద్వారా ఆన్‌లైన్‌లో దిల్లీ నుంచే గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు జరగనున్నాయి. మౌలిక వసతుల కల్పనకు ప్రతి లోక్‌సభ సభ్యుడికి ఎంపీ ల్యాడ్స్‌ కింద ఏటా రూ.5 కోట్ల వరకు నిధులు కేటాయిస్తున్నారు. ఎక్కడ ఏ పని చేపట్టాలనే వివరాల జాబితాను ఎంపీ సంబంధిత జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి(సీపీవో) కార్యాలయానికి పంపిస్తారు. పని ఎవరు చేపట్టాలనేది ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీ పేరును సైతం ఎంపీ సూచించే వీలుంది. ఒక వేళ ఎంపీ సూచించకుంటే జిల్లా ఉన్నతాధికారి ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీని ఎంపిక చేస్తారు. సీపీవో కార్యాలయం స్టేట్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)లో ఎంపీ ల్యాడ్స్‌ పేరు మీద తెరిచిన ఖాతాలో దిల్లీ నుంచి నిధులు జమవుతుంటాయి. ఈ తంతంగా పూర్తికావడానికి చాలా రోజులు పట్టేది.

ఈ-సాక్షి  పనివిధానం ఇలా..

ఈ-సాక్షి పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏడాది కిందటనే అమల్లోకి తెచ్చింది. దీనికి ఎంపీ ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో లాగిన్‌ కావాల్సి ఉంటుంది. ప్రత్యేక పాస్‌వర్డు ఇస్తారు. నిధులు ఎన్ని అందుబాటులో ఉన్నాయనే వివరాలు అందులోనే తెలుస్తాయి. ఆన్‌లైన్‌లోనే పనుల జాబితా వివరాలు ఎంపీ క్రోడీకరించి సీపీవో కార్యాలయానికి పంపిస్తారు. సీపీవో నుంచి ఎగ్జిక్యూటివ్‌ ఏజెన్సీకి పని మంజూరు చేస్తూ వివరాలు పంపిస్తారు. పని చేపట్టాక గుత్తేదారులు వివరాలు ఆన్‌లైన్‌లో ఏజెన్సీయే పొందుపరుస్తుంది. అనంతరం ఎంపీ ల్యాడ్స్‌ వివరాలు చూసే దిల్లీ నుంచే డబ్బులు నేరుగా జమవుతాయి. ఈ విధానం అమలుతో నల్గొండ, భువనగిరి లోక్‌సభ స్థానం పరిధిలో ఇక లేఖలు సీపీవో కార్యాలయాలకు తీసుకెళ్లే పని ఉండదు. గతంలో ఓ రాజ్యసభ సభ్యుడు జిల్లాకు నిధులిస్తే హైదరాబాద్‌లో ఉన్న ఆయన లేఖను ఏ జిల్లా అయితే ఆ జిల్లాకు తీసుకెళ్లేవారు. ఈ పోర్టల్‌ విధానం అమలుకు మరో నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత లేఖల సమస్య లేకుండా ఆన్‌లైన్‌ ద్వారా కార్యకలాపాలు కొనసాగుతాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు