logo

జనహితం.. సంక్షేమ సంతకం

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రత్యేక దృష్టిసారించారు.

Published : 14 Jun 2024 03:21 IST

హామీల అమలు దిశగా ప్రభుత్వం అడుగులు
చంద్రబాబు నిర్ణయాలపై హర్షం

ఈనాడు, నెల్లూరు: కలెక్టరేట్, విద్య, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు.. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రత్యేక దృష్టిసారించారు. ముందే చెప్పినట్లు అయిదు ప్రాధాన్య హామీలపై సంతకాలు చేసి.. వాటి అమలుకు శ్రీకారం చుట్టారు. మొదటి సంతకం మెగా డీఎస్సీపై పెట్టగా, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ రద్దు, రూ. నాలుగువేలకు పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణనపై సంతకాలు పెట్టారు. దీంతో జిల్లాలో నిరుద్యోగులు, రైతులు, పింఛనుదారులు, నిరుపేదలకు లబ్ధి చేకూరనుండగా- ఆయా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు చేసిన అయిదు సంతకాలు ప్రజల జీవన ప్రమాణం మెరుగుపడటానికి, అభివృద్ధికి దోహదపడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.


కొలువుల కల..నెరవేరేలా..

త అయిదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగుల కలను చంద్రబాబు నెరవేర్చనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ ప్రకారం.. తొలి సంతకం మెగా డీఎస్సీపై పెట్టడం దాదాపు వేలమంది నిరుద్యోగుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఏటా జాబ్‌ క్యాలెండర్‌తో పాటు డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తానని దగా చేశారు. ఫలితంగా జిల్లాలోని ఒక ప్రభుత్వ, 13 ప్రైవేటు బీఈడీ కళాశాల్లో శిక్షణ తీసుకునేవారి సంఖ్యగా తగ్గింది. చివరకు ఎన్నికల సమయంలో డీఎస్సీ అంటూ హడావుడి చేసి జిల్లాకు 306 పోస్టులు కేటాయించారు. ఫిబ్రవరి 25న ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించారు. పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు మళ్లీ మోసం చేశారంటూ కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ లోపు ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ ప్రక్రియ వాయిదా పడింది. టెట్‌ పరీక్షా ఫలితాల విడుదల సైతం నిలిచిపోయింది. 2014, 2018ల్లో డీఎస్సీని విడుదలు చేసిన తెదేపా ప్రభుత్వం.. తాజాగా మరోసారి మెగా డీఎస్సీని ప్రకటించింది. దీంతో జిల్లాలో బీఈడీ, డీఈఎల్‌ఈడీ పూర్తి చేసిన 22 వేల మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


పింఛన్‌.. రూ.వెయ్యి పెరిగెన్‌

జిల్లాలో 3.15 లక్షల మందికి ప్రతి నెలా సామాజిక పింఛన్లు అందజేస్తున్నారు. ఇప్పటి వరకు వైకాపా ప్రభుత్వం రూ. 3వేలు ఇస్తుండగా- ఆ మొత్తాన్ని రూ. నాలుగు వేలకు పెంచుతూ సంతకం చేశారు. దీంతో ప్రతి నెలా లబ్ధిదారులకు ఇస్తున్న మొత్తం రూ. 94.50 కోట్ల నుంచి రూ. 126 కోట్లకు పెరగనుంది. ఏప్రిల్‌ నెల నుంచి రూ. నాలుగు వేల పింఛను అమలు చేస్తామని చెప్పారు. దాంతో ఏప్రిల్, మే, జూన్‌ నెలలకు సంబంధించి అదనంగా రూ. వేయి చొప్పున కలిపి జులై 1న ఒక్కొక్కరికి రూ. ఏడువేలు అందించనున్నారు. వైకాపా ప్రభుత్వం రాక ముందు నెలకు రూ.2వేలు ఉన్న పింఛను మొత్తాన్ని నాలుగేళ్లకు ఏటా రూ.250 పెంచుతూ ఎన్నికల ముందు నాటికి రూ. 3వేలకు పెంచారని, చంద్రబాబు ఒకేసారి రూ.4వేలు పెంచారని పింఛనుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 


అన్నార్థులకు.. అన్న క్యాంటీన్లు

రూ.అయిదుకే పేదల ఆకలి తీర్చుతున్న అన్న క్యాంటీన్లను మూసివేసి.. వైకాపా ప్రభుత్వం ఆ భవనాలను అయిదేళ్లుగా నిరుపయోగంగా మార్చింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు వాటిని పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం చేశారు. తద్వారా పేదల ఆకలి తీర్చడానికి మార్గం సుగమం చేశారు. తాజా నిర్ణయంతో నిత్యం వివిధ పనులపై నెల్లూరు నగరానికి వచ్చే పేదలు, కూలీలు, నిరాశ్రయులకు పూటకు రూ.అయిదుకే ఆహారం లభించనుంది. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కలిపితే రూ.15కే మూడుపూటలా ఆహారం లభించనుంది. గతంలో నెల్లూరు నగర పరిధిలో 10, కావలి, ఆత్మకూరు, కందుకూరులో ఒకటి చొప్పున.. మొత్తం 13 అన్న క్యాంటీన్లు నిర్వహించారు. 


రాకాసి చట్టానికి  చెల్లుచీటీ

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ తెదేపా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా రైతులు, ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పలు వివాదాస్పద నిబంధనలతో ఉన్న చట్టాన్ని రద్దు చేయడాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతించారు. జిల్లాలో సుమారు మూడు లక్షల మంది రైతులు ఉండగా.. దాదాపు 5 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. ఇప్పటికే వైకాపా నాయకులు ఇష్టానుసారం రికార్డులు మార్చడంతో.. నెల్లూరు రూరల్‌తో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో జరిగే స్పందనకు సుమారు 50కిపైగా రెవెన్యూ సంబంధిత సమస్యలే వస్తున్నాయి. నిర్ణీత సమయంలో అవి పరిష్కారం కావడం లేదనే విమర్శలు ఉన్నాయి. అలాంటిది ఈ చట్టం అమల్లోకి వస్తే.. మరింత ఇబ్బంది పడతామని భావించిన జిల్లావాసులు.. తెదేపా ప్రభుత్వ నిర్ణయంతో ఊపిరి పీల్చుకున్నారు. 


నైపుణ్య గణనతో..  ఉద్యోగావకాశాలు

 

ఇంటర్, డిగ్రీ, పాల్‌టెక్నిక్, ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన యువతతో పాటు పలువురు నిరుద్యోగులకు అయిదేళ్లుగా సరైన నైపుణ్య శిక్షణ లేదు. దీంతో ఉద్యోగావకాశాలు కనిపించక అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో యువతకు ఉపాధి కల్పించి వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే నైపుణ్య గణన దస్త్రంపై సంతకం చేశారు. అకౌంటింగ్, డేటా ఎంట్రీతో పాటు ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఐటీ తదితర రంగాల్లో శిక్షణ ఇప్పిస్తారు. పరిశ్రమలు, ఐటీ సంస్థలతో కళాశాలలను అనుసంధానం చేసి.. ఇటు విద్యార్థులు, అటు సంస్థలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజా నిర్ణయంతో వచ్చే అయిదేళ్లలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.


చక్కటి నిర్ణయం.. సంతోషం

- మహాలింగం

నిరుపేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లు ఇబ్బందులు పడ్డాం. చంద్రబాబుఅధికారంలోకి రాగానే మళ్లీ అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తుండటం ఆనందంగా ఉంది. చిరువ్యాపారులు, కార్మికులు, నగరానికి వచ్చే వారు రూ.5కే కడుపునిండా భోజనం చేస్తారు.


మేలు మరిచిపోలేం..

 - బేబమ్మ

పింఛనుపై ఆధారపడి జీవించే వారి కుటుంబాల్లో చంద్రబాబునాయుడు వెలుగులు నింపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే రూ.వెయ్యి పెంచడం ఆనందంగా ఉంది. మా లాంటి పేదలకు ఆసరాగా ఉంటుంది. చంద్రబాబు చేసిన మేలు మర్చిపోలేం.


రైతుల కుటుంబాల్లో ఆనందం 

 - చేజర్ల రమేష్‌

జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్‌టైటిలింగ్‌ యాక్ట్‌ను చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే రద్దు చేసి రైతుల కుటుంబాల్లో ఆనందం నింపారు. వైకాపా ప్రభుత్వం మా పొలాల వద్ద రాళ్లు తెచ్చి వేయడంతో ఆందోళన చెందాం. తాత ముత్తాతల నుంచి సంక్రమించిన ఆస్తులకు జగన్‌ ప్రభుత్వంలో రక్షణ లేకుండాపోయింది.


నమ్మకం కలిగించారు..

 - గూడూరు లోకేశ్, డీఎస్సీ 

జగన్‌మోహన్‌రెడ్డి అయిదేళ్లుగా యువతను మోసం చేశారు. నిరుద్యోగులు వలసలు వెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు. చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీపై తొలిసంతకం చేయడం సంతోషంగా ఉంది. నిరుద్యోగులను ఆదుకుంటారనే నమ్మకం కల్పించారు. నిరుద్యోగుల తరఫున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు