logo

సప్త స్వరాలు.. ఉల్లాసానికి సరాగాలు

మనిషి ఎలాంటి అనుభూతికి లోనైనా ఆ అనుభూతిని కలిగించేది సంగీతమే. పసితనం మొండికేసినప్పుడు సంగీతం వినిపిస్తే చాలు..మెత్తబడిపోతారు.

Published : 21 Jun 2024 05:59 IST

నేడు ‘ప్రపంచ సంగీత దినోత్సవం’

మిర్యాలగూడ పట్టణం, మేళ్లచెరువు, న్యూస్‌టుడే: మనిషి ఎలాంటి అనుభూతికి లోనైనా ఆ అనుభూతిని కలిగించేది సంగీతమే. పసితనం మొండికేసినప్పుడు సంగీతం వినిపిస్తే చాలు..మెత్తబడిపోతారు. పెద్దవాళ్లూ బాధల నుంచి బయటపడాలంటే సంగీతాన్ని వినాలన్నది వారి అభిలాష. యువతరం కూడా సంగీతం వింటేనే వారిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. నేటి ప్రపంచంలో యూట్యూబ్‌ షార్ట్స్, ఇన్‌స్టా రీల్స్‌ మోత మోగుతున్నప్పటికీ దూర ప్రయాణాల్లో సంగీతమే మన ఏకైక మిత్రుడు అవుతుంది. అయితే ఎంతో ప్రాధాన్యత ఉన్న సంగీతంలో శిక్షణ ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలో అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. నల్గొండ, మిర్యాలగూడలో మాత్రము సంగీత శిక్షణ సంస్థలు ఉన్నాయి. నేటి ప్రపంచం ఎటు అడుగేస్తున్నా.. సంగీతంతోనే దాన్ని చిహ్నం చూపిస్తుంది.

పసితనం మొండికేసినా..

చిన్నపిల్లలు చాలా సందర్భాల్లో కావాల్సింది చేతికివ్వకపోతే మొండికేసి ఏడుస్తుంటారు. వారిని మరిపించడానికి ఏదో ఒక వస్తువును శబ్ధం చేస్తుంటారు. అది కూడా ఒకప్పుడు వినసొంపుగా శబ్ధం చేసేవారు. నేటి చేతికి మొబైల్‌లో పాటలు వినిపిస్తే చాలు. వింటూ కదలకుండా ఉండిపోతారు. పాట ఎలాగో వారికి అర్థం కాదు. కానీ.. సంగీతమే వారిని అలా కట్టి పడేస్తుంది. ఇది సంగీతానికి ఉన్న గొప్పతనం. 

విశ్రాంతి తీసుకుంటున్నా..

యువత, పెద్దవాళ్లు పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకుంటున్నప్పుడు కాఫీ, టీ లు తీసుకుంటారు. లేదా నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఆ సమయంలో వారికి చెవికి సంగీతం వినిపిస్తే చాలు. వారు అలా మానసిక ప్రశాంతత పొందుతారు. నేటి పరిస్థితులు అలాగే ఉన్నాయి. తమకిష్టమైన సంగీతాన్ని ఆస్వాదిస్తూ ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు.

పని ముందుకు సాగాలన్నా..

వ్యవసాయం, ఇతరత్రా చేతి వృత్తులు చేసే వారు వారి పనుల్లో లీనమైపోవాలంటే సంగీతాన్నే వారు తోడు కోరుకుంటారు. ట్రాక్టరు డ్రైవరు దుక్కి దున్నాలన్నా.. టేపు రికార్డల్లో పాటలు వినాల్సిందే. మిషన్‌ కుట్టే వారూ సంగీతాన్ని వింటుంటేనే పని ముందుకెళ్తుందని విశ్వసిస్తారు. ఇలా చాలా రంగాల్లో సంగీతం వింటేనే పని నాలుగు అడుగులు ముందుకు పడుతుందని చెబుతుంటారు.

నృత్య శిక్షణలోనూ సంగీతమే..

నృత్యాల్లో కొత్త ఒరవడి చోటు చేసుకుంది. ఏరోబిక్‌ యోగాలో నృత్యానికి సంగీతం తోడైంది. ఇక అంతే ఏ వయసు వారైనా సంగీతం వింటూనే యోగా చేస్తూనే నాట్యమాడుతున్నారు. తద్వారా ఇటు మానసిక ఉల్లాసం, అటు శారీరక దారుఢ్యత లభిస్తుందని చెబుతుంటారు. సూర్యాపేటలో కొన్నేళ్లుగా ఉమ అనే శిక్షకురాలు మహిళలకు ఏరోబిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. లయబద్దమైన సంగీతం వింటూ యోగా, క్రమ పద్ధతిలో నృత్యాలు చేయడమే ఏరోబిక్స్‌.


సంగీతం వినడం, సాధన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  • జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
  • ఒత్తిడిని తగ్గించి..నిరాశ నుంచి బయట పడేస్తుంది.
  • నిద్రలేమిని తగ్గించి.. మంచి నిద్ర పోవడానికి సహాయ పడుతుంది.
  • మెదడు పనితీరు మెరుగుపడుతుంది. 
  • చదివేటప్పుడు సంగీతం వింటే ఏకాగ్రత పెరుగుతుంది. 
  • వ్యాయామం చేసేటప్పుడు సంగీతం వింటే..వ్యాయామ వేగం పెరుగుతుంది.

సంగీతంపై అవగాహన పెరగాలి: 
హరిత, సంగీత శిక్షకురాలు, మిర్యాలగూడ.

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఒత్తిడి లోనవుతున్నారు. చిన్నారులు సైతం పాఠశాలలో పోటీ కారణంగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ క్రమంలో వారిని ఉత్సాహ పరుస్తూ ఒత్తిడి నుంచి విముక్తి కలిగించేందుకు సంగీతం దోహద పడుతుంది. చిన్నారులకు క్రీడలతో పాటు సంగీత శిక్షణ కూడా ఎంతో ముఖ్యం. సంగీత సాధన వల్ల జ్ఞాపక శక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. పన్నెండేళ్లుగా కర్ణాటక సంగీతంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నా. 


ఏరోబిక్స్‌తో ఎన్నో లాభాలు: 
ఉమ, ఏరోబిక్స్‌ శిక్షకురాలు, సూర్యాపేట

లయబద్దమైన సంగీతానికి యోగాసనాలు, నృత్యాలు చేయడమే ఏరోబిక్స్‌. ఇందులో సంగీతం ఎంతో ప్రధాన పాత్ర పోషిస్తుంది. సూర్యాపేటలో ఏడేళ్లుగా ఏరోబిక్స్‌లో మహిళలకు శిక్షణ ఇస్తున్నా. మానసిక ఒత్తిడి తగ్గి..మనసు, శరీరం ప్రశాంతగా, ఆరోగ్యకరంగా మారుతాయి. సంగీతంతో అనేక వ్యాధులు దూరమవుతాయనే నానుడిని ఏరోబిక్స్‌ నిజం చేస్తుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని