logo

అడ్డగోలుగా ఔషధ విక్రయాలు.. తనిఖీ చేసేవారేరీ!

జిల్లాలో విచ్చలవిడిగా ఔషధ దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. వాటిల్లో కనీస నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా ఔషధాలు విక్రయిస్తున్నారు. తనిఖీ చేసే అధికారులు లేకపోవడంతో దుకాణదారులదే ఇష్టారాజ్యంగా మారింది.

Published : 21 Jun 2024 06:25 IST

జిల్లా కేంద్రంలోని ఔషధ నియంత్రణ శాఖ కార్యాలయం

నల్గొండ అర్బన్, న్యూస్‌టుడే: జిల్లాలో విచ్చలవిడిగా ఔషధ దుకాణాలు పుట్టుకొస్తున్నాయి. వాటిల్లో కనీస నిబంధనలు పాటించకుండా అడ్డగోలుగా ఔషధాలు విక్రయిస్తున్నారు. తనిఖీ చేసే అధికారులు లేకపోవడంతో దుకాణదారులదే ఇష్టారాజ్యంగా మారింది. ఆరు నెలల క్రితం ఔషధ నియంత్రణ శాఖలో నల్గొండ, మిర్యాలగూడ రెండు డివిజన్లుగా విభజించి ఇద్దరు అధికారులు (డీఐవో)లు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం నల్గొండ డివిజన్‌లో 700, మిర్యాలగూడ డివిజన్‌లో 800లకు పైగా లైసెన్సు కలిగిన ఔషధ సముదాయాలున్నాయి. అనుమతి లేకుండా రెట్టింపు సంఖ్యలో దుకాణాలున్నాయి. ఎలాంటి తనిఖీలు, కేసులు నమోదు లేకపోవడంతో కొందరు వ్యాపారులు జనరిక్‌ మందులను కూడా బ్రాండెడ్‌ ధరలకు విక్రయిస్తూ మూడునాలుగు  రేట్ల అధిక లాభాలు గడిస్తున్నారు. మరి కొందరు కిరాణ దుకాణాల్లోనూ మందుల అమ్మకాలు చేస్తున్నారు. 

రెండు నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డీఐవో కూరెళ్లి సోమేశ్వర్‌ రూ.18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీంతో అప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగానే ఉంది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా 17 మంది డీఐవోలను ప్రభుత్వం ఎంపిక చేసినా నల్గొండలో పనిచేయడానికి ఎవరూ సుముఖత చూపక పోవడంతో ఇన్‌ఛార్జి పాలన కొన సాగుతోంది. నల్గొండ డివిజన్‌ సూర్యాపేట, మిర్యాలగూడ డివిజన్‌ భువనగిరి డీఐవోలు ఇన్‌ఛార్జిలుగా ఉన్నారు.  జిల్లాలో కొద్ది రోజులుగా నిషేధిత ఔషధాల విక్రయాలు యదేశ్ఛగా జరుగుతున్నాయి. 

  • రెండు నెలల క్రితం నల్గొండలోని శివాజీనగర్‌లో యువకులకు మత్తు ఇచ్చే మాత్రలు విక్రయిస్తున్న దుకాణదారుడిపై పోలీసులు కేసు చేసి రిమాండ్‌కు తరలించారు. 
  • మిర్యాలగూడ పట్టణంలోని డాక్టర్స్‌ కాలనీలో ఓ దుకాణంలో నిద్రమాత్రలు, నిషేధిత మాత్రలు అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యక్తిగత పూచీకత్తుతో వదిలేశారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి.

సిబ్బంది కొరత వాస్తవమే
కె.దాస్, ఉమ్మడి జిల్లా సహాయ సంచాలకుడు, ఔషధ నియంత్రణ శాఖ

కొద్ది రోజులుగా జిల్లాలో సిబ్బంది కొరత కారణంగా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఔషధ సముదాయాల తనిఖీలు తగ్గాయి. కోర్టు కేసులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారంపది రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని