logo

స్వయంభూ క్షేత్రంలో సంప్రదాయ ఆరాధనలు

యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి.

Published : 21 Jun 2024 06:08 IST

శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన ఆస్థాన, ఆర్జిత పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. వేకువజామున సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయ ద్వారాలను తెరిచి మూలవరులను హారతితో కొలిచారు. పాలతో నిజాభిషేకం నిర్వహించాక, తులసీపత్రాలతో అర్చన చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వర్ణమూర్తులకు స్వర్ణ పుష్పార్చన జరిపారు. వేద, మంత్ర పఠనంతో ఆలయ మహాముఖ మండపంలో యజ్ఞమూర్తులను కొలుస్తూ సువర్ణ పుష్పార్చన క్రతువును కొనసాగించారు. ఉగ్ర నరహరిని శాంతింపజేసేందుకు శ్రీసుదర్శన నారసింహహోమం నిర్వహించారు. లోక కల్యాణార్థమై శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణాన్ని ఆలయ ఆచారంగా చేపట్టారు. కల్యాణమూర్తులను గజవాహనంపై అలంకృతులను చేసి సేవా పర్వాన్ని నిర్వహించారు. సాయంత్రంవేళ అలంకార జోడు సేవలను మంగళ వాయిద్యాలు, మంత్ర పఠనాలతో మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి గర్భాలయంలోని స్వయంభువులను కొలుస్తూ ప్రత్యేక ఆరాధన జరిపారు. దర్బార్‌ సేవోత్సవంలో నిత్యాదాయం వెల్లడించారు. వివిధ విభాగాల ద్వారా రూ.26,14,890 ఆదాయం చేకూరింది. అనుబంధంగా కొనసాగుతున్న శివాలయంలో నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని