logo

గాడి తప్పుతున్న మైనర్లు

మైనర్లు.. అంటే 18 ఏళ్ల లోపు వయసు కలిగిన పిల్లలు. ఈ వయసులో చదువు, ఆటలు, స్నేహితులు, ఇల్లు ఇదే వారి లోకం.. ఇలాగే ఉండాలి. కానీ, ఇటీవల వీరు వయసుకు మించిన పనులు చేస్తున్నారు.

Updated : 11 Jul 2024 05:37 IST

ఈ చిత్రంలో నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాలు ఏదో పార్కింగ్‌ స్థలంలోనివి అనుకుంటే మీరు పొరపడినట్లే.. నాంపల్లి ఆదర్శ పాఠశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు వెళ్లే మైనర్‌ విద్యార్థులు స్వయంగా నడుపుకొంటూ తీసుకొచ్చినవి. ఒక్కో వాహనంపై ముగ్గురు చొప్పున రోజూ రాకపోకలు సాగిస్తారు. రాత్రి వరకూ చక్కర్లు కొడతారు.  ప్రమాదం జరిగితే ‘కన్న’ కలలు కలలే అనే విషయం కన్నవారు గుర్తిస్తే మేలు.

‘ఇటీవల మునుగోడు మండలంలో ఓ మైనర్‌ బాలుడు ట్రాక్టర్‌ నడుపుతూ దానికింద పడి ప్రాణాలు కోల్పోయాడు. చిన్న వయసులోనే ట్రాక్టర్‌ సైతం నడుపుతున్నాడని మురిసిన తల్లిదండ్రులకు చివరకు విషాదం మిగిలింది.

నాంపల్లి మండలంలో ఒక్కగానొక్క కుమారుడిని అతి గారాబంగా పెంచిన కన్నవారు.. అతడి మారాం తట్టుకోలేక గతేడాది ద్విచక్రవాహనం అతని చేతికొదిలేశారు. దాంతో వాహన మోజులోపడి దురాలవాట్లకు చేరువై.. రోడ్డు ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్నాడు.  

నాంపల్లి, న్యూస్‌టుడే: మైనర్లు.. అంటే 18 ఏళ్ల లోపు వయసు కలిగిన పిల్లలు. ఈ వయసులో చదువు, ఆటలు, స్నేహితులు, ఇల్లు ఇదే వారి లోకం.. ఇలాగే ఉండాలి. కానీ, ఇటీవల వీరు వయసుకు మించిన పనులు చేస్తున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటంతో ధూమపానం, మద్యానికి అలవాటు పడుతూ ద్విచక్ర వాహనాలపై విన్యాసాలు చేస్తున్నారు. ఒకప్పుడు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఈ పోకడ నేడు పల్లెలకూ పాకుతోంది. పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం తల్లిదండ్రులకు తెలియాలి. తమ కుమారుడు ఎలా ఉన్నాడు.. మనస్తత్వం ఎలా మారుతోంది. తన మిత్రులతో ఎటు వెళ్తున్నాడు. ఇలాంటి విషయాలను ఆరా తీస్తూ గాడిన పెట్టాల్సి. కానీ ప్రస్తుతం పాఠశాల, కళాశాలకు వెళ్లే పిల్లలకు స్వయాన తల్లిదండ్రులే ద్విచక్ర వాహనాలు ఇచ్చి పంపుతున్నారంటే వారి బాధ్యతారాహిత్యం ప్రస్పుటంగా కనిపిస్తోంది.

ప్రచారం చేస్తున్నా ఫలితం శూన్యం

మైనర్లు తెలిసీ తెలియని వయసులో దురాలవాట్లకు దగ్గరవుతున్నారు. వాహనాలపై చక్కర్లు కొడుతున్నారు. వేగంగా దూసుకుపోతూ ఆనందపడుతున్నారు. అనుకోని ఘటన జరిగి, రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఆ ఆనందం కాస్తా ఆవిరవుతుంది. వచ్చీరానీ డ్రైవింగ్‌తో ఎదుటి వ్యక్తి బలి కావొచ్చు. ఇటీవల మైనర్‌ డ్రైవింగ్‌లపై దృష్టి పెట్టిన పోలీసులు మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని ప్రచారం చేస్తున్నా ఫలితం కనిపించకపోవడం గమనార్హం.

పెద్దలపైనా కేసులు

- నవీన్‌కుమార్, సీఐ, నాంపల్లి

మైనర్లు వాహనాలు నడపడం చట్టప్రకారం నేరం. ఇలాంటి ఘటనల్లో మైనర్లతో పాటు వారికి వాహనాలు ఇచ్చిన పెద్దలపైనా కేసులు పెడతాం. పిల్లల కదలికలను తల్లిదండ్రులు గమనించకపోతే వారి భవిష్యత్తు నిరర్ధకం చేసిన వారవుతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని