logo

ధరణి.. దారికొస్తోంది..!

సుమారు ఆరు నెలల తర్వాత ధరణి సమస్యల పరిష్కారానికి మోక్షం లభించనుంది. ఎన్నికల కోడ్‌ ముగియడం, జిల్లాలకు కొత్త కలెక్టర్లు రావడంతో పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

Published : 22 Jun 2024 02:57 IST

ఈనాడు, నల్గొండ : సుమారు ఆరు నెలల తర్వాత ధరణి సమస్యల పరిష్కారానికి మోక్షం లభించనుంది. ఎన్నికల కోడ్‌ ముగియడం, జిల్లాలకు కొత్త కలెక్టర్లు రావడంతో పెండింగ్‌లో ఉన్న ధరణి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో ఉన్నతాధికారులు సంబంధిత శాఖ సిబ్బంది, అధికారులతో సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయి పరిస్థితిని ఆరా తీస్తున్నారు. రాష్ట్రంలోనే అత్యధికంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అటవీ, రెవెన్యూ భూముల సరిహద్దు వివాదాలున్నాయి. కృష్ణపట్టి ప్రాంతంలోనే సుమారు 40 వేల ఎకరాల్లో వివాదాలు ఉండటంతో పాటూ చాలా వాటికి రికార్డులూ లేవు. యాదాద్రి జిల్లాలో పోడు భూములతో పాటూ కాందిశీకుల భూములపై సమస్యలున్నాయి. దీంతో మిస్సింగ్‌ సర్వే నెంబర్లు, మ్యూటేషన్లు, కోర్టు కేసులున్న వాటిని జాగ్రత్తగా పరిశీలించి చెక్‌లిస్టు రాయాలని ఉన్నతాధికారులు తహసీల్దార్లను ఆదేశించారు. నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా 16,733 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా..సూర్యాపేటలో 7,293, యాదాద్రిలో 8,342 దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో గత నాలుగు నెలలుగా పోర్టల్‌లో నమోదైన అర్జీలు పరిష్కారానికి నోచుకోకపోవడంతో పెండింగ్‌ దరఖాస్తుల సంఖ్య పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ధరణి పోర్టల్‌లో టీఎం 33కి సంబంధించి గత ప్రభుత్వం తహసీల్దార్లు, ఆర్డీవోలకు కొన్ని ఐచ్ఛికాలే ఇవ్వడంతో దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం నెలకొంటోంది. 

  • మరోవైపు ప్రధానంగా ధరణిలో వచ్చే అర్జీలు నిషేధిత భూముల జాబితాకు సంబంధించినవే ఎక్కువగా ఉంటున్నాయని రెవెన్యూ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉదాహరణకు ఒక సర్వే నెంబరులోని ఐదెకరాల భూమిని రికార్డుల ప్రక్షాళన సందర్భంగా నిషేధిత భూముల జాబితాలో పెడితే.. ఆ నెంబరులో ఉన్న వందల ఎకరాలు సైతం నిషేధిత జాబితాలో చేరి క్రయవిక్రయాలకు నోచుకోవడం లేదు. ఇది పరిష్కారం కావాలంటే సంబంధిత రైతులు కలెక్టరు, సీసీఎల్‌ఏ వరకు వెళ్లాల్సి వస్తోంది. మరోవైపు పట్టాదారు పాసుపుస్తకంలో పేరు తప్పుపడటం, విస్తీర్ణంలో హెచ్చుతగ్గులు, మిస్సింగ్‌ సర్వే నెంబర్లకు సైతం భారీగా అర్జీలు వచ్చాయని తెలిసింది. ఇందులో ఎక్కువగా టీఎం 33కి సంబంధించినవే మూడు జిల్లాల్లో కలిపి 20 వేల వరకు ఉన్నట్లు సమాచారం. సూర్యాపేట జిల్లాలో రెవెన్యూ, అటవీ భూములకు సంబంధించిన అర్జీలు ఎక్కువగా రాగా..యాదాద్రి జిల్లాలో పోడు సమస్యలకు సంబంధించి దరఖాస్తులు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెలాఖరులోగా అన్ని అర్జీలు పరిష్కారం అయ్యేలా మూడు జిల్లాల అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. 

తహసీల్దార్ల వద్దే ఎక్కువ 

అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులు ఎక్కువగా క్షేత్రస్థాయిలోని తహసీల్దార్ల వద్దే ఉన్నాయి. ఉదాహరణకు నల్గొండ జిల్లాలో మొత్తం 16,733 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా..తహసీల్దార్ల వద్దే 10 వేలకు పైగా దరఖాస్తులున్నాయి. ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా ఉండటం, అంతకుముందు బదిలీలతో పరిష్కార ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొంది. మరికొన్ని ఆర్డీవోల లాగిన్‌లో ఉన్నాయి. చాలా తక్కువ సంఖ్యలోనే కలెక్టర్ల లాగిన్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశం మేరకు మూడు జిల్లాల కలెక్టర్లు నారాయణరెడ్డి, తేజస్‌ నందలాల్, హనుమంత్‌ జెండగేలు ధరణి సమస్యల పరిష్కారాన్ని ప్రాధాన్యతా అంశంగా తీసుకోవాలని తహసీల్దార్లకు సూచించారు. 

వీలైనంత త్వరగా పరిష్కారం

ధరణి పెండింగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని తహసీల్దార్లను ఆదేశించాం. అన్ని వివరాలు సమగ్రంగా పరిశీలించి చెక్‌లిస్టులు రాయాలని చెప్పాం. నెల రోజుల్లో అర్జీలన్నీ పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. 

నారాయణరెడ్డి, కలెక్టర్, నల్గొండ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని