logo

డిండి ఆయకట్టులో అయోమయం

తొలకరి వర్షాలు కురవడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. డిండి జలాశయం ఆయకట్టుకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.

Published : 22 Jun 2024 02:55 IST

శిథిలావస్థకు చేరిన నాలుగో డిస్ట్రిబ్యూటర్‌ తలుపులు

డిండి, న్యూస్‌టుడే: తొలకరి వర్షాలు కురవడంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. డిండి జలాశయం ఆయకట్టుకు నీటిని ఎప్పుడు విడుదల చేస్తారో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో గత ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా 32 అడుగుల వరకు నింపింది. వేసవిలో దేవరకొండ, చందంపేట, నేరడుకొమ్ము, డిండి మండలాలతో పాటు తాగునీటి సమస్యను తీర్చేందుకు మూడు అడుగుల మేర నీటిని దిగువకు విడుదల చేసి 16 కుంటలు, చెరువులను నింపారు. ప్రస్తుతం జలాశయంలో 26.9 అడుగుల (1.3 టీఎంసీల) మేర నీరు నిల్వ ఉంది. జలాశయం ఎడమ కాల్వ కింద 12,500 ఎకరాల ఆయకట్టు ఉండగా అనధికారికంగా 20 వేల ఎకరాలకు పైగా భూములు పంటలు సాగవుతున్నాయి. నీటిని విడుదల చేస్తే పంటలు సాగుచేసే యోచనలో రైతులు ఉన్నారు. 

డిస్ట్రిబ్యూటర్ల తలుపు అంతంతే... 

జలాశయ ఎడమ కాల్వలకు సుమారు 19 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. వీటిలో సగానికిపైగా తలుపులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రధాన కాల్వ లైనింగ్‌ రాళ్లు ఊడిపోయి నీళ్లు లీకయ్యే ప్రమాదం ఉంది. వానాకాలం సీజన్‌లో సాగునీటిని విడుదల చేస్తామని చెప్పిన అధికారులు పిల్ల కాల్వలో ముళ్ల పొదలు, డిస్ట్రిబ్యూటర్లకు మరమ్మతులు చేపట్టడంలో అశ్రద్ధ వహిస్తున్నారు. ఏటా మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేపట్టడం లేదు. దీంతో నిధులు వెనక్కి వెళ్తున్నాయి. ఫలితంగా పంట పొలాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదు.

సాగు నీరందిస్తాం

శ్రీధర్‌రావు, నీటిపారుదలశాఖ ఈఈ, డిండి 

డిండి ఆయకట్టుకు ఈనెల చివరివారంలో సాగునీటిని విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. డిస్ట్రిబ్యూటర్ల తలుపు బిగించేందుకు రూ.10 లక్షలతో టెండర్లు పిలిచి గుత్తేదారుకు అప్పగించాం. ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరివ్వగలమనే నమ్మకంతో ఉన్నాం. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి.

పిల్లకాల్వలు ధ్వంసమయ్యాయి

మైనొద్దీన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు 

డిండి జలాశయం నీరు ప్రధాన కాల్వలకే పరిమితమవుతున్నాయి. పిల్లకాల్వలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. నీరు సక్రమంగా విడుదల చేయకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందక పంటలు ఎండిపోయి నష్టపోతున్నాం. డిండి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాలి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని