logo

దిగుబడి తగ్గి.. దిగుమతి పెరిగి..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. జిల్లాలో కూరగాయల దిగుబడి తగ్గడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.

Published : 22 Jun 2024 02:41 IST

ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు

మిర్యాలగూడలోని రైతుబజార్‌

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. జిల్లాలో కూరగాయల దిగుబడి తగ్గడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల వర్షాల కారణంగా ఆయా ప్రాంతాల్లో సైతం పంట పాడై దిగుబడి తక్కువగా ఉండడంతో ధరలు మండి పోతున్నాయి. ప్రస్తుతం పంటల సాగుకు రైతులు, విద్యాసంస్థల ప్రారంభంతో అన్ని కుటుంబాలు ఆర్థికంగా చతికిలపడుతున్నాయి. ఈ తరుణంలో కూరగాయల ధరలు పెరగడం మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగానే ఉందని ఉమ్మడి జిల్లా ప్రజలు వాపోతున్నారు. 

దిగివచ్చిన పచ్చిమిర్చి..

గత నెలతో పోలిస్తే జిల్లాలో అన్ని రకాల కూరగాయల ధరలు పెరగగా.. పచ్చిమిర్చి ధర మాత్రం స్వల్పంగా తగ్గి ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించింది. గత నెలలో కిలో పచ్చిమిర్చి రూ.120 ఉండగా.. ప్రస్తుతం రూ.70కి చేరింది. బీరకాయ, చిక్కుడు కిలో రూ.వందకు చేరి పేద, మధ్య తరగతి ప్రజలు కొనే పరిస్థితి లేకుండా పోయింది. వారం క్రితం రూ.20 మాత్రమే ఉండగా.. ప్రస్తుతం రూ.80కి చేరింది. పచ్చిమిర్చి, టమాట ఉంటే చాలు పూట గడుస్తుందనుకునే సాధారణ ప్రజలకు ఈ రెండు కలిపి రూ.150 ఉండడంతో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇవి కూరగాయల మార్కెట్లు, రైతుబజార్లలో ధరలు మాత్రమే.. బయట విడిగా రూ.5-10 వరకు అదనంగా ఉన్నాయి. 

దిగుబడి తగ్గడంతోనే..

ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగు అంతంత మాత్రంగానే ఉంటుంది. నల్గొండలో మూడు వేల ఎకరాలు, యాదాద్రి జిల్లాలో 1,300 ఎకరాలు, సూర్యాపేట జిల్లాలో 2వేల ఎకరాల్లో కూరగాయలు సాగవుతాయని అధికారుల అంచనా. అయితే ఈ వేసవిలో ఎండలు అధికంగా ఉండడంతో పాటు నీటి ఎద్దడి కారణంగా సాగు చేసేందుకు రైతులు వెనుకాడుతున్నారు. దీంతో జూన్, జులై నెలల్లో కూరగాయల ధరలు అమాంతం పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో దిగుమతిపై ఆధారపడుతుంటారు. టమాటను మదనపల్లి నుంచి దిగుమతి చేసుకుంటుండగా.. ఇటీవల వర్షాలతో పంట పాడై పోయి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. 

రూ.500 తీసుకెళ్తే వారానికొచ్చేట్టు లేవు..

మారం వెంకన్న, మిర్యాలగూడ

గత నెలతో పోలిస్తే కూరగాయల ధరలన్నీ పెరిగిపోయాయి. రూ.500 తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చే పరిస్థితి లేదు. దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలను అదుపు చేయాలి. 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని