logo

అనిశాకు చిక్కిన విద్యుత్తుశాఖ ఏఈ

నూతన ఇంటికి విద్యుత్తు మీటరు మంజూరుకు ఏకంగా రూ. 80 వేలు లంచం డిమాండ్‌ చేశారు ఓ ఏఈ.. ఒక్క మీటరు అంత లంచం డిమాండ్‌ చేయడంతో చేసేదేమీ లేక అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు బాధితుడు..

Published : 26 Jun 2024 02:48 IST

రూ. 50 వేలు తీసుకుంటుండగా పట్టివేత

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఏఈ శంకరయ్య 

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: నూతన ఇంటికి విద్యుత్తు మీటరు మంజూరుకు ఏకంగా రూ. 80 వేలు లంచం డిమాండ్‌ చేశారు ఓ ఏఈ.. ఒక్క మీటరు అంత లంచం డిమాండ్‌ చేయడంతో చేసేదేమీ లేక అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించారు బాధితుడు.. ఏఈ రూ. 50వేలు ముందస్తుగా తీసుకుంటుండగా- రెడ్‌ హ్యాడెండ్‌గా పట్టుకున్నారు. ఈ సంఘటన మంగళవారం అంబాపురం కొత్తూరు సబ్‌స్టేషన్‌ పరిధిలోని కావేరీ నగర్‌లో చోటు చేసుకుంది. అంబాపురం అక్కచెరువుపాడు వద్దనున్న ఓగూరుపాడులో హరిప్రసాద్‌ నూతన ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఆ క్రమంలో విద్యుత్తు మీటరు కావాల్సి ఉండగా.. అంబాపురం కొత్తూరు సబ్‌స్టేషన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఏఈ శివశంకరయ్య అందుకు రూ. 80వేలు లంచం డిమాండ్‌ చేశారు. ఇవ్వడం ఇష్టం లేని హరిప్రసాద్‌.. అనిశా అధికారులను ఆశ్రయించారు. మంగళవారం సబ్‌స్టేషన్‌లో రూ. 80వేల లంచంలో.. ముందస్తుగా రూ. 50వేలు ఇస్తుండగా.. అనిశా నెల్లూరు డీఎస్పీ శిరీష ఆధ్వర్యంలో అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏఈ శివశంకరయ్య అయిదేళ్లుగా ఇక్కడ పనిచేస్తున్నారు. గతంలో కోట, చిల్లకూరు, అనంతసాగరం మండలాల్లో పనిచేశారు. దాడిలో సీఐ ఆంజనేయరెడ్డి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని