logo

చిన్నారి పెళ్లికూతుళ్లు

నేటి ఆధునిక యుగంలో మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం ఇలా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కానీ, కొన్ని మారుమూల ప్రాంతాల్లో బాలికల చదువును మధ్యలోనే ఆపేసి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు.

Updated : 21 Jun 2024 06:25 IST

సూర్యాపేటలో బాల్య వివాహాలపై అవగాహన కల్పిస్తున్న అధికారులు

నూతనకల్‌ మండలానికి చెందిన 17 ఏళ్ల బాలికకు ఇష్టం లేకుండా గత మార్చిలో తల్లిదండ్రులు బలవంతంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ యువకుడితో పెళ్లి చేశారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు వరుడు, అతని తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులకూ రెండు నెలలు జైలు శిక్ష విధించారు. బాలికను హైదరాబాద్‌లో సంరక్షణ కేంద్రానికి తరలించారు.  

పెన్‌పహాడ్‌ మండలానికి చెందిన 16 ఏళ్ల బాలిక తల్లిదండ్రులు విడివిడిగా జీవిస్తున్నారు. తల్లి ఉంటున్న బాలిక బాధ్యత తీర్చుకుందామని బంధువుల్లో ఓ యువకుడితో పెళ్లి చేసింది. విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారులు కేసు నమోదు చేశారు. బాలికను సూర్యాపేట సఖి కేంద్రానికి తరలించారు. యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే: నేటి ఆధునిక యుగంలో మహిళలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం ఇలా అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కానీ, కొన్ని మారుమూల ప్రాంతాల్లో బాలికల చదువును మధ్యలోనే ఆపేసి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. కట్టుబాట్లు, ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యత, కట్నకానుకలు ఇవ్వలేమని, మూఢ నమ్మకాలు తదితర కారణాలతో బాల్య వివాహాలు చేసి అంధకారంలోకి నెడుతున్నారు.

ఆగని బాల్యవివాహాలు

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత రెండేళ్లలో 142 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చేస్తున్నవి, అధికారుల దృష్టికి రానివి కూడా ఉంటున్నాయి. బాల్య వివాహాలను అరికట్టడానికి అధికారులు చట్టాలతోపాటు చైల్డ్‌లైన్‌ నంబర్‌ 112, 1098 లేదా 100, 181 టోల్‌ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తున్నా ఫలితం ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ఎక్కడైనా బాల్య వివాహం జరిగితే అంగన్‌వాడీ టీచర్, పంచాయతీ కార్యదర్శి, గ్రామ పోలీస్, సీడీపీవో, తహసీల్దార్, చైల్డ్‌లైన్‌ సిబ్బంది, ఆర్డీవో, కలెక్టర్‌ ఇలా ఎవరికైనా సమాచారం అందించాలని అధికారులు కోరుతున్నారు.


సహకరించినా శిక్షార్హులే
- వెంకటరమణ, జిల్లా సంక్షేమ అధికారి, సూర్యాపేట

శారీరక, మానసికంగా ఎదగక ముందే బాలికలకు పెళ్లి చేయడం వల్ల అనారోగ్యంతో పిల్లలు పుడతారు. గర్భస్రావం సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బాల్య వివాహాలకు సహకరించిన వారందరూ శిక్షార్హులవుతారు. తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై జాగ్రత్త వహించి పెళ్లి చేసేటప్పుడు తప్పకుండా ఆలోచించాలి.


చట్టం ఏం చెబుతోంది.

  • ప్రొహిబిషన్‌ ఆఫ్‌ చైల్డ్‌ మ్యారేజెస్‌ యాక్ట్‌ 2006 ప్రకారం ఆడపిల్లలకు 18 ఏళ్లు, మగ పిల్లలకు 21 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి చేయాలి.
  • బాల్య వివాహాలు చేసినా, ప్రోత్సహించినా చట్టరీత్యా నేరం,
  • పురోహితులు, టెంటుహౌజ్‌ నిర్వాహకులు, బాజాభజంత్రీల వారు, హాజరైన బంధువులు, కల్యాణ మండపం అద్దెకు ఇచ్చిన వారు అందరూ శిక్షార్హులే.
  • చట్ట ప్రకారం రెండేళ్ల జైలు లేదా రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు.
  • శిక్ష నుంచి మహిళలకు మినహాయింపు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని