logo

ఎప్పుడొస్తుందో.. అన్నపూర్ణ

 సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రూ.5 భోజన పథకం అభాసుపాలవుతోంది. మూడు జిల్లాల్లో 19 పురపాలికలు ఉండగా..

Updated : 22 Jun 2024 06:16 IST

అభాగ్యులకు అందని రూ.5 భోజనం

సూర్యాపేటలో మూతబడిన రూ.5 భోజన పంపిణీ కేంద్రం

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రూ.5 భోజన పథకం అభాసుపాలవుతోంది. మూడు జిల్లాల్లో 19 పురపాలికలు ఉండగా.. మూడింట మాత్రమే అమలవుతోంది. మిగతా వాటిల్లో ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. రూ. 5కే భోజనం అందించే ‘అన్నపూర్ణ’ పథకాన్ని రెండేళ్ల క్రితం పురపాలికల్లో ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కమిషనర్లకు ఉత్తర్వులు కూడా జారీ చేశారు. తర్వాత పథకం జాడలేకుండా పోయింది.

నాలుగు చోట్ల ప్రారంభం.. రెండింట అమలు

ఉమ్మడి జిల్లాలోని పట్టణాలకు నిత్యం వివిధ పనుల నిమిత్తం ప్రజలు రోజూ వేలల్లో వచ్చి వెళ్తుంటారు. ముఖ్యంగా ఉదయం వచ్చి సాయంత్రం పనులు పూర్తయ్యే వరకు అక్కడే ఉంటుంటారు. హోటళ్లలో మధ్యాహ్న భోజనం చేయాలంటే కనీసం రూ.80 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత ఖర్చు చేయలేని వారు రూ.30-40 వెచ్చించి అల్పాహారం తింటుంటారు. పట్టణాలకు వచ్చే గ్రామీణులు, స్థానిక మురికివాడలు, రోడ్ల పక్కన నివసించే వారు భోజనానికి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆపన్నుల ఆకలి తీర్చడానికి ఉమ్మడి జిల్లాలోని కోదాడ, భువనగిరి, నల్గొండ, సూర్యాపేట పురపాలికలో తొలుత అన్నపూర్ణ పథకాన్ని ప్రారంభించారు. సూర్యాపేటలో కొంతకాలం నిర్వహించారు. ఆ తర్వాత నిర్వహణ భారంతో మూసివేశారు. భువనగిరిలోనూ నిలిపివేశారు. ప్రస్తుతం కోదాడ, నల్గొండలోనే ఆ పథకం కొనసాగుతోంది. మిగతా 15 పురపాలికల్లోనూ పథకాన్ని ప్రారంభించాలని ప్రజలు కోరుతున్నారు.

హడావుడితో సరి

అన్నపూర్ణ పథకం అమలుకు రెండేళ్ల క్రితం వివిధ సంస్థల సహకారాన్ని తీసుకోవాలని పుర సంచాలకుడు ఆయా పుర కమిషనర్లకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేశారు. దీనికి అనుగుణంగా కమిషనర్లు అప్పట్లో హడావుడి చేశారు. పట్టణంలో ఎక్కడెక్కడ ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని స్థలాలను ఎంపిక చేశారు. ఒక్క కేంద్రంలో సుమారు 200 మంది నిరుపేదలు రూ.5కు భోజనం అందుకుంటారని నిర్ణయించారు. కానీ, నేటికీ ఏర్పాటు చేయలేదు.

ప్రారంభానికి చర్యలు తీసుకుంటాం

శ్రీనివాస్, పుర కమిషనర్, సూర్యాపేట

సూర్యాపేటలో రూ.5 భోజన పథకం అమలు నిలిపివేశాం. ఉన్నతాధికారులకు విన్నవించి వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటాం. పేదలు, రోజువారీగా వచ్చే ప్రయాణికులు ఆకలికి ఇబ్బందులు పడకుండా చూస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని