logo

ఇక సమాచార వేదిక..!

అన్నదాతలు ఎప్పటికప్పుడు వ్యవసాయ సాగునకు సంబంధించి సలహాలు, సూచనలు దృశ్య శ్రవణ విధానంలో వీక్షిస్తూ తెలుసుకునేందుకు ప్రభుత్వం జిల్లాలో ఎంపిక చేసిన ఆరు కేంద్రాల్లో  రైతునేస్తం పేరిట శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఈ ఏడాది మార్చి 6న ప్రారంభించింది.

Published : 21 Jun 2024 06:25 IST

రైతు వేదిక 

‘రాష్ట్రంలో ప్రస్తుతం 110 కేంద్రాల్లోని రైతు వేదికల నుంచి వీడియో కాన్ఫరెన్సు కార్యక్రమాలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెలఖరులోగా మరో456 వేదికల్లో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం..’

తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  


నల్గొండ గ్రామీణం, న్యూస్‌టుడే: అన్నదాతలు ఎప్పటికప్పుడు వ్యవసాయ సాగునకు సంబంధించి సలహాలు, సూచనలు దృశ్య శ్రవణ విధానంలో వీక్షిస్తూ తెలుసుకునేందుకు ప్రభుత్వం జిల్లాలో ఎంపిక చేసిన ఆరు కేంద్రాల్లో  రైతునేస్తం పేరిట శిక్షణ, అవగాహన కార్యక్రమాలను ఈ ఏడాది మార్చి 6న ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి మంగళవారం నిర్వహిస్తోంది. విత్తనం నుంచి మొదలుకుని పంటల సాగు వరకు జాగ్రత్తలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ఆయా పంటల సాగులో ఆచరించాల్సిన నీరు, ఎరువులు తదితర యాజమాన్య పద్ధతులు, యాంత్రీకరణ, వివిధ పంటలకు ఆశించే చీడపీడలు,  వాటి నివారణ, సేంద్రియ వ్యవసాయ విధానాలు ఇలా పలు అంశాల్లో వారికి రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు, నిపుణులతో ఆయా పంట కాలాల్లో అవగాహన, శిక్షణ అందిస్తున్నారు. అభ్యుదయ రైతుల అనుభవాలు, సేంద్రియ సాగు విధానాలు ప్రసారం చేస్తున్నారు. ఇప్పటికే నల్గొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, సాగర్‌లో త్రిపురారం, నకిరేకల్‌ చందుపట్ల, దేవరకొండ, మిర్యాలగూడ, మునుగోడు రైతు వేదికల్లో ఎల్‌ఈడీ, వీడియో కెమెరాలు, స్టాండ్‌ సిస్టం తదితర సౌకర్యాలు కల్పించి వీడియో కాన్ఫరెన్స్‌ కేంద్రాలుగా మార్చేసింది. 

రైతులందరికీ అందుబాటులో లేవని..

కొన్ని కేంద్రాల్లో రైతునేస్తం దృశ్యశ్రవణం కార్యక్రమాలు జరగడం వల్ల రైతులందరికీ ఈ కార్యక్రమం అందుబాటులో ఉండటం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో రైతులు కూడా అంతగా హాజరవడం లేదు. ఈ వేసవిలోనూ అంతంత మాత్రంగానే హాజరు ఉంది. ప్రతి మండలంలోను కనీసం ఒక రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. ఇక జిల్లా వ్యవసాయ శాఖ ప్రతి మండలంలో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కొన్ని రైతు వేదికలను ఎంపిక చేసింది. ఈ నెలాఖరు వరకూ రాష్ట్రంలో పలు రైతు వేదికల్లో ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తేగలమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు.దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.


ప్రతి మండలానికి రైతు నేస్తాం ఏర్పాటు.. 
పాల్వాయి శ్రవణ్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, నల్గొండ

ప్రతి మండలానికి ఒక రైతు వేదికను ఎంపిక చేసి రైతు నేస్తం సేవలను విస్తరిస్తే ఈ కార్యక్రమానికి రైతుల హాజరు పెరుగుతుంది. ఈ నెల చివరి నాటికి పరికరాలు బిగిస్తాం. రైతుల సంఖ్య పెరుగుతుంది. దీంతో రైతులకు సాంకేతిక సేవలు అందుబాటులోకి వస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని