logo

ఏదీ.. రుణ ప్రణాళిక?

వానాకాలం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా.. బ్యాంకర్లు, అధికారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి పలు రంగాలకు ఇవ్వాల్సిన వార్షిక రుణ ప్రణాళికను ఇంకా ఖరారు చేయలేదు.

Published : 21 Jun 2024 06:27 IST

వానాకాలం ప్రారంభమై 20 రోజులు గడిచినా వెలువడని వైనం

ఈనాడు, నల్గొండ : వానాకాలం ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా.. బ్యాంకర్లు, అధికారులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వానాకాలం, యాసంగి సీజన్‌లకు కలిపి పలు రంగాలకు ఇవ్వాల్సిన వార్షిక రుణ ప్రణాళికను ఇంకా ఖరారు చేయలేదు. దీంతో సాగు పనులకు అవసరమయ్యే పెట్టుబడుల కోసం అన్నదాతలు ప్రైవేటు అప్పులకు షావుకార్లను ఆశ్రయిస్తున్నారు. కొంత మంది రైతులు వారికి స్థానికంగా ఉన్న సహకార, ప్రభుత్వ రంగ బ్యాంకులను ఆశ్రయిస్తున్నా.. ఉన్నతాధికారుల నుంచి విధివిధానాలు, మార్గదర్శకాలు రాలేదని రుణాలివ్వడానికి తిరస్కరిస్తున్నారు. ఏటా ఇదే విధమైన జాప్యం వల్ల అధిక వడ్డీలకు రుణాలు తీసుకువచ్చి ఆర్థికంగా చితికిపోతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఇదే సమయానికి యాదాద్రి, నల్గొండల్లో రుణప్రణాళికను ఖరారు చేయగా..ఈ సీజన్‌లో మరింత జాప్యం జరిగే అవకాశమున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. ప్రణాళిక విడుదలలో జాప్యంతో విద్యారుణాలు పొంది విదేశాలలో చదివే విద్యార్థులకు సైతం నష్టం జరుగుతోంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

లక్ష్యానికి సుదూరంగా..

గతేడాది నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కలిపి రూ.13 వేల కోట్లను వార్షిక రుణ ప్రణాళికలో ప్రకటించిన అధికారులు.. అందులో సుమారు రూ.9 వేల కోట్లను రెండు సీజన్లలో కలిసి అన్నదాతలకు రుణాలుగా ఇవ్వాలని ప్రతిపాదించారు. అయితే గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రైతులకు ఇచ్చిన రుణాల విలువ రూ.6 వేల కోట్లను మించలేదు. కొందరు రైతులు రెన్యూవల్‌ కోసం బ్యాంకులకు వెళితే రుణమాఫీ కింద వారి సొమ్ములను జమ చేసుకున్నారు. దీంతో రైతులు రెన్యూవల్‌కు సైతం వెళ్లని పరిస్థితి. మరికొన్ని చోట్ల రుణాలివ్వడానికి కొర్రీలు పెడితే ఏకంగా ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని ఎలాంటి కొర్రీలు లేకుండా రైతులకు రుణలివ్వాలని ఆదేశించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం బ్యాంకర్లు వీటిని పట్టించుకోవడం లేదు. లాక్‌డౌన్‌ అనంతర పరిణామాలతో జవసత్వాలు కోల్పోయిన చిన్న, మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)లకు సైతం రుణ ప్రణాళిక విడుదలలో జాప్యంతో సకాలంలో రుణాలందక నిర్వహణ భారమవుతోంది. రాష్ట్రంలోనే అతి పెద్దదిగా ఉన్న చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురం సూక్ష్మ, చిన్న తరహా హరిత పారిశ్రామిక పార్కులోని సుమారు 90 శాతం పరిశ్రమలు ఈ రుణాలతోనే ఉత్పత్తులను వెలువరిస్తున్నాయి. రుణాల జాప్యంతో వీటిపైనా ప్రభావం పడి స్థానికులకు ఉపాధి దొరకడం లేదు. మరోవైపు రుణ ప్రణాళికపై కసరత్తు తుది దశకు చేరుకుందని...ఈ నెలాఖరులోపు ప్రణాళికను విడుదల చేసి ఏ రంగానికి ఎంత రుణం అనేది వెల్లడిస్తామని సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని