logo

డిజిటల్‌ చిక్కులకు అవగాహన ముఖ్యం

పెద్ద నోట్ల రద్దు తర్వాత క్రమంగా మారుమూల పల్లెల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి. స్మార్ట్‌ ఫోన్లు, అంతర్జాల సేవలు చౌకగా అందుబాటులోకి రావడంతో ప్రజలు త్వరగా ఆన్‌లైన్‌ లావాదేవీలకు అలవాటు పడ్డారు.

Updated : 22 Jun 2024 06:17 IST

నాంపల్లి మండలానికి చెందిన ఒకరు రూ.500లతో డీటీహెచ్‌ రీఛార్జ్‌ చేసుకున్నారు. ఎంతసేపు ఎదురుచూసినా పేమెంట్ పెండింగ్‌ అని వస్తోంది. తీరా ఖాతాలో చూస్తే సొమ్ము చెల్లించినట్లు చూపిస్తోంది. రీఛార్జి మాత్రం పూర్తవలేదు. సమస్య ఏంటనేది అర్థం కాలేదు.

నాంపల్లి మండల కేంద్రంలోని ఓ వస్త్ర దుకాణంలో ఇటీవల దేవరకొండ మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వచ్చి రూ.5 వేల విలువైన దుస్తులు కొనుగోలు చేశారు. చరవాణి ద్వారా చెల్లింపులు జరిపి వెళ్లిపోయారు. తీరా దుకాణదారు ఖాతాలో చూసుకుంటే డబ్బు జమ కాలేదు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు ఆరా తీయగా.. డబ్బు చెల్లించినట్లు చరవాణికి తప్పుడు సందేశాలు పంపుతున్న ముఠాగా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

చండూరు మండల కేంద్రంలోని కిరాణదుకాణంలో సరకులు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి యూపీఐ ద్వారా చెల్లింపులకు ప్రయత్నిస్తే విఫలమైనట్లు సందేశం వచ్చింది. కానీ, ఖాతాలో సొమ్ము ఖాళీ అయింది. చివరకు నగదు చెల్లించాల్సి వచ్చింది.

నాంపల్లి, న్యూస్‌టుడే: పెద్ద నోట్ల రద్దు తర్వాత క్రమంగా మారుమూల పల్లెల్లోనూ డిజిటల్‌ చెల్లింపులు పెరిగాయి. స్మార్ట్‌ ఫోన్లు, అంతర్జాల సేవలు చౌకగా అందుబాటులోకి రావడంతో ప్రజలు త్వరగా ఆన్‌లైన్‌ లావాదేవీలకు అలవాటు పడ్డారు. ప్రభుత్వం ఈ లావాదేవీలను క్రమబద్ధం చేయడానికి నేషనల్‌ పేమెంట్ కార్పొరేషన్‌(ఎన్‌పీసీఐ) ద్వారా యూనిఫైడ్‌ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ)ను ఉపయోగించి ఆన్‌లైన్‌ చెల్లింపులను సౌకర్యవంతం చేసింది. బ్యాంకులు ప్రత్యేక యాప్‌లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. బ్యాంకుల్లోని ఆర్టీజీఎస్, నెఫ్ట్, ఐఎంపీఎస్‌ ద్వారా నగదు బదిలీ కంటే యూపీఐ చెల్లింపులు సులువుగా ఉండటంతో ఆదరణ పెరిగింది. కొన్ని సాంకేతిక సమస్యలతో చెల్లింపుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు వినియోగదారులను అయోమయానికి గురిచేస్తున్నాయి.

నగదు పోతే ఫిర్యాదు చేయాలి..

సాధారణంగా యాప్‌ల ద్వారా జరిపే లావాదేవీలు విఫలమైనప్పుడు ఖాతా నుంచి వెళ్లిన సొమ్ము తిరిగి రావడానికి 27 నుంచి 72 గంటల సమయం పడుతుంది. అలా జరగని పక్షంలో నేరుగా సంబంధిత బ్యాంకుకు వెళ్లి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి. వారు పరిశీలించి నగదు ఎక్కడ ఆగిందో గుర్తించి డబ్బు తిరిగి చెల్లించే ఏర్పాటు చేస్తారు. వారంలో పరిష్కారం కాకుంటే ఆయా బ్యాంకుల అంబుడ్స్‌మెన్లకు ఫిర్యాదు చేస్తే పరిష్కరిస్తారు.

కారణాలివీ..

ఆన్‌లైన్‌ చెల్లింపులకు అంతరాయం లేని అంతర్జాల సేవలు ఉన్నప్పుడే యాప్‌లు సమర్థంగా పనిచేస్తాయి. మధ్యలో అంతర్జాలం వేగం తగ్గినా, పూర్తిగా ఆగిపోయినా విఫలమవుతుంటాయి. పేమెంట్ యాప్‌ ఏదైనా కేవలం రెండు బ్యాంకులు, ఖాతాదారుల మధ్య వారధిగా పనిచేస్తుంది. చెల్లింపులు జరిగే సమయంలో రెండు బ్యాంకుల సర్వర్లు సరిగా పనిచేస్తేనే పేమెంట్ సాఫీగా పూర్తవుతుంది. సర్వర్, నెట్వర్క్‌లో అంతరాయం ఏర్పడితే చెల్లింపులు నిలిచిపోతాయి. 

అప్రమత్తత అవసరం..

లావాదేవీలను విఫలమైన సమయంలో వచ్చే సందేశాలను పూర్తిగా చదివితే సమస్య అర్థమవుతోంది. పల్లెల్లో చాలా మందికి ఆంగ్ల భాషలో వచ్చే సందేశాలు చదవడం, అర్థం కావడం రాదు. సాంకేతిక సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ప్రతి యూపీఐ యాప్‌లో దిగువన సపోర్ట్‌ అండ్‌ హెల్ప్‌ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాన్ని ఎంపిక చేసుకోగానే ఫిర్యాదు స్వీకరిస్తుంది. లావాదేవీల వివరాలు, తలెత్తిన సమస్యను నమోదు చేస్తే మూడు రోజుల్లో నగదు ఖాతాలో జమవుతుంది. లేకుంటే బ్యాంకులకే వెళ్లి ఫిర్యాదు చేయాలి. యాప్‌ల కస్టమర్‌ కేర్‌ నంబర్ల కోసం ఆన్‌లైన్‌లో వెతికితే సైబర్‌ నేరగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని