logo

బడి ప్రయాణం భద్రమేనా!

పాఠశాలలు ప్రారంభం కావడం, బడిగంటలు మోగడం, రోడ్లమీద చిన్నారుల రాకపోకలు, పాఠశాలలు వదిలే సమయానికి రోడ్లన్నీ కిక్కిరిసి ఉండటం నిత్యం చూస్తూనే ఉన్నాం.

Published : 22 Jun 2024 02:46 IST

ప్రమాదకర పరిస్థితుల్లో చిన్నారుల రాకపోకలు

రాజపేటలోని వివేకానంద కూడలిలో బస్సు కోసం నిరీక్షిస్తున్న విద్యార్థులు 

రాజపేట, భువనగిరి, న్యూస్‌టుడే: పాఠశాలలు ప్రారంభం కావడం, బడిగంటలు మోగడం, రోడ్లమీద చిన్నారుల రాకపోకలు, పాఠశాలలు వదిలే సమయానికి రోడ్లన్నీ కిక్కిరిసి ఉండటం నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు.. వెరసి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా తరచూ ప్రమాదాలు జరిగిన సంఘటనలూ లేకపోలేదు.  స్థానికంగా బడిలేకపోయినా దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్న చిన్నారులు ఎందరో ఉన్నారు. బస్సులు లేకపోవడం పెను సమస్యగా మారుతుంది. సురక్షితమైన ప్రయాణం లేక, ప్రైవేటు వాహనాల్లో ప్రమాదకరంగా వెళ్తున్నారు. కొందరు సైకిళ్లు, మరికొందరు ద్విచక్రవాహనాలు, మరికొందరు నడుచుకుంటూ వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు.

పాఠశాల నుంచి తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో వాహనంలో ప్రమాదకరంగా ప్రయాణం ఇలా..  

ఉన్నత విద్యకు తప్పని ప్రయాణం..

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా సుమారు 3,208 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. 2.12 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుకుంటున్న వారికి సదరు పాఠశాల బస్సు సదుపాయం ఉండగా, ఆర్థికంగా ఇబ్బంది అనుకున్న వారూ తంటాలు పడాల్సిందే. తాము నివాసం ఉంటున్న పల్లెల్లో ఉన్నత పాఠశాలలు, కళాశాలలు లేక విద్యార్థులు కొందరు ఆర్టీసీ బస్సు, మరికొందరు ఆటోలు, ఇతర ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నారు. ఇలా ఉన్నత విద్యకు నిత్యం వేలాది మంది రోడ్లపై వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ప్రభుత్వం ప్రతినెలా రూ.600 చొప్పున రవాణా భత్యం ఇవ్వాల్సి ఉండగా, గత నాలుగేళ్లుగా అందించడం లేదని తెలుస్తోంది. ఫలితంగా సదరు కుటుంబాలపై ఆర్థిక భారం పడుతుందనేది వాస్తవం.

అర కొరగా బస్సుల సదుపాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, నల్గొండ, యాదగిరిగుట్ట, కోదాడ, సూర్యాపేట, దేవరకొండ, నార్కట్‌పల్లి లాంటి ఆర్టీసీ డిపోలున్నప్పటికీ తగినన్ని బస్సులు లేక చాలా రూట్లలో కొంతకాలంగా బస్సు సదుపాయం లేదన్నట్లుగా సమాచారం. దీనికితోడు ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తుండటంతో విద్యార్థులకు సీట్లు దొరకడం లేదు. ఫుట్‌బోర్డుపై వేలాడుతూ గమ్యానికి చేరుకుంటున్న సంఘటనలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులు అధ్వానంగా ఉండటం వల్ల ఆటోలు ప్రమాదానికి గురవుతున్నాయి. 

ఇలా చేస్తే కొంతమేర ప్రయోజనకరం.. 

విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ అధికారులు, విద్యాశాఖ సమన్వయంతో పిల్లల సంఖ్యకు, సమయానికి అనుగుణంగా బస్సులను నడపాలి. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి సర్కారు బడి ఉండని పల్లె కనిపించొద్దు అనే నినాదంతో ముందుకెళ్తున్న తరుణంలో ఆర్టీసీ అధికారులు కూడా బస్సు సదుపాయం లేని పల్లెలు ఉండకుండా చర్యలు తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థుల పాఠశాల సమయానికి అనుగుణంగా బస్సు సదుపాయం లేక, పాఠశాల విడిచిపెట్టే సమయానికి ఆర్టీసీ బస్సు లేక గంటల తరబడి రోడ్లపైన ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. ఇక రోడ్డు దాటే సమయంలో మరీ చిన్నారులపట్ల అప్రమత్తంగా ఉండాలని పలువురు సామాజిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని