logo

నిధులు లేక నీరసం

ప్రజారోగ్యం, వైద్య సేవల కొనసాగింపునకు జాతీయ ఆరోగ్యమిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులు కీలకం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ సంస్థ ద్వారా పట్టణ, గ్రామీణ వైద్యం మెరుగు కోసం నిధులు వెచ్చిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Published : 22 Jun 2024 02:33 IST

వైద్య ఆరోగ్య శాఖకు కేంద్రం నుంచి నిలిచిన సాయం

ఎన్‌హెచ్‌ఎం కార్యక్రమంలో వైద్య పరీక్షలు చేస్తున్న దృశ్యం

భువనగిరిగంజ్, న్యూస్‌టుడే: ప్రజారోగ్యం, వైద్య సేవల కొనసాగింపునకు జాతీయ ఆరోగ్యమిషన్‌(ఎన్‌హెచ్‌ఎం) నిధులు కీలకం. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఈ సంస్థ ద్వారా పట్టణ, గ్రామీణ వైద్యం మెరుగు కోసం నిధులు వెచ్చిస్తూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించేందుకు ఎన్‌సీడీ ప్రోగ్రాం, మాతాశిశు మరణాలు తగ్గించేందుకు, క్షయ, కుష్ఠు, టీకాల పంపిణీతో పాటు దాదాపుగా పదికిపైగా కార్యక్రమాలను ఎన్‌హెచ్‌ఎం పథకం కింద అమలు చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా రూ.2.41 కోట్ల బడ్జెట్‌ విడుదలైంది. ఈ ఆర్థిక సంవత్సరం జనవరి నెల నుంచి దాదాపుగా ఎన్‌హెచ్‌ఎం నిధులు నిలిచిపోయాయి. నిధులు కొరత కారణంగా చేపట్టే  ఆరోగ్యకార్యక్రమాలు సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. కొంతమేర నిధులు సర్దుబాటుతో నడిపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే బాలింతలకు అందజేసే ఎంసీహెచ్‌ కిట్స్‌ నిలిచిపోయాయి. ఎంసీహెచ్‌ కిట్లకు ఎన్‌హెచ్‌ఎం నుంచి  60 శాతం మిగతావి రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంటుందని అధికారులు చెబుతున్నారు. నిధులు విడుదల లేకపోవడంతో కొన్ని నెలల నుంచి లబ్ధిదారులకు కిట్లు అందక నష్టపోతున్నారు. 

సర్దుబాటుతో నెట్టుకొస్తున్నారు

జిల్లాలో 21 పీహెచ్‌సీలు, పల్లె దవాఖానాల్లో ఎన్‌హెచ్‌ఎం ద్వారా ఆరోగ్య కార్యక్రమాలు అమలు చేస్తుంటారు. ఐదు నెలల నుంచి బడ్టెట్‌ లేకపోవడంతో ఇతర పథకాల నిధులను సర్దుబాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాంలో జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో 20 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఐదు నుంచి పదిమంది వరకు ఉన్నారు. వారికి వేతనాలు చెల్లింపులో సర్దుబాటు చేస్తున్నారు. కీలకమైన కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికి నిధుల లేమితో అందించే వైద్యసేవల్లో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.

నిధులు పెండింగ్‌లో ఉన్నాయి 

డాక్టర్‌ పాపారావు, జిల్లావైద్యఆరోగ్య అధికారి

జాతీయ ఆరోగ్యమిషన్‌ నిధులు విడుదల పెండింగ్‌లో ఉంది. రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ నుంచి జిల్లాకు ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాంలకు నిధులను ఇస్తుంటారు. నిధుల కొరత ఉన్నా ఆరోగ్య కార్యక్రమాలకు అంతరాయం లేకుండా చూస్తున్నాం.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని