logo

జగనన్న కాలనీల్లో.. జగత్‌ కంత్రీలు!

సొంతింటి నిర్మాణం.. ప్రతి పేదవాడి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించి.. ఆ బృహత్తర బాధ్యతను గృహ నిర్మాణశాఖ అధికారులకు అప్పగించాయి.

Updated : 26 Jun 2024 06:52 IST

పేదల ఇళ్ల నిర్మాణ బాధ్యతను.. వైకాపా నేతలకు కట్టబెట్టిన వైనం
నాటి ఎమ్మెల్యేల అండతో నాణ్యతను విస్మరించి.. రూ.కోట్ల మేత 

వెంకటేశ్వరపురంలో నిర్మాణ దశలోనే పగుళ్లు

ఈనాడు, నెల్లూరు: సొంతింటి నిర్మాణం.. ప్రతి పేదవాడి కల. దాన్ని నెరవేర్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవకాశం కల్పించి.. ఆ బృహత్తర బాధ్యతను గృహ నిర్మాణశాఖ అధికారులకు అప్పగించాయి. కానీ, ఆ శాఖలో పనిచేసే కొందరు అధికారులు వైకాపా నాయకులతో చేతులు కలిపి.. పేదల సొమ్మును కాజేశారు. సుమారు 25వేల ఇళ్లను ఎలాంటి ఒప్పందాలు లేకుండా ఇతరులకు అప్పగించి.. నాసిరకం నిర్మాణాలను ప్రోత్సహించారు. తద్వారా రూ. కోట్లు వెనకేసుకున్నారు. పేదల ఇళ్ల సంగతేమోగానీ.. సదరు అధికారులు మాత్రం విలాసవంతమైన భవనాలు నిర్మించుకున్నారు. ఇంతటితోనైనా ఆగారా? మళ్లీ వైకాపానే అధికారంలోకి వస్తుందని భావించిన పలువురు సిబ్బంది.. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత బిల్లులు మంజూరు చేయడంతో పాటు వైకాపా నాయకులకు ఎన్నికల ఖర్చును అందజేశారు. రాష్ట్రంలో అధికారం మారడం.. తెదేపా అధికారంలోకి రావడంతో.. ఆందోళనకు గురైన వారంతా ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకునేందుకు వారి గడప తొక్కుతుండగా- ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి..  ఆప్షన్‌-3లో నిర్మించిన ఇళ్లపై విచారణ చేయించాలని ఆశాఖ మంత్రిని కోరినట్లు సమాచారం. మరోవైపు కేవలం విచారణతో సరిపెట్టకుండా.. ఆ శాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని, ఏళ్లుగా ఒకే ప్రాంతంలో పనిచేస్తూ అక్కడే ఉద్యోగోన్నతులు పొంది ప్రజల సొమ్మును కాజేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి నేతలు, లబ్ధిదారులు, ప్రజలు కోరుతున్నారు. 

కావలిలో.. నా సామిరంగ

కావలిలో ఈఈగా పని చేస్తున్న ఓ అధికారి.. గతంలో తెదేపా ప్రభుత్వంలో ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో ఇళ్లు నిర్మించకుండానే బిల్లులు కాజేసి సస్పెండ్‌ అయ్యారు. ఆ తర్వాత పోస్టింగ్‌ తెచ్చుకుని మరో జిల్లాకు వెళ్లారు. వైకాపా అధికారంలోకి రాగానే కావలి ప్రజాప్రతినిధితో ఆర్థికపరమైన ఒప్పందాలు చేసుకుని.. డీఈగా బదిలీపై వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కావలి డివిజన్‌ పరిధిలో జగనన్న కాలనీల్లో అక్రమాలకు తెరలేపారనే విమర్శలు ఉన్నాయి. ఆప్షన్‌-3లో భాగంగా లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ బాధ్యతను వైకాపా నాయకులకు అప్పగించడంలో కీలకంగా వ్యవహరించారు. సిమెంట్, స్టీలు పక్కదారి పట్టించడంతో పాటు నాసిరకం ఇళ్ల నిర్మాణాలను ప్రోత్సహించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఏడాది కిందట కురిసిన వర్షాలకు కావలిలోని ముసునూరు లేఅవుట్‌లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు పడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విజయవాడ నుంచి విచారణకు వచ్చిన అధికారులను కాలనీకి వెళ్లకుండా సాయంత్రం వరకు కార్యాలయంలోనే ఉంచి.. పడిపోయిన నిర్మాణాలకు హడావుడిగా గోడలు కట్టించి అక్రమాలను కప్పిపుచ్చునేందుకు యత్నించారు. ఆ తర్వాత అక్కడే ఈఈగా ఉద్యోగోన్నతి పొందారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఓ ప్రజాప్రతినిధి అనుచరుడికి భారీగా ఇళ్ల నిర్మాణ బాధ్యతను అప్పగించి.. ఎన్నికల కోడ్‌ వచ్చిన తర్వాత కూడా రూ.అయిదు కోట్ల మేర బిల్లులు చేశారనే విమర్శలు ఉన్నాయి. బుడంగుంట లేఅవుట్‌లో నాసిరకంగా ఇళ్లు నిర్మించడంపై లబ్ధిదారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 

పేదలపై ఏదీ దయా!

వైకాపా నాయకుల అండ చూసుకుని.. నిరుపేదలకు కేటాయించిన ఇళ్లల్లో నాణ్యతను విస్మరించి.. కనీస దయ చూపకుండా దోచుకున్నారని మరో అధికారిపై విమర్శలు ఉన్నాయి. నాటి అధికార పార్టీ నాయకుల దోపిడీకి సహకరించారనే ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు వెంకటేశ్వరపురంలో ఆప్షన్‌-3లో నిర్మించిన వేలాది ఇళ్లు.. లబ్ధిదారులు చేరకముందే పగుళ్లు రావడం అందుకు నిదర్శనమని అంటున్నారు. బుచ్చిరెడ్డిపాళెం, వెంకటాచలంలో కాలితో తన్నితే పడిపోయేలా నిర్మించారని ప్రతిపక్షాలు ఆరోపించినా.. ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా.. పట్టించుకోలేదు.  రాష్ట్ర కార్యాలయంలో తనకు తెలిసిన వారు ఉన్నారని, తనను ఎవరూ ఏమీ చేయలేరని చెబుతున్నట్లు సమాచారం. ఈయన దగ్గర ఇళ్ల నిర్మాణ బాధ్యతను తీసుకుని.. భారీగా సొమ్ము చేసుకున్న ఓ వ్యక్తి.. గత ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గంలో వైకాపా తరఫున ఖర్చు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదయగిరి, సంగం మండలాల్లో సిమెంట్, స్టీలు కాజేసిన వ్యవహారంపై తీవ్ర దుమారం రేగినా.. ఈ అధికారే వాటిని.. ఆ విచారణను బుట్టదాఖలు చేసినట్లు విమర్శలు ఉన్నాయి. రాయితీ సామగ్రికి సంబంధించిన రికార్డుల నిర్వహణ సక్రమంగా  లేకపోవడంపై రాష్ట్ర కార్యాలయానికి రావాలని పిలుపు వచ్చినా హాజరు కాలేదని సమాచారం.

నెల్లూరులో.. అన్నీ ఆయనే! 

గృహ నిర్మాణశాఖ నెల్లూరు డివిజన్‌లో ఉన్న ఓ అధికారి.. అక్కడే ఉద్యోగోన్నతి పొందారు. సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమాలకు ఊతమిచ్చారు. జిల్లా గృహ నిర్మాణశాఖలో పెద్దఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు అందినా.. కనీస చర్యలకు ఉపక్రమించలేదు. పైపెచ్చు అక్రమార్కులను ప్రోత్సహిస్తూ.. రూ. కోట్లు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో ఓ ఉన్నతాధికారి తమకు అనుకూలంగా ఉన్నారని చెబుతూ.. అక్రమార్కుల నుంచి రక్షిస్తూ సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ నుంచి వచ్చిన విజిలెన్స్‌ బృందాలు విచారణ చేసి.. అక్రమాలను వెలికితీసినా వాటిని బయటకు రానివ్వకుండా సహకరించారని సమాచారం. త్వరలో ఉద్యోగ విరమణ ఉండటంతో.. తనను ఇంకెవరూ ఏం చేయలేరని బహిరంగంగానే చెబుతున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు జిల్లాకు ఎంత సిమెంట్, స్టీలు వచ్చిందనే వివరాలు లేకపోయినా.. కాసుల యావతో పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ఏఈ నుంచి డీఈ ఉద్యోగోన్నతలను ప్రభుత్వం నిలిపివేస్తే.. జిల్లాలో ఖాళీగా ఉన్న డీఈ పోస్టులకు ఇన్‌ఛార్జులను పెట్టకుండా, రూ.లక్షలు తీసుకుని నేరుగా ఏఈలకు డీఈ పోస్టులు ఇచ్చేశారనే విమర్శలు ఉన్నాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని