logo

సాంకేతిక పరిజ్ఞానంతో పంటల నమోదు

పంటల వివరాల నమోదులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది.

Published : 21 Jun 2024 06:21 IST

నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: పంటల వివరాల నమోదులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ క్రాప్‌ సర్వే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. 2024 జులై నుంచి వివిధ రాష్ట్రాల్లో అమలుచేయాలని నిర్ణయించింది. 2023లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, రాజస్ధాన్, ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్‌ అస్సోం సహా 12 రాష్ట్రాల్లోని  కొన్ని జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండలంలో సర్వే చేశారు. ఈ ఏడాది పూర్తి స్ధాయిలో అమలు పరిచేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 

ఉపయోగాలు ఇవీ..

విశిష్ట సంఖ్య ద్వారా ప్రభుత్వ పథకాలు అందుతాయి. ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి, ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన, పంట రుణాలు పొందటం వంటివి సులభమవుతాయి. రైతు తన వ్యవసాయ క్షేత్రాల్లో సాగు చేసే వివిధ పంటలను అధికారులు రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలు తదుపరి ప్రణాళికలు, ఉత్పత్తి అంచనాలకు దోహదపడతాయి.

రూపు మారనున్న సర్వే..

వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ. 2,800 కోట్లతో డిజిటల్‌ అగ్రికల్చర్‌ మిషన్‌ ప్రారంభించారు. క్యాడస్ట్రల్‌ (పన్ను వేసే నిర్ణీత విస్తీర్ణం కలిగిన ప్రదేశం) మ్యాపులను జియాగ్రాఫిక్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టం (జీఐఎస్‌), గ్లోబల్‌ పొజిషనింగ్‌(జీపీఎస్‌) సిస్టం ద్వారా రైతుల క్షేత్రాలను గుర్తిస్తారు. వివిధ పంటల సాగు విస్తీర్ణం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టం అంచనా వివరాల సేకరణ, చీడపీడల ఉద్ధృతి, నష్టం అంచనా, వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి వస్తాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో ఈ సంఖ్య కేటాయింపు మొదలైంది. విశిష్ట సంఖ్య ద్వారా వివరాలు జోడిస్తారు.


విధివిధానాలు రావాల్సి ఉంది.. 
పాల్వాయి శ్రవణ్‌కుమార్, డీఏవో, నల్గొండ

గతేడాది జిల్లాలోని వేములపల్లి మండలంలో ప్రయోగాత్మకంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే నిర్వహించాం. ఈ ఏడాది పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన విధివిధానాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. అప్పటి వరకు క్రాప్‌ సర్వేను కొనసాగిస్తాం. విధివిధానాలు వచ్చిన తర్వాత డిజిటల్‌ క్రాప్‌ సర్వేలో నమోదు చేస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని