logo

పారిశుద్ధ్యం.. వైద్యంపై ప్రత్యేక దృష్టి

వానాకాలం..వ్యాధుల కాలం.. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించాం.

Published : 21 Jun 2024 06:13 IST

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కె.గంగాధర్‌ 

భువనగిరి, న్యూస్‌టుడే: వానాకాలం..వ్యాధుల కాలం.. పారిశుద్ధ్యం, ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాం. రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్యారోగ్య శాఖ అధికారులతో సమీక్షలు నిర్వహించాం. ముందస్తు ప్రణాళిక రూపొందించాం.. ఎక్కడైనా ఎలాంటి విపత్తు సంభవించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ కె.గంగాధర్‌ స్పష్టం చేశారు. వానాకాలం సీజన్‌ ప్రారంభమైనందున పారిశుద్ధ్యం.. ప్రజారోగ్య పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను ఆయన ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వివరించారు.  

మూడు శాఖల సమన్వయంతో.. 

రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇటీవల ఎంపీడీవోలు, ఎంపీవోలు, మండల ప్రత్యేక అధికారులు, వైద్య సిబ్బందితో జిల్లా స్థాయిలో సమీక్ష నిర్వహించి వారికి బాధ్యతలు అప్పగించాం. పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాధులు ప్రబలకుండా చేపట్టాల్సిన జాగ్రత్తలను  వివరించాం. పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ కమిషనర్లు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వచ్చే మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించాం. మూడేళ్లలో అతిసారం, జ్వరాలు ఎక్కువగా వచ్చిన గ్రామాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి జాబితాలు ఇవ్వాలని, అదే విధంగా యజమానులకు నోటీసులు అందించాలని ఆదేశించాం.

తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్‌ 

గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. పైప్‌లైన్‌ లీకేజీలను అరికట్టాం. రోజు పంచాయతీల్లో క్లోరినేషన్‌ చేయాలని కార్యదర్శులను ఆదేశించాం. ట్యాంకులు, పైప్‌లైన్లు, ఇంటి వద్ద క్లోరినేషన్‌ చేసి రీడింగ్స్‌ తీయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చాం.


పారిశుద్ధ్యంపై..

పరిసరాల పరిశుభ్రతే ప్రధానం. గ్రామాలు, పట్టణాల్లో పరిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. జిల్లాలో 421 పంచాయతీలు, 226 ఆవాసాలు, 6 మున్సిపాలిటీల్లో 112 వార్డులు ఉన్నాయి. ఎక్కడా చెత్తాచెదారం పేరుకుపోకుండా రోజువారి పారిశుద్ధ్యం చేపట్టాలని ఆదేశించాం. సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలిస్తారు. గ్రామ పంచాయతీల కార్యదర్శులను రోజు పర్యవేక్షించాలని చెప్పాం. మూసీ నదీ పరివాహక ప్రాంతాలపై దృష్టి పెట్టాం. పారిశుద్ధ్య నిర్వహణకు జీపీ నుంచి నిధులు ఖర్చు చేయవచ్చు.


అంతా సిద్ధం.. 

జీపీల్లో 34,850 కేజీల బ్లీచింగ్‌ పౌడర్‌ సిద్ధంగా ఉంచాం. ఆవాసాల్లో పెరిగిన గడ్డిని తొలగించేందుకు 190 గ్రాస్‌ కట్టింగ్‌ మిషన్లు ఉన్నాయి. దోమలు నివారణకు గాను 421 జీపీలకు గాను 240 ఫాగింగ్‌ మిషన్లు సిద్ధంగా ఉంచాం. రోజు ఫాగింగ్‌ చేయాలని ఆదేశించాం. లేని జీపీల్లో పొరుగున ఉన్న పంచాయతీల నుంచి ఫాగింగ్‌ మిషన్‌ తెప్పించి కనీసం రెండు రోజులకు ఒక సారైనా తిప్పాలని సూచించాం. అసరమైతే ఆయా పంచాయతీ నిధుల నుంచి అదనంగా కొనుగోలు చేసేందుకు ఎంపీవోలకు అధికారం ఇచ్చాం. మురుగు నిల్వ ఉండకుండా గుంతల్లో మట్టి నింపాలని ఆదేశించాం. ప్రతి శుక్రవారం కచ్చితంగా డ్రై డే పాటించేలా అధికారులకు చెప్పాం.


నీరు పొంగే ప్రాంతాలగుర్తింపు 

మండలాల్లో వరద నీరు పొంగి ప్రవహించే ప్రాంతాలను గుర్తించాలని ఎంపీడీవోలకు సూచించాం. వాగులు, మూసీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, కుంటకింద నీరు ఉప్పొంగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయనున్నాం.


మందులు ఉన్నాయ్‌

వైద్య ఆరోగ్య శాఖ అవసరమగు మందులను సిద్ధంగా ఉంచింది. అత్యవసర మందులను గ్రామాల్లోని ఆశా వర్కర్ల వద్ద ఉన్నాయి. ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, డీఎన్‌ఎస్‌ ద్రావణాలు ఉన్నాయి. ఎక్కడైనా జ్వరాలు అధికంగా కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. గ్రూపులు ఏర్పాటు చేశాం. పాముకాటు, కుక్కకాటు, తేలు కాటుకు మందులు పీహెచ్‌సీల్లో ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు