logo

మీరెవరని ఇంటి యజమానినే అడిగిన దొంగ

నేరేడుచర్ల పట్టణంలో శివాలయం రోడ్డు పక్కన తాళం వేసి ఉన్న ఇంట్లో శుక్రవారం పట్టపగలు ముగ్గురు దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు.

Updated : 22 Jun 2024 06:20 IST

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: నేరేడుచర్ల పట్టణంలో శివాలయం రోడ్డు పక్కన తాళం వేసి ఉన్న ఇంట్లో శుక్రవారం పట్టపగలు ముగ్గురు దొంగలు ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బాధితులు, స్థానికుల వివరాల ప్రకారం.. దొంగలు ఇంట్లో ఉన్న సమయంలో యజమాని భూపాల్‌రెడ్డి, ఆయన భార్య నాగలక్ష్మి ఇంటికి వచ్చారు. వీరిని చూసిన ఇద్దరు దొంగలు ద్విచక్ర వాహనంపై పారిపోయారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేటకు చెందిన గొల్ల మహేష్‌ అనే మరో దొంగ గోడ దూకి పారిపోతుండగా భూపాల్‌రెడ్డి పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు అతడిని తీసుకెళ్లారు. ఇంట్లోకి వచ్చిన ఇంటి యజమాని, ఆయన భార్యను మీరెవరు అని ఓ దొంగ ప్రశ్నించడంతో వారు ఆశ్చర్యపోయారు. ఇంట్లో ఉన్న రూ.80 వేల నగదు, మూడు ఉంగరాలు, రెండు జతల చెవులదిద్దులు కలిపి రెండు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెప్పారు. దొరికిన దొంగ తాను గుంటూరు జిల్లా గురజాలలో దొంగతనం కేసులో జైలులో ఉండి ఇటీవలే విడుదలైనట్లు చెబుతున్నాడు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు ఎస్సై రవీందర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


నీళ్లడిగి.. బంగారు గొలుసు లాక్కొని

దామరచర్ల, న్యూస్‌టుడే: ఓ వ్యక్తి మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఇద్దరు యువకులు సినీ ఫక్కీలో పట్టుబడిన ఘటన శుక్రవారం దామరచర్లలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారి పక్కన గుండా బాలసైదులు కిరాణా దుకాణం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో మిర్యాలగూడకు చెందిన ఇంటర్‌ విద్యార్థులు స్కూటీపై దుకాణం వద్దకు వచ్చారు. వారిలో ఒకరు(17) నీళ్ల బాటిల్‌ కావాలని అడుగుతూ దగ్గరికొచ్చి బాలసైదులు మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కొని అప్పటికే స్యూటీపై సిద్ధంగా ఉన్న మరో యువకుడి(17)తో కలిసి పరారయ్యారు. బాధితుడు కేకలు వేయగా పక్క దుకాణంలో ఉన్న కొందరు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. అక్కడే ఉన్న మాజీ సర్పంచి వెంటనే తన బైక్‌తో వెంబడించి కిష్టాపురం వద్ద ఇరువురిని పట్టుకున్నారు. వారికి దేహశుద్ధి చేసి వాడపల్లి పోలీసులకు అప్పగించారు. సదరు యువకులు మిర్యాలగూడలోని ఓ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని