logo

ఉద్యోగంలో రాణిస్తూ.. గుర్తింపు సాధిస్తూ

మహిళలు పట్టుదలకు ప్రతీకలు. ఆధునిక యుగంలో వారు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు.

Updated : 22 Jun 2024 06:18 IST

నేరేడుచర్ల, న్యూస్‌టుడే: మహిళలు పట్టుదలకు ప్రతీకలు. ఆధునిక యుగంలో వారు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ ఔరా అనిపిస్తున్నారు. కష్టపడి ఉన్నత చదువులు చదివిన అతివలు కొందరు ప్రభుత్వ కొలువులు సాధించి సత్తా చాటుతున్నారు. అంకితభావంతో ఉద్యోగం చేస్తూ వృత్తిలో ప్రశంసలందుకుంటున్నారు.

నాన్న కోరిక నెరవేర్చా: - దేవిరెడ్డి సౌమ్యశ్రీ 

మాది చౌటుప్పల్‌ మండలం గొల్లగూడెం గ్రామం. వ్యాపారం చేసే మా నాన్న నర్సిరెడ్డికి నేను డాక్టర్‌ కావాలన్న కోరిక ఉండేది. అమ్మ అపర్ణ సైతం ప్రోత్సహించింది. సంగారెడ్డిలోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశా. 2023లో నేరేడుచర్ల పీహెచ్‌సీలో వైద్యురాలిగా ఉద్యోగంలో చేరా. పీడియాట్రిక్, రేడియాలజీ రెండింటిలో ఏదో ఒక దానిలో పీజీ చేయాలన్నది లక్ష్యం. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు సేవచేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నా. కష్టపడితే ఉద్యోగ సాధన సులువే.

సర్కారు కొలువు చేయాలని..: - మల్లవరం మౌనిక 

మాది మెదక్‌ జిల్లా. నేను ఎం.టెక్‌ చదివా. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న తపనతో గ్రూప్‌ పరీక్షలపై దృష్టి పెట్టా. గ్రూప్‌-2లో 2020లో ఉపతహసీల్దార్‌ ఉద్యోగం సాధించా. సంవత్సరం పాటు సూర్యాపేటలో ట్రైనీగా పనిచేశా. తర్వాత మోతెలో ఉద్యోగంలో చేరా. గరిడేపల్లిలో మూడేళ్లు డీటీగా పనిచేసి 2024లో నేరేడుచర్లకు బదిలీపై వచ్చా. గ్రూప్స్‌ రాసేందుకు పుస్తకాలు చదివి సొంతంగా నోట్స్‌ తయారు చేసుకున్నా. అవగాహన కోసం ఎనిమిది నెలలపాటు శిక్షణ తీసుకున్నా. పోటీని ఎలా తట్టుకోవాలో తెలుసుకోవడానికి ఈ శిక్షణ ఉపయోగపడింది.

రైతులకు సేవలు - తుర్కెల్‌ సన్నీ 

మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేను ఎంకాం చదివా. హిందీ పండిట్‌ కోర్సు సైతం పూర్తి చేశా. ఉద్యోగాన్వేషణలో ఉండగా 2007లో వ్యవసాయ మార్కెట్‌లో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న మా నాన్న మరణించారు. దీంతో నేను కొత్తగూడెంలో ఎల్‌డీసీగా ఉద్యోగంలో చేరా. మాది పెద్ద కుటుంబం. ఐదుగురం అమ్మాయిలం. మాకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. నాన్న ఉద్యోగంపైనే జీవనం. నాన్న చనిపోయే ముందు ముగ్గురు చెల్లెళ్ల బాధ్యత నాకు అప్పగించారు. భర్త సహకారంతో వారు జీవితంలో స్థిరపడేలా చేయగలిగా. 2010లో ఖమ్మం మార్కెటింగ్‌శాఖలో సూపర్‌వైజర్‌గా, 2019లో వైరా మార్కెట్‌లో అసిస్టెంట్‌ సెక్రటరీగా, 2021లో గ్రేడ్‌-3 సెక్రటరీగా బూర్గంపహాడ్‌ మార్కెట్‌లో, 2023 నుంచి గ్రేడ్‌-2 సెక్రటరీగా నేరేడుచర్ల మార్కెట్‌లో రైతులకు సేవలందిస్తున్నా. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని