logo

భక్తిశ్రద్ధలతో ఊంజల్‌ సేవోత్సవం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం నిత్యపూజలతో పాటు సంప్రదాయ కైంకర్యాలను ఆలయ ఆచారంగా కొనసాగించారు.

Published : 22 Jun 2024 02:35 IST

అమ్మవారికి సేవా పర్వం నిర్వహిస్తున్న పూజారులు

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం నిత్యపూజలతో పాటు సంప్రదాయ కైంకర్యాలను ఆలయ ఆచారంగా కొనసాగించారు. సూర్యోదయానికి ముందే సుప్రభాతం చేపట్టిన పూజారులు గర్భాలయంలోని స్వయంభువులను మేల్కొల్పి హారతితో కొలిచారు. గోవుపాలతో నిజాభిషేకం నిర్వహించాక, తులసీదళాలతో అర్చన చేపట్టారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనమూర్తులను సువర్ణ పుష్పాలతో అర్చించారు. ఆలయ మహాముఖ మండపంలో యజ్ఞమూర్తులను ఆరాధిస్తూ స్వర్ణ పుష్పాలతో అర్చన క్రతువుని కొనసాగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ కైంకర్యంలో భక్తులు పలువురు పాల్గొని ఆశీస్సులు పొందారు. అష్టభుజి మండప ప్రాకారంలో శ్రీ సుదర్శన నారసింహహోమం, శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్యకల్యాణం పాంచరాత్రాగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. కల్యాణమూర్తులను గజ వాహనంపై అలంకృతులను చేసి, సేవా పర్వం చేపట్టారు. సాయంత్రం అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో తీర్చిదిద్ది ఊంజల్‌ సేవా నిర్వహించారు. అద్దాల మండపంలో వేద మంత్ర పఠనాల మధ్య అలంకరించిన అమ్మవారిని ఊంజలిపై అధిష్ఠింపజేసి సేవా పర్వాన్ని నిర్వహించారు. నిత్య ఆర్జిత పూజల్లో భాగంగా శ్రీస్వామి, అమ్మవార్ల అలంకార సేవలు మాడవీధుల్లో ఊరేగించారు. రాత్రి స్వయంభువులను ఆరాధిస్తూ ప్రత్యేక ఆరాధన, సహస్రనామార్చన జరిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని